భారత దేశ వృద్ధిని ట్రంప్ అంగీకరించలేకపోతున్నారు : రాజ్ నాథ్ సింగ్
రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై విమర్శలకు దిగారు. భారత దేశ వృద్ధిని ట్రంప్ అంగీకరించలేకపోతున్నారని విసుర్లకు దిగారు. అందరికీ తామే బాస్ అనుకునే వారికి భారత్ వృద్ధి నచ్చడం లేదన్నారు. తమతో సమానంగా భారత్ మారకూడదన్న అహంకారంతోనే దేశాభివృద్ధిని కుంటుపడేలా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే ఆ దేశాల ఉత్పత్తుల కంటే భారత వస్తువులు, ఉత్పత్తులు మరింత ఖరీదయ్యేలా చేయడానికి అధిక సుంకాలు విధిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. దేశాభివృద్ధిని ఆపలేరన్నారు.
ట్రంప్ మీద సూటిగా చేసిన విమర్శలలో రాజ్ నాథ్ సింగ్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ‘సబ్కే బాస్'(అందరికీ మేమే బాస్) అనే పదప్రయోగం చేశారు. అందరికీ మేమే బాస్ అనుకునే వాళ్లకి భారత వృద్ధి నచ్చలేదన్నారు. తన సందేశాన్ని అత్యంత దృఢంగా, పూర్తి స్పష్టంగా చెప్పేశారు రాజ్ నాథ్ సింగ్. భారతదేశం సూపర్ పవర్ గా మారకుండా ఎవరూ ఆపలేరని తేల్చి చెప్పారు.
‘కొంతమంది భారతదేశం పురోగతిని అంగీకరించలేకపోతున్నారు. వారు దానిని పాజిటివ్‌గా తీసుకోవడం లేదు. భారతదేశం ఇంత వేగంగా ఎలా అభివృద్ధి చెందుతోంది? అని మదనపడుతున్నారు. ‘ మేడ్-ఇన్-ఇండియా ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేసినప్పుడు వాటిని మరింత ఖరీదైనదిగా చేయడానికి ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని ఆయన అన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా.. అతి త్వరలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారనుందని ప్రకటించారు.