‘సామాజిక సమరసత’ వ్యూహం కాదు.. ఒక జీవన విధానం – ఆర్‌ఎస్‌ఎస్
సామాజిక సమరసత అనేది వ్యూహం కాదని, జీవన విధానమని ఆర్‌ఎస్‌ఎస్ సర్ కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హోసబాలే జీ అన్నారు. అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి సామాజిక పరివర్తనకు దారితీయడమే ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యమని, సమిష్టి కృషితోనే మార్పు సాధ్యమని, ఆ విధంగా అన్ని వర్గాలను ఏకం చేయగలదన్న విశ్వాసం ఆర్‌ఎస్‌ఎస్‌కు ఉందన్నారు. నాగపూర్‌లో మార్చి 15 నుంచి 17 వరకు మూడు రోజుల పాటు జరిగిన అఖిల భారతీయ ప్రతినిధుల సభలో చివరి రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
అయోధ్యలో రామలల్లా ప్రాణ ప్రతిష్ఠ చారిత్రాత్మక సందర్భం వల్ల సమాజంలో చురుగ్గా పాల్గొనడం అందరికీ విస్తృతంగా అనుభవంలోకి వచ్చిందని ఆయన ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పెద్ద పండుగ అని, దేశ ప్రజాస్వామ్యాన్ని, ఐక్యతను బలోపేతం చేయడం, ప్రగతి వేగాన్ని కొనసాగిం చడం చాలా అవసరమన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ స్వయం సేవకులు వంద శాతం పోలింగ్‌పై అవగాహన కల్పిస్తారని ఆయన పేర్కొన్నారు. శత్రుత్వం, వేర్పాటువాదం లేదా విభజన ప్రయత్నాలు లేదా ఐక్యతకు విరుద్ధమైన అంశాలు ఉండకుండా సమాజం అప్రమత్తంగా ఉండాలన్నారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు కృషి దేశవ్యాప్త జాతీయవాద ఉద్యమమని, మనం ఒకే దేశానికి చెందిన ఒక ప్రజలమని ఆయన అన్నారు. 2025 విజయ దశమి నాటికి పూర్ణ నగర్, పూర్ణ మండల్, పూర్ణ ఖండ లక్ష్యాన్ని సాధించడానికి సంఘం రోజువారీ శాఖలు, సాప్తహిక్ మిలన్‌లను పెంచే దిశగా ప్రణాళిక ప్రకారం పని చేస్తోందన్నారు. నేడు ఆర్‌ఎస్‌ఎస్ పని ప్రభావం సమాజంలో కనిపి స్తోందని, సంఘం పట్ల సమాజానికి ఉన్న అను బంధానికి, సహకారానికి సంఘం ఎప్పటికీ కృతజ్ఞతా భావంతో ఉంటుందని పేర్కొన్నారు.