సద్గురు మలయాళ స్వామి సమతా కార్యాన్ని కొనసాగిస్తున్న సామాజిక సమరసతా వేదిక

“సృష్టిలోని సమస్త జీవరాశుల్లోకి మానవుడు శ్రేష్ఠమైన ప్రాణి. అందరి హృదయాల్లో భగవత్ స్వరూపం ఉంది. ‘నేనెవరిని?’ అని ప్రశ్న వేసుకుంటే ఇది కనుపిస్తుంది. అది శరీరంకన్నా భిన్నమైంది. దాన్ని దర్శించగలిగితే ప్రతి మనిషీ సాటి మనిషిని ఎలాంటి వివక్ష లేకుండా ప్రేమించగలుగుతాడు. సద్గురు  మలయాళ స్వామి తమ జీవితాన్ని, తపస్సుని ఈ లక్ష్యం కోసమే వెచ్చించారు” అని శ్రీపరిపూర్ణానంద గిరి స్వామి అన్నారు.  మలయాళస్వామి సాక్షాత్తు వ్యాస భగవానుడి అవతారమేనని, అన్ని కులాల వారిని వారు శ్రేష్ఠ మానవులుగానే భావించి, ఆశీర్వదించేవారని, అలాగే వారు అన్ని వర్ణాల వారికి వేదవిద్య అభ్యసించే అవకాశం కల్పించిన సమతామూర్తి అని పేర్కొన్నారు.

సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో ‘ఎమెస్కో ‘ ముద్రించిన మలయాళ స్వామి వారి ‘శుష్కవేదాంత తమో భాస్కరం ‘ కీలకాంశాల సంక్షిప్త సరళ తెలుగు రచన (మోక్షానికి అర్హత: కులమా? గుణమా?)ను శ్రీ పరిపూర్ణానంద గిరి స్వామి యేర్పేడు ఆశ్రమంలో జరిగిన మహాసభలో జూలై 17న ఆవిష్కరించారు. మలయాళ స్వామి వారి ఆశయాలను, వారి కృషి ఫలితాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళటంలో సామాజిక సమరసతా వేదిక కృషిని ఆయన అభినందించారు.

ఆంధ్రప్రదేశ్ సామాజిక సమరసతా వేదిక కన్వీనరు నరసింగనాయుడు స్వామీజీని దుశ్శాలువతో గౌరవించారు.మలయాళస్వామి జీవన సందేశంపై ‘నమో నమామి ‘ అనే సమరసతా సందేశ గీతం ఆయన ఆలపించారు. ‘మోక్షానికి అర్హత: కులమా? గుణమా?’ రచించిన పాత్రికేయులు వల్లీశ్వర్ ని స్వామీజీ శాలువతో, పూలమాలతో అభినందించి, ఆశీర్వదించారు.

అనాదిగా హిందూ ధర్మంలో ఉన్న సమతను పునరుద్ధరించాలి
“హిందూ ధర్మంలో అనాదిగా సమత ఉంది. మధ్య కాలంలో వచ్చిన కుల అసమానతలు,అస్పృశ్యతలను మనం దూరం చేయాలి” అని రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్-ఆర్.ఎస్.ఎస్.కార్యదర్శి వేణుగోపాల్ నాయుడు అన్నారు. “హిందూ రక్తంలోనే అనాదిగా సమరసతా భావన ఉంది. వేద కాలంలో కులం లేదు. తండ్రి ఆచార్యుడై తన కుమారులను విద్యావంతులను చేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తిని చేపట్టారు. అలాంటి వృత్తికి తదనంతర కాలంలో కులం అనే నామకరణం చేశారు. వృత్తి కులంగా రూపాంతరం చెందిన తర్వాత అసమానతలకు దారి తీసింది. హిందువులు అందరినీ సంఘటితపరచడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నిరంతరం కృషి చేస్తోంది. సంఘ్ తృతీయ సర్ సంఘచాలక్ బాలా సాహెబ్ దేవరస్ ‘అంటరానితనం నేరం కాకపోతే మరేదీ నేరం కాదు ‘ అని తమ సందేశంలో పేర్కొన్న విషయం మనం గుర్తు ఉంచు కోవాలి.

సంఘ కార్యకర్తలు కులంతో పని లేకుండా అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఆట పాట, ఆహార స్వీకరణలోనూ తారతమ్యాలు లేకుండా కలిసి ఉంటారు. హిందవః‘ సోదరా సర్వే న హిందుః పతితోభవేత్’ అన్న సందేశాన్ని అందరి మఠాధిపతుల చేత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చెప్పించింది. 11వ శతాబ్దంలో భగవద్రామానుజాచార్యులు అస్పృశ్యతను నిరసించారు. అన్ని కులాల వారిని సమీకరించి విద్యాబుద్ధులు చెప్పారు. 900 ఏళ్ల తర్వాత శ్రీ రామానుజులు సూచించిన మార్గంలో శ్రీ మలయాళ స్వామి వారు ఏర్పేడులో శ్రీ వ్యాసాశ్రమం స్థాపించి అందరికీ విద్యనందించారు. స్వామి వివేకానంద, కేరళలో నారాయణ గురు వంటి మహనీయులు సమాజాన్ని ఏకీకృతం చేయడానికి అంటరానితనం సమసిపోవాలని అభిలషించారు.మలయాళ స్వామి వారి ఆశయాల కనుగుణంగానే సంఘ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఫలితాలను నేడు మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుత సమాజంలో పుట్టుకతోనే కులాన్ని నిర్ణయించే దుస్థితి ఏర్పడింది. కులానికి అతీత సమాజ నిర్మాణం కోసం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఇలాగే కొనసాగుతూంటుంది” అని వేణుగోపాల్ నాయుడు పేర్కొన్నారు.

 

‘మోక్షానికి అర్హత: కులమా? గుణామా?’ అన్న తన రచన మలయాళస్వామి వారి ప్రవచనాల సారం మాత్రమేనని, ఆ ప్రవచనాలను చదివి, కీలకాంశాలను సరళమైన తెలుగులో సంకలనం చేసే అవకాశం రావటం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, ఈ రచన తప్పకుండా ప్రతిపాఠకుని మనసులో ఒక ఆలోచనను సమరసత సమాజం దిశగా రగిలిస్తుందని తాను విశ్వసిస్తున్నానని వల్లీశ్వర్ అన్నారు. అనేక గ్రామాలనుండి ఈ కార్యక్రమంకోసం వచ్చిన ప్రజలందరికీ బాల సుబ్రహ్మణ్యం ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *