కుటుంబానికి అత్తా కోడళ్ల బంధమే ప్రముఖం : ఆరెస్సెస్ ఆధ్వర్యంలో అత్తా కోడళ్ల సమ్మేళనం
కుటుంబ వ్యవస్థను పటిష్ఠం చేయడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. బర్మార్ లో అత్తా- కోడళ్ల సమ్మేళనాన్ని నిర్వహించింది. వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన కుటుంబాల నుంచి అత్తా- కోడళ్లు ఉత్సాహంగా హాజరయ్యారు. ఈ సమావేశంలో మహిళలు తమ అనుభవాలను పంచుకున్నారు. సమాజంలో అత్తా కోడళ్ల మధ్య వున్న సంబంధాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. తల్లి, కూతురిలా.. అత్తా కోడళ్లు కలిసి జీవించాలన్నారు. ఈ సందర్భంగా పలు ఉదాహరణలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా అత్తా- కోడళ్లు ఒకరినొకరు శాలువాలను, జ్ఞాపికలు ఇచ్చి సత్కరించారు.
ఈ సందర్భంగా కోడలిని కూతురిలా చూసుకోవడం అత్తగారి విధి అని అత్తలు చెబితే… అత్తగార్ని సొంత తల్లిలా చూసుకోవాలని కోడళ్లు చెప్పారు. ఇలా చూసుకుంటూ వెళితే,కుటుంబ వ్యవస్థ సంవత్సరాలు సంవత్సరాల పాటు ఐక్యంగా వుంటుందని, ఇతరులకు ఆదర్శవంతంగా వుంటుందన్నారు. ఈ సందర్భంగా ఓ అత్తా కోడలు తమ అనుభవాన్ని పంచుకున్నారు. తాను తన అత్తగారింటికి వచ్చిన సమయంలో ఇంటర్ పూర్తైందని, ఆ తర్వాత అత్తగారే తనను పైచదువులు చదివించి, నీట్ కూడా పూర్తి చేయించిందని సగర్వంగా ప్రకటించింది. ఇక.. అత్తగారు మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో తన కోడలికి మంచి ఉద్యోగం కూడా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తన కోడలిని తాను అచ్చు కూతురిలా చూసుకుంటానని, దీంతో తమ కుటుంబం అద్భుతంగా నడుస్తోందని ప్రకటించారు. అయితే.. కోడళ్లు కూడా ఇంటి గౌరవాన్ని కాపాడుకుంటూ తమ విధిని నిర్వర్తించాలని ఆ అత్తగారు సూచించారు.
ఇక… మరో కోడలు కూడా తన అనుభవాన్ని పంచుకున్నారు. ప్రతి అత్తగారు తన కోడలు బాగుండాలని కోరుకునే అత్తగారూ వున్నారన్నారు. అందుకే ప్రతి తల్లి తన కూతురికి మంచి విలువలు ఇవ్వాలని, అత్తగారు తన కోడలిని కూతురిలా చూసుకోవాలన్నారు. తద్వారా ఆమె తన అత్తగారింట్లో సంతోషంగా జీవించగలదన్నారు.
ఇక… ఈ కార్యక్రమానికి ఆరెస్సెస్ జ్యేష్ఠ ప్రచారక్ నందలాల్ బాబా కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జీవితంలో కష్ట నష్టాలు వస్తూనే వుంటాయని, కానీ… కుటుంబ సంబంధాలు, ఇతర మానవ సంబంధాలు చాలా ముఖ్యమైనవని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఓ ఘటనను ఉదాహరించారు. రామచంద్రుడు 14 సంవత్సరాల పాటు వనవాసం చేయాల్సి వచ్చిందని, కృష్ణుడు కూడా జైలులోనే జన్మించాడని అన్నారు.
కుటుంబంలో అత్త, కోడలు సంబంధం ప్రేమకు ఆధారమని నందలాల్ అన్నారు. ఈ సంబంధం మొత్తం కుటుంబ సంబంధంతో ముడిపడి వుంటుందన్నారు. సుఖదుఖాలలో కలిసి వుండాలని, నిరంతరం భగవంతుడి నామస్మరణ చేస్తూ వుండడం ద్వారా జీవితం అన్న వాహనం సజావుగా సాగుతుందని సూచించారు.
ఇక… బార్మార్ సంఘచాలక్ మనోహర్ లాల్ బన్సల్ మాట్లాడుతూ… పరస్పర సంబంధాలే కుటుంబ వ్యవస్థను బలోపేతం చేస్తాయన్నారు. అత్తాకోడళ్లతో కలిసి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం బర్మార్ లో ఇదే ప్రథమమని అన్నారు. పంచపరివర్తన్ లో భాగంగా కుటుంబ ప్రబోధన్ అన్న విషయాన్ని సరసంఘచాలక్ మోహన్ భాగవత్ పదే పదే ప్రస్తావిస్తున్నారన్నారు.
సంఘ్ శతాబ్ది సంవత్సరం సందర్భంగా పంచపరివర్తన్’’ అన్న దానిని సంఘ్ పరిచయం చేసింది. పంచపరివర్తన్ లో సామాజిక సమరసత, పర్యావరణం, స్వదేశీ భావన, నాగరికత కర్తవ్యం, కుటుంబ ప్రబోధన్ అంశాలున్నాయి.