టీటీడీలో ప్రక్షాళన జరగాల్సిందే : శ్రీనివాసానంద సరస్వతీ
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే ఎవ్వరైనా సరే సంప్రదాయాలను పాటించాల్సిందేనని సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతీ తేల్చి చెప్పారు. ప్రస్తుతం హిందుత్వానికి కష్టం వచ్చిందని, అందరూ ఒక్కటై కాపాడుకోవాలనని అన్నారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో స్వామీజీ మాట్లాడారు. మాజీ సీఎం జగన్ ఏనాడైనా సతీసమేతంగా శ్రీవారి దర్శనానికి వచ్చారా? అంటూ సూటిగా ప్రశ్నించారు. సనాతన ధర్మం ప్రకారం పూజ చేస్తే పక్కన ధర్మపత్ని వుండేలా చూసుకోవడం సంప్రదాయమని, హిందువుల మనోభావాలను, విశ్వాసాలను ఆయన ఏనాడూ గౌరవించలేదని మండిపడ్డారు.
తిరుమల క్షేత్ర మహాత్య్మాన్ని వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ కాపాడలేదని, వారి పాలనలో ఎన్నో పాపాలు జరిగాయని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టీటీడీలో ప్రక్షాళన జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఇక… తిరుమల రావాలని జగన్ నిర్ణయించారని, ఏనాడైనా డిక్లరేషన్ పై సంతకం చేశారా? అంటూ సూటిగా ప్రశ్నించారు. మరోవైపు ఏపీలోని ఆలయాలు, అర్చకులపై దాడులు జరుగుతున్నా ఏనాడూ పట్టించుకోలేదని, భయానక వాతావరణం సృష్టించరన్నారు. అలాంటి వ్యక్తులు తిరుమలకి వస్తున్నారంటే అందరూ జాగ్రత్తగా వుండాల్సిందేనన్నారు. మరోవైపు సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని, దీనికి రాజకీయ పక్షాలన్నీ సహకరించాలని కోరారు. తమకు వైసీపీపై ఎలాంటి ద్వేషం లేదని, కానీ… ఆలయ సంప్రదాయాలను గౌరవించకపోవడాన్నే తాము తప్పుబడుతున్నామని శ్రీనివాసానంద సరస్వతీ అన్నారు.