సమస్యలతో వున్న ప్రపంచానికి పరిష్కారం చూపాల్సిన బాధ్యత భారత్ కర్తవ్యం : మోహన్ భాగవత్
భారత్ ఎల్లప్పుడూ ప్రపంచానికి శాంతి, ఆనందాన్ని ఇవ్వడానికే వుందని, ఇదో ప్రత్యేకమైన దేశమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. ప్రపంచానికి ధర్మాన్ని పంచడానికే భారత్ జీవిస్తోందని, అందుకే మన జాతీయ జెండా మధ్యలో ఓ ధర్మచక్రం వుందని వివరించారు. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భువనేశ్వర్ లోని ఆరెస్సెస్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మోహన్ భాగవత్ మాట్లాడుతూ హిందూ ధర్మం అందర్నీ కలుపుకొని వెళ్తుందని, అందరినీ ఏకం చేస్తుందని, అలాగే ఉద్ధరిస్తుంది కూడా అని వివరించారు. అందుకే ఈ ధర్మం ఈ లోకంలో, పరలోకంలోనూ అందరికీ ఆనందాన్ని పంచుతుందన్నారు. ఇంతటి మహత్తరమైన ధర్మాన్ని ప్రపంచానికి అందించింది భారత దేశమని, ఇదే మన ప్రత్యేకత అని వివరించారు.
ప్రస్తుతం కొన్ని సమస్యలతో ప్రపంచం సతమతమవుతోందని, ఇలాంటి ప్రపంచానికి ఆనందం, శాంతి, గౌరవాన్ని ఇవ్వంతో పాటు మన ధర్మం, దార్శనికత ఆధారంగా పరిష్కార మార్గాలను చూపాల్సిన బాధ్యత కూడా భారత్ పై వుందని, ఇది మన కర్తవ్యమని వివరించారు.ఇంతటి మహత్తర కర్తవ్యం ఇప్పుడు దేశం ముందు వుందని అన్నారు. స్వాతంత్రం కోసం మన పూర్వీకులు ఎంతటి త్యాగాలు, కృషి చేశారో… అంతటి త్యాగం, కృషిని మనం కూడా చేయాల్సిన అవసరం వుందన్నారు.
‘‘మనకు స్వాతంత్రం సిద్ధించి 78 సంవత్సరాలు పూర్తయ్యాయి. దీనిని సాధించడానికి చేసిన ప్రయత్నాలను ఆలోచిస్తే… బ్రిటిష్ బానిసత్వం నుండి విముక్తి పొందడానికి మొదటి ప్రయత్నం 1857 లో జరిగింది. అప్పటి నుంచి నిరంతరంగా కొనసాగింది. అనేక మార్గాల్లో ప్రయత్నాలు జరిగాయి. ఆయుధాలు ధరించి కొందరైతే, ఆయుధాలు ధరించని వారు మరికొందరు. ప్రజలు తమ ప్రాణాలను త్యాగం చేస్తూనే వున్నారు. జైళ్లకు వెళ్తూనే వున్నారు. పరిస్థితులు మారినా… ఆ సమాజం నాయకులు స్వాతంత్రం సాధించడానికి అనుకూలమైన ప్రయత్నాలన్నీ చేశారు. నేను కూడా స్వాతంత్రం సిద్ధించిన తర్వాతే పుట్టాను. 78 సంవత్సరాల తర్వాత మన పూర్వీకులు స్వాతంత్ర సాధన కోసం చేసిన ప్రయత్నాలను నెమరు వేసుకోవాలి. ఇప్పటి తరానికి అత్యంత సునాయాసంగా లభించింది. కానీ స్వాతంత్రం పొందడానికి చాలా పరిశ్రమ చేయాల్సి వుంది. చాలా కష్టపడాల్సి వచ్చింది.’’ అని పేర్కొన్నారు.
చివరికి 1947, ఆగస్టు 15 న భారత దేశానికి స్వాతంత్రం వచ్చిందని, బ్రిటీషు వారు దేశాన్ని వదిలి వెళ్లిపోయారన్నారు. ఈ దేశంలో మన పాలన వచ్చేసిందని, ప్రతి ఐదు సంవత్సరాలకు ఓ సారి నేతలను ప్రజలు ఎన్నుకుంటున్నారని తెలిపారు.ఇప్పుడు మన దేశాన్ని మనే పాలించుకుంటున్నామని, మన పద్ధతుల్లోనే పాలన సాగిస్తున్నామని, దీనంతటికీ కారణం స్వాతంత్రం సిద్ధించడమే అని అన్నారు.
నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబిస్తూ, 2000 సంవత్సరాలుగా లెక్కలేనన్ని ప్రయోగాలు, ప్రయత్నాలు ఉన్నప్పటికీ, ప్రపంచ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు అస్పష్టంగానే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సమయంలో సార్వత్రిక శ్రేయస్సును పెంపొందించే మతపరమైన, సాంస్కృతిక సూత్రాలలో పాతుకుపోయిన భారతీయులు ప్రపంచానికి కొత్త దృక్పథాన్ని అందించాలని డా. భగవత్ కోరారు. “ప్రపంచానికి ఒక పరిష్కారాన్ని అందించడం, మతపరమైన సూత్రాలలో పాతుకుపోయిన మన దృక్పథం ఆధారంగా ఆనందం, శాంతితో నిండిన కొత్త ప్రపంచాన్ని సృష్టించడం మన విధి” అని ఆయన పేర్కొన్నారు.