ఆరెస్సెస్ ప్రచారక్ మల్లాపురం భీష్మాచార్యులు కన్నుమూత
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) జ్యేష్ఠ ప్రచారక్ మల్లాపురం భీష్మాచార్యులు (73) గురువారం రాత్రి (సెప్టెంబర్ 12, 2024) తుదిశ్వాస విడిచారు. ఆయన నాగపూర్‌లో జరిగిన ఓ సమావేశంలో పాల్గొని హైదరాబాద్ తిరిగి వస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను వార్ధా, సేవాగ్రాం ఆస్పత్రికి తీసుకువెళ్లినప్పటికీ, అక్కడ కన్నుమూశారు. భీష్మాచార్యుల పార్థివ దేహాన్ని స్వస్థలమైన భాగ్యనగర్‌కి శుక్రవారం తీసుకువచ్చారు. ఆయన కోరిక మేరకు శనివారం ఆయన భౌతికకాయాన్ని భాగ్యనగర్‌లోని ఆస్పత్రికి దానం చేస్తారు.
భీష్మాచార్యులు మే 31, 1951లో జన్మించారు. ఆయనకు ముగ్గురు సోదరులు ఒక సోదరి ఉన్నారు. భాగ్యనగర్‌లోని ఖైరతాబాద్‌లో శివాజీ శాఖ నుంచి స్వయంసేవక్‌గా జీవితకాలపు అనుబంధాన్ని కొనసాగించారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత 1970లో సంగారెడ్డి నగర ప్రచారక్‌గా పూర్తికాల ప్రయాణాన్ని ప్రారంభించారు. తర్వాత విభాగ్ ప్రచారక్ బాధ్యతలు కూడా నిర్వహించి అనంతరం తమిళనాడు రాజధాని చెన్నైలో మహానగర ప్రచారక్‌గా అడుగుపెట్టారు. ఆ తర్వాత సేలం పట్టణంలో విభాగ్ ప్రచారక్‌గా బాధ్యతలు స్వీకరించి తన సేవలను కొనసాగించారు. ఎమర్జెన్సీ కాలమైన 1975-77 మధ్య కార్యకర్తగా అజ్ఞాతంలో భీష్మాచార్యులు పనిచేశారు. తర్వాత 1980 మధ్య కాలంలో సమస్యాత్మకంగా మారిన పంజాబ్‌లో శారీరక్ ప్రముఖ్‌గా ఉన్నారు.
భీష్మాచార్యుల సేవలు భారతదేశం ఆవలకు కూడా విస్తరించాయి. యోగా ఉపాధ్యాయునిగా ఆయన ఫిజీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాలలోని హిందూ సమాజంతో కలసి సేవలందించారు. విశ్వవిభాగ్‌కు తన తోడ్పాటును అందించారు. ప్రత్యేకించి రామజన్మభూమి ఉద్యమ కాలంలో ఆయన ఫిజీలో నిర్వహించిన భారీ ర్యాలీ ఎంతో విశేషమైనది. ఈ ర్యాలీలో అయోధ్య రామమందిర నిర్మాణానికి మద్దతుగా 15 వేలమంది పాల్గొని చరిత్ర సృష్టించారు. శ్రీలంక, సింగపూర్ దేశాల్లోనూ సేవలు చేశారు.
ఇటీవలి కాలంలో భీష్మాచార్యులు గుండెపోటుకు గురికావడం, ఇంకా కోవిడ్ కారణంగా తన కదలికలను పరిమితం చేసుకున్నప్పటికీ, సంఘ కార్యకలాపాల్లో తమ శక్తిమేరకు నిమగ్నమయ్యారు. ఆయుర్వేదం, భారతీయ వైద్య విధానాల పట్ల అత్యంత విశ్వాసం గల ఆయన, మెరుగైన ఆరోగ్యం కోసం దేశీ గోవు పాలతో 40 రోజుల ప్రయోగాత్మక ఆహార విధానాన్ని అవలంబించారు.
ప్రచారక్‌గా ఉంటూ అనేకమంది కార్యకర్తలను తమ ప్రేమాభిమానాలతో ప్రభావితం చేసిన భీష్మాచార్యుల ఆత్మకు శాంతి కలగాలని సంఘ శ్రేణులు, దేశ విదేశాల్లోని శ్రేయోభిలాషులు నివాళులు అర్పిస్తున్నారు.