‘వాత్సల్య పూర్ణ’’ సాధ్వీ రితింభర… అనాథలకు సామాజిక సేవ
సాధ్వీ రితింభర… పరిచయం అక్కర్లేని సాధ్వీమణి. జాతీయోద్యమాలు, అయోధ్య రామ మందిర ఉద్యమంలోనూ అగ్రగామిగా వున్నారు. ఓ వైపు ఈ కార్యక్రమాలు చేస్తూనే.. మరోవైపు సేవ కూడా చేస్తున్నారు. వీటన్నింటిని గమనంలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం… ఆమెకు తాజాగా పద్మభూషణ్ ప్రకటించారు. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ఆమె పద్మభూషణ్ అందుకున్నారు. ఈ అవార్డును తన గురుదేవుల చరణాలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఈ అవార్డు వాత్సల్య గ్రామ్ లోని గ్రామస్థులందరికీ దక్కినట్లేనని ప్రకటించారు కూడా.
సాధ్వీ రితింభర స్వస్థలం పంజాబ్ లోని లుథియానా జిల్లాలోని ఓ కుగ్రామం. అసలు పేరు నిషా కిషోరీ. 16 ఏళ్ల ప్రాయంలోనే హరిద్వార్ లోని స్వామి పరమానంద గిరి దగ్గర సన్యాస దీక్ష స్వీకరించారు. సన్యాస దీక్ష తర్వాత ఓ వైపు ఆధ్యాత్మిక సాధన, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూనే… మరోవైపు సామాజిక సేవ కూడా చేస్తున్నారు.

అయితే.. 1990 లో జరిగిన అయోధ్య రామమందిర ఉద్యమంలో అత్యంత క్రియాశీలకంగా పాల్గొన్నారు.అప్పటి నుంచే అత్యంత ప్రాచుర్యంలోకి వచ్చారని కూడా చెప్పొచ్చు. ఆవిడ ఉపన్యాసాలు అనేక మందిలో ఉత్ప్రేరకంగా కూడా పనిచేశాయి. కేవలం పురుషులే కాకుండా.. మహిళలు కూడా విశేషంగా ఆకర్షితులై, ఉద్యమంలో ముందు వరుసలో నిల్చున్నారు. అప్పట్లో ఆవిడ ఉపన్యాసాలను కేసెట్ల రూపంలో తయారు చేసి, దేవాలయాల్లో కూడా వేసేవారు.
అయితే.. చాలా తక్కువ మందికి తెలిసిందేమిటంటే.. అనాథ పిల్లల బరువు బాధ్యతలను సాధ్వీ రితింభర తన భుజ స్కంధాలకు ఎత్తుకున్నారు.బృందావన్ ప్రాంతంలోని వాత్సల్య అనే గ్రామంలో ఈ సామాజిక సేవ చేస్తున్నారు. ఈ పిల్లల చదువు, వివాహ బాధ్యతలను కూడా రితింభరే చూసుకుంటున్నారు. వీరందరూ వాత్సల్య గ్రామ్ అనే ప్రాంతంలో కళాశాల విద్య అభ్యసిస్తుంటారు. వీరు విద్యనభ్యసిస్తూ.. చెడు వ్యవసనాల వైపు వెళ్లకుండా వున్నారంటే.. రిత్వింభర చేసిన కృషే అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. ఆ పిల్లలందరూ ఎదిగి, పెద్దవారైన తర్వాత, పెళ్లి అయిన తర్వాత తిరిగి వచ్చి, ఈ వాత్సల్య గ్రామాన్ని కచ్చితంగా సందర్శిస్తారు. ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.వాత్సల్య గ్రామం అనేది ‘‘మంచి మనుషులను తయారు చేసే ఓ ఫ్యాక్టరీ’’. అని చెప్పుకుంటారు.

2013 మే 20 వ తేదీన వాత్సల్య గ్రామ్ కి శంకుస్థాపన జరిగింది. గుజరాత్ అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ, ప్రముఖ ప్రవచనకారులు మురారీ బాపుతో పాటు ఇతర ప్రముఖుల సమక్షంలో గుజరాత్ లోని మహిసా డాకోర్ సమీపంలో శంకుస్థాపన జరిగింది. మొదట మౌలిక సదుపాయాలపై దృష్టి సారించారు. మెళ్లి మెళ్లిగా అభివృద్ధి చేస్తూ వచ్చారు. అనాథలు, ఒంటరి మహిళలు, వృద్ధులు అందర్నీ దగ్గరికి చేర్చి, అక్కున చేర్చుకునే ఓ క్యాంపస్ వాత్సల్య గ్రామ్ అని ఆమె అభివర్ణించారు.