నిస్వార్థత, చిత్తశుద్ధితో చేసే సేవా కార్యక్రమాలే విజయవంతం అవుతాయి : మోహన్ భాగవత్

పూణె : మహారాష్ట్రలోని నందోషి ప్రాంతంలో ‘‘లతా -ఆశా మంగేష్కర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ శంకుస్థాపన కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏకనాధ్ షిండే తో పాటు పూణే మేయర్ మంజుషా నాగ్ పూరే, హృదయనాథ్ మంగేష్కర్, ఆనంద్ భోసాలే, ఇన్‌స్టిట్యూట్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ధనంజయ్ కేల్కర్, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మోహన్ భాగవత్ మాట్లాడుతూ నిస్వార్థం, చిత్తశుద్ధి అన్న గుణాలతో సేవా కార్యక్రమాలు చేస్తేనే అవి విజయవంతం అవుతాయని అన్నారు. మనమందరం ఒకటే అన్న భావన నుంచే సేవ అనేది ఉద్భవిస్తుందని, ఈ సేవా స్ఫూర్తే సమాజంలో మంచితనాన్ని నిరంతరం నిలబెడుతుందని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలలో సమాజం కూడా సాధ్యమైనంత మేరకు చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. నిస్వార్థత, ఐక్యతా భావంతో చేసే సేవే ధర్మం అని అభివర్ణించారు.

ఇక.. లతా మంగేష్కర్, ఆశా భోంస్లే గాత్రాలలో ప్రతిబింబించే భావోద్వేగపరమైన గాఢత అది అసాధారణమైందని, వారి సంగీతం చిరస్థాయిగా నిలిచిపోతుందని భాగవత్ ప్రకటించారు. విద్య, ఆరోగ్య రంగాలను సంరక్షించాలని ఇవి అత్యవసర జీవన అవసరాలుగా పరిగణించాలని సూచించారు. ఈ రంగాలలో సేవలు అందరికీ అందుబాటులో వుండాలని, నాణ్యమైన సేవలు కూడా అందాలని అభిలషించారు. ఈ దిశగా ప్రభుత్వం, అధికార యంత్రాంగం కృషి చేస్తున్నాయని, అయినా.. పౌరులు కూడా తమ బాధ్యతగా వీటికి సేవలు అందించాలని పిలుపునిచ్చారు. దేశంతో మమేకం అవ్వడం, సద్గుణాలతో చేసే సేవా స్ఫూర్తే ధర్మం యొక్క నిజమైన సారం అని భాగవత్ వివరించారు.

ఇక.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ లతా మంగేష్కర్ కుటుంబం దేశ భక్తిని ప్రశంసించారు. మంగేష్కర్ కుటుంబం కేవలం సంగీతానికి మాత్రమే ప్రఖ్యాతి చెందింది కాదని, వారి కుటుంబం ప్రగాఢమైన జాతీయ భావాలకు కూడా ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నారు. ఈ కుటుంబానికి వినాయక్ దామోదర్ సావర్కర్‌తో గాఢమైన అనుబంధం ఉందని గుర్తు చేశారు.

దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రి తమ సేవలను ఎన్నడూ వ్యాపారాత్మకం చేయలేదని, దానికి బదులుగా అత్యంత సేవా భావంతో వేలాది మంది రోగులకు చికిత్స అందించిందని ప్రశంసించారు. నేటి కాలంలో అతి తక్కువ ధరలలో, నాణ్యమైన వైద్య సేవలు అత్యంత అవసరమని నొక్కి చెప్పారు. ఆర్థిక కారణాల రీత్యా స్వచ్ఛంద సంస్థలు కూడా వాణిజ్య ధోరణుల వైపే మొగ్గు చూపుతున్నాయని, అయితే.. దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రి మాత్రం కేవలం సేవకే అంకితమై నిలిచిపోయిందని ప్రశంసించారు. ఈ వారసత్వం ఇప్పుడు ‘లతా-ఆశా’ మంగేష్కర్ ఆసుపత్రి ద్వారా మరింత విస్తరిస్తోందని పేర్కొన్నారు.

ఇక.. ఈ ఆస్పత్రికి వెళ్లే దారులను మరింత విస్తరిస్తామని, మరిన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తామని సీఎం ఫడ్నవీస్ ప్రకటించారు. నీటి కొరత సమస్యను కూడా పరిష్కరించడంలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు. స్వచ్ఛంద సంస్థలకు రాయితీలు కల్పించే దిశగా కూడా కృషి చేస్తామని కూడా ప్రకటించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *