భారత్ కి సొంతంగా ఎంటర్ ప్రెన్యూర్ షిప్ నమూనా వుండాలి : కృష్ణ గోపాల్
భారత్ లో ఆధ్యాత్మిక స్పృహ అనేది లోతుగా పాతుకుపోయిందని, దానితోనే సేవా స్ఫూర్తి కూడా ఇమిడి వుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ సర్ కార్యవాహ్ కృష్ణగోపాల్ అన్నారు. సేవా స్ఫూర్తితోనే ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ను ప్రోత్సహించడానికి సమాజం సిద్ధంగా వుందన్నారు. స్వావలంబి భారత్ అభియాన్ సంస్థ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సంగమాన్ని నిర్వహించారు. భారత్ ను సుసంపన్నం చేయడానికే ఈ సంగమాన్ని ప్రారంభించినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కృష్ణగోపాల్ మాట్లాడుతూ భారత దేశానికి సొంతంగా ఓ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ నమూనా వుండాలన్నారు.
దేశంలో అత్యధిక ప్రాంతాల్లో స్వావలంబన్ కేంద్రం నడిపే బాధ్యతను తీసుకోవాలని, దాని కేంద్రంగా ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. స్వావలంబన, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఈ సంగమాలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కేంద్రాల ద్వారా భారతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా కల్పించడానికి వీలవుతాయని తెలిపారు. భారత్ లో ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అనేది ఆధ్యాత్మికత, ప్రేమతో ముడిపడి వుందని, దానిని ప్రపంచ వేదికలపై ప్రచారం చేయాల్సిన అవసరం వుందని కృష్ణ గోపాల్ సూచించారు.
ఈ కార్యక్రమంలో స్వదేశీ జాగరణ్ మంచ్ అఖిల భారతీయ కో కన్వీనర్ డాక్టర్ రాజ్ కుమార్ మిట్టల్ రచించిన జైవిక్ ఉద్యమిత అన్న పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంటర్ ప్రెన్యూర్ షిప్ కమిషన్ ఏర్పాటుపై కూడా చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో స్వదేశీ జాగరణ్ మంచ్ అఖిల భారతీయ కన్వీనర్ సుందరం, స్వావలంబీ భారత్ అభియాన్ కోఆర్డినేటర్ భగవతీ ప్రకాశ్ శర్మ, కశ్మీరీ లాల్, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.