అయోధ్యలో మందిర నిర్మాణం పూర్తైంది.. ఇక ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిర్మించాలి : మోహన్ భాగవత్
రామ జన్మభూమి ఉద్యమం ఎవ్వరికీ వ్యతిరేకంగా జరగలేదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. భారత దేశ ఆధ్యాత్మిక స్వీయ మేల్కొలుపే లక్ష్యంగా సాగిన అదో యాగమని అభివర్ణించారు. ఇందోర్ లో అహల్యాబాయి హోల్కర్ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ పురస్కారాన్ని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఉపాధ్యక్షుడు చంపత్ రాయ్ కి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి సరసంఘచాలక్ మోహన్ భాగవత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాముడు, కృష్ణుడు, శివుడు భారత దేశ ఆత్మ ప్రతీకలని పేర్కొన్నారు. ఈ దేశంలోని ప్రతి కణంలోనూ శివుడు వున్నాడన్నారు.

అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం సుదీర్ఘ పోరాటమే జరిగిందని ప్రస్తావిస్తూ.. కొన్ని శక్తుల నుంచి అడ్డంకులు ఎదుర్కొన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే.. రామజన్మభూమి ఉద్యమం భారత గుర్తింపు, చైతన్యం కోసం జరిగిన పోరాటమని పేర్కొన్నారు. జీవనోపాధి సమస్యలు పక్కనపెట్టి, మందిరానికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఉద్యమ సమయంలో విద్యార్థులు కూడా ప్రశ్నించిన సందర్భాలున్నాయని గుర్తు చేసుకున్నారు. అయితే రామ మందిరం భారత ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఆకాంక్షలకు లోతైన ప్రతీకగా అభివర్ణించారు. అయితే అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగిపోయిందని, ఇప్పుడు దానిని ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిర్మించాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. అహల్యా బాయి హోల్కర్ పాలనకు, రామరాజ్య భావనకు దాదాపు దగ్గరి పోలికలు వుంటాయంటూ హోల్కర్ దార్శనికతను, పరిపాలనా విధానాలను భాగవత్ ప్రశంసించారు.

మరోవైపు అహల్యాబాయి హోల్కర్ అవార్డు గ్రహీత చంపత్ రాయ్ మాట్లాడుతూ… సుదీర్ఘమైన రామజన్మ భూమి ఉద్యమానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు ప్రకటిస్తూ… ఈ అవార్డును వారందరికీ అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. అయోధ్య, మథుర, కాశీ దేవాలయాల విముక్తి విషయంలో 1983 లో మొదట కాంగ్రెస్ ఎంపీ దౌ దయాళ్ ప్రస్తావనను లేవనెత్తారని గుర్తు చేసుకున్నారు. రామ జన్మభూమి కోసం డెబ్బై ఐదు యుద్ధాలు జరిగాయని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఉద్యమం చారిత్రక ప్రాముఖ్యతను ఎత్తిచూపారు.
ప్రతిష్ట ద్వాదశి, పౌష్య శుక్ల ద్వాదశి పేర్లు ఇప్పుడు మారాయి. ఇంతకుముందు వాటిని వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి అని అనే వారు. ఇప్పుడు ప్రతిష్ట ద్వాదశి అంటున్నారు. ఎందుకంటే అనేక సంవత్సరాలు పరతంత్రాన్ని అనుభవించిన భారత్ నిజమైన స్వాతంత్ర్యాన్ని ఆ రోజున పొందింది. అంతకుముందు స్వాతంత్ర్యం ఉన్నప్పటికీ అది పూర్తిగా ప్రతిష్ఠితం కాలేదు భారత్ ఆగస్టు 15న స్వాతంత్ర్యం పొందినా అది రాజకీయపరమైనది మాత్రమే. మన భవిష్యత్తుని నిర్ధారించుకునే స్థితి వచ్చినప్పుడు మనం ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాము. అది కూడా మన ‘స్వ’దృష్టి ఆధారంగా ఏర్పడింది. కానీ అందులోని మౌలికభావాన్ని, సందేశాన్ని మనం అనుసరించలేకపోయాం. అందువల్ల మన కలలన్నీ నిజమయ్యాయి, మన సమస్యలన్నీ తీరాయి అనుకునే స్థితి సమాజంలో కనిపించలేదు. రాజ్యాంగంలో ‘స్వ’ దృష్టిని పొందుపరచుకున్నా, మన మనసుల్లో మాత్రం అది పూర్తిగా పాదుకొనలేదు. ఆ ‘స్వ’ ఏమిటి? రాముడు, కృష్ణుడు, శివుడు మొదలైన వారు కేవలం దేవతలేనా, వారికి పూజలు చేస్తే సరిపోతుందా? కానే కాదు రాముడు ఉత్తరం నుండి దక్షిణం వరకు ఈ దేశం మొత్తాన్ని సమైక్యపరిచినవాడు..