జోధ్ పూర్ వేదికగా రెండు రోజుల పాటు ‘‘సమన్వయ బైఠక్’’ : సునీల్ అంబేకర్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ సమన్వయ బైఠక్ జోధ్ పూర్ వేదికగా ఈ నెల 5 నుంచి 7 వ తేదీ వరకు జరగనుందని అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ వెల్లడించారు. ఈ సమన్వయ బైఠక్ లో ఆరెస్సెస్ తో ప్రేరణ పొంది, వివిధ క్షేత్రాలలో సమాజం కోసం పనిచేస్తున్న 32 సంస్థలు ఈ సమావేశంలో పాల్గొంటాయని ప్రకటించారు.
జోథ్ పూర్ వేదికగా మూడు రోజుల పాటు సంఘ్ సమన్వయ్ బైఠక్ నేపథ్యంలో సునీల్ అంబేకర్ గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సమావేశంలో వివిధ క్షేత్రాలకు సంబంధించి, 320 మంది కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు.
ఈ సమావేశంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ మార్గదర్శనం చేస్తారని అలాగే సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే, సహ సర్ కార్యవాహలు డా. కృష్ణగోపాల్, సీ.ఆర్. ముకుంద, అరుణ్ కుమార్, రామదత్త చక్రధర్, అతుల్ లిమానియే, అలోక్ కుమార్ తో పాటు పలువురు సంఘ అధికారులు కూడా పాల్గొంటారని తెలిపారు.
ఈ సమావేశంలో సంఘ ప్రేరేపిత వివిధ సంస్థలు తమ వార్షిక నివేదికలను సమర్పిస్తారని, అలాగే ఇందులో యేడాది పాటు తమ అనుభవాలు, సాధించిన విజయాలను సమన్వయ బైఠక్ ముందు వుంచుతారని అన్నారు. వీటిలో ముఖ్యంగా ఏబీవీపీ, కిసాన్ సంఘ్, బీఎంస్, విద్యా భారతి, సక్షం లాంటి సంస్థలు కూడా వుంటాయని, దేశంలోని వివిధ ప్రాంతాల సామాజిక-ఆర్థిక పరిస్థితులు, ముఖ్యంగా పంజాబ్, బెంగాల్, అస్సాం మరియు ఈశాన్య ప్రాంతాల గిరిజన ప్రాంతాల సమస్యలను కూడా చర్చిస్తారన్నారు.
వీటితో పాటు పంచ పరివర్తన్ లాంటి అంశాలను కూడా చర్చిస్తామన్నారు. అలాగే జాతీయ విద్యా విధానం 2020పై కూడా చేసిన కృషి, ప్రస్తుత పరిస్థితిపై కూడా సమీక్ష వుంటుందన్నారు.గిరిజన సమాజంలో జరుగుతున్న సానుకూల మార్పులు మరియు వారిని ప్రధాన స్రవంతితో అనుసంధానించడానికి చేస్తున్న ప్రయత్నాలను కూడా సమీక్షిస్తారు. దీనితో పాటు, రాబోయే శతాబ్ది సంవత్సరం (2025-26) కార్యక్రమాల రూపురేఖలను కూడా సమీక్షిస్తామన్నారు.
ఇక.. అక్టోబర్ 2 న విజయదశమి రోజున నాగపూర్ కేంద్రంగా విజయ దశమి ఉత్సవం జరుగుతుందని, అలాగే మండల, గ్రామ, బస్తీ స్థాయిలో కూడా స్వయంసేవకులు ఈ ఉత్సవాన్ని గణవేష లో జరుపుకుంటారని తెలిపారు.ఇక.. కార్య శతాబ్ది సందర్భంగా దేశ వ్యాప్తంగా హిందూ సమ్మేళనాలు, సమరసత సమావేశాలు, ప్రధాన వ్యక్తులతో సమావేశాలు, యువజన సమ్మేళనాలు కూడా జరుపుతామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *