కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సముచితం.. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తుంది : సునీల్ అంబేకర్
ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చన్న కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్పందించింది. ”రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గత 99 సంవత్సరాలుగా దేశ పునర్నిర్మాణం మరియు సమాజ సేవలో నిరంతరం నిమగ్నమై ఉంది. జాతీయ భద్రత, ఐక్యత , సమగ్రత మరియు ప్రకృతి వైపరీత్యాల సమయాల్లోపని చేస్తున్న సంఘ్ పాత్రను ఎప్పటికప్పుడు దేశంలోని వివిధ రకాల నాయకత్వం ప్రశంసించింది. రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా, సంఘ్ వంటి నిర్మాణాత్మక సంస్థ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ప్రభుత్వ ఉద్యోగులను అప్పటి ప్రభుత్వం నిరాధారంగా నిషేధించింది. ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సముచితమైనది మరియు భారత ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయబోతోంది.” అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆఖిలభారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకలాపాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకుండా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించింది.ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.సంఘ్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా గత 40 ఏళ్లలో జారీ చేసిన మూడు వేర్వేరు ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వచ్చాయని కేంద్ర హోంశాఖ తెలిపింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వేర్వేరు సమయాల్లో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకలాపాల్లో కేంద్ర ఉద్యోగుల పాల్గొనకుండా నిషేధించింది. ఈ నిబంధన ఉల్లంఘించిన వారికి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.