దేశభక్తి గల పౌరులుగా మారి, దేశానికి సేవ చేయండి : దత్తాత్రేయ హోసబళే
శ్రీ సరస్వతీ విద్యా మందిర్ సంస్కారవంతమైన, నాణ్యమైన విద్యను అందించడంలో అగ్రగామిగా వుందని ఆరెస్సెస్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే అన్నారు. హాఫ్లాంగ్ లో ఓ రోజు బస చేసిన సందర్భంగా దత్తాజీ అక్కడి విద్యార్థులు, పాఠశాల కుటుంబీకులతో ప్రత్యేకంగా సంభాషించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణల వున్న రాముడి విగ్రహానికి పూల మాలలు వేసి, ఆశీస్సులు అందుకున్నారు. సెప్టెంబర్ 11న చికాగోలో తన చారిత్రాత్మక ప్రసంగంతో స్వామి వివేకానంద భారత దేశ కీర్తి పతాకాన్ని విశ్వవ్యాపితం చేశారని విద్యార్థులకు తెలియజేశారు.
స్వామి వివేకానంద పుస్తకాలను బాగా చదవాలని, వారి లక్షణాలను విద్యార్థులు తమ జీవితంలో అలవర్చుకోవాలన్నారు. అందరూ దేశభక్తి గల పౌరులుగా మారాలని, భారత మాతను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేయాలని పిలుపునిచ్చారు. అలాగే తమ జీవితంలో స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని, దాని దిశగా అడుగులు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాభారతి ఈశాన్య ప్రాంత సంఘటనా కార్యదర్శి పవన్ తివాీ, మహేశ్ భగవత్, అసోం ప్రాంత ప్రచారక్ వశిష్ఠ బుజర్బరువా తదితరులు పాల్గొన్నారు.