ఈ నెల 31 నుంచి పాలక్కడ్ వేదికగా ఆరెస్సెస్ సమన్వయ బైఠక్ : సునీల్ అంబేకర్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ సమన్వయ బైఠక్ పాలక్కడ్ లోని అహల్య క్యాంపస్ లో జరుగుతాయని అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ ప్రకటించారు. ఈ నెల 31 నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకూ ఈ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఈ మూడు రోజుల పాటు జరిగే సమావేశాల్లో సామాజిక అంశాలు, సామరస్యంతో పాటు దేశ భద్రతతో పాటు మొత్తం ఐదు అంశాల గురించి కూలంకషంగా చర్చిస్తామని వెల్లడించారు. పర్యావరణ అనుకూల జీవనశైలి, విలువలతో కూడిన కుటుంబ వ్యవస్థ, సామరస్యం, స్వదేశీ, పౌర విధులు ఈ పంచ పరివర్తన్ అంశాలపైనే చర్చిస్తామని వివరించారు.
పాలక్కడ్ కేంద్రంగా జరిగే ఈ మూడు రోజుల సమావేశాల్లో ఆరెస్సెస్ కార్యకారిణి సభ్యులు, సంఘ్ ను ప్రేరేపిత సంస్థగా భావించే వివిధ సంస్థల నుంచి 230 మంది ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఈ సంస్థలన్నింటికీ 50 నుంచి 57 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర వుందని, ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి వున్న సంస్థలేనని, అలాగే సామాజిక పరివర్తనలో అత్యంత ముందంజలో వున్నవారేనని తెలిపారు. ప్రారంభ దశల్లో ఈ సంస్థలు ఆరెస్సెస్ నుంచి కొంత మంది కార్యకర్తలను తీసుకున్నారని, కానీ… తర్వాత తర్వాత కాలంలో వారే స్వతంత్రంగా తమ తమ సంస్థలను అభివృద్ధి చేసుకున్నారని వివరించారు.
వీటన్నింటి మధ్యా సమన్వయం చేసే వ్యవస్థ ఈ సమావేశాల్లో వుంటుందని తెలిపారు. ఈ సమన్వయ సమావేశంలో ప్రతి సంస్థ కూడా కార్యక్షేత్రాల్లో తమ తమ అనుభవాలను పంచుకుంటారని, వారి పోరాటాలు, వారి సాధించిన విజయాలు, సమస్యలను కూడా ఇందులో చర్చిస్తారన్నారు. కార్యక్షేత్రంలో తమకు ఎదురైన అనుభవాలు, నేర్చుకున్న పాఠాలు, మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అంశాలన్నింటినీ కూలంకషంగా చర్చించుకోవడానికి, పంచుకోవడానికి ఈ సమావేశాలు ఓ వేదికగా నిలుస్తాయని తెలిపారు. ఈ సమావేశాల్లో బృంద చర్చలు కూడా వుంటాయని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశాల్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘ చాలక్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే, సహ సర్ కార్యవాహలు డా. కృష్ణ గోపాల్, సీఆర్. ముకుంద, అరుణ్ కుమార్, రామ్ దత్త్, అలోక్ కుమార్, అతుల్ కుమార్ తో పాటు వివిధ కార్యవిభాగాల బాధ్యులు కూడా పాల్గొంటారన్నారు. మరోవైపు 2025 సంవత్సరం సంఘ శతాబ్ది సంవత్సరం అని, ఈ సందర్భంగా పంచపరివర్తన్ అనే మోడల్ భారీ స్థాయిలో క్షేత్ర స్థాయిలోకి విస్తరిస్తామన్నారు. ఈ అన్నింటితో పాటు ప్రధానంగా బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న హింస, అకృత్యాలను కూడా ఈ బైఠక్ లో చర్చిస్తామని సునీల్ అంబేకర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *