ప్రతి పౌరుడికీ రాజ్యాంగంపై అవగాహన వుండాలి : ముకుంద
దేశంలోని ప్రతి వ్యక్తి రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని అప్పుడే పౌరుల విధులు, హక్కులు, బాధ్యతలు స్పష్టంగా తెలుస్తాయని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సహ సర్‌కార్యవాహ ముకుంద అన్నారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజును గుర్తు చేసుకుంటూ ఆర్.ఎస్.ఎస్. దేశవ్యాప్తంగా 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను నిర్వహించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని డా.బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాజిక, ఆర్థిక లక్ష్యాలను సాధించాలంటే రాజ్యాంగ పద్ధతులను అనుసరించాలన్నారు. అంబేద్కర్ సైతం రాజ్యాంగ ముసాయిదాను సమర్పిస్తూ చేసిన ప్రసంగంలో ఇదే విషయాన్ని స్పష్టీకరించారన్నారు.
‘స్వాతంత్ర్యానికి ముందు మనకు రాజ్యాంగ పరమైన రక్షణలు లేనందున శాసనోల్లంఘనలు, సహాయ నిరాకరణోద్యమం వంటి పద్ధతులు చెల్లుబాటు అయ్యాయి. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత అరాచకానికి ప్రాతినిధ్యం వహించే అటువంటి పద్ధతులు చెల్లవు’, అని అంబేద్కర్ ప్రసంగంలో ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సామాజిక మరియు ఆర్థిక లక్ష్యాలను సామాజిక ఉద్యమాల ద్వారా సాధించాలే తప్ప అరాచక పద్ధతుల్లో కాదని అంబేద్కర్ స్పష్టం చేసినందున ఆయన మార్గంలో నడుస్తూ భారతీయులందరూ ఉత్తమ పౌరులుగా తమ విధులను నిర్వర్తించాలని శ్రీ ముకుందాగారు ఆకాంక్షించారు.
ఆర్.ఎస్.ఎస్. సైతం తన శతాబ్ది వేడుకల్లో భాగంగా సమాజ ప్రయోజనం దిశగా పౌర స్పృహను పెంపొందించేలా కార్యక్రమాలు చేపడుతోందన్నారు. పౌర స్పృహ ఆధారంగానే సమాజ నిర్మాణం ఆధారపడి ఉందని, పౌర స్పృహ ద్వారానే లోటుపాట్లను సరి చేసుకోవాలని సహ సర్‌కార్యవాహ స్పష్టం చేశారు. మహనీయుడు డా.బి.ఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగానికి లోబడి ఉత్తమ పౌరులుగా నిలుస్తూ దేశ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని ఆర్.ఎస్.ఎస్. సహ సర్‌కార్యవాహ శ్రీ ముకుంద గారు పిలుపునిచ్చారు.