మనం ఎస్సీలం మాత్రమే కాదు హిందువులము కూడా…
సమాజానికి రాజకీయాలు అవసరమే అయినప్పటికీ, రాజకీయాలను మాత్రమే అనుసరిస్తే అవి ప్రజలను విడదీస్తాయని, ధర్మ-సంస్కృతులు మాత్రమే ప్రజలను సమైక్యం చేస్థాయని సామజిక సమరసత వేదిక జాతీయ కన్వీనర్ శ్రీ శ్యామ్ ప్రసాద్ అన్నారు. సామాజిక సమరసత వేదిక, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి సంయుక్త నిర్వహణలో సికింద్రాబాద్‌లోని గీతా భవన్‌లో జరిగిన ఎస్సీ కులాల, సంచార తెగల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భాగ్యనగర్, రంగారెడ్డి జిల్లాలకు వారు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
భారత రాజ్యాంగం ప్రకారం తెలుగు రాష్ట్రాలలో షెడ్యూల్డ్ కులాల జాబితాలో ఉన్న 59 కులాలలో ప్రతి కులానికి ఒక కుల దేవత, చరిత్ర ఉందని అయితే, రాజ్యాంగం ప్రవచించిన అభివృద్ధి ఫలాలు ఎస్సీ జాబితాలోని అన్ని కులాలకు సమంగా చేరలేదని, దీనికి అనేక కారణాలు ఉన్నాయని శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఎస్సీ జాబితాలోని అన్ని కులాల వారు మిగిలినవారందరి ప్రగతి కోసం రాజకీయాలకు అతీతంగా కలసి మెలసి పనిచేయాలని పిలుపునిస్తూ… ఎస్సీ కులాల ప్రజలకు, మిగతా కులాలవారికి మధ్యనున్న అంతరాల గురించి ప్రశ్నించే వాళ్ళు ఎస్సీ జాబితాలోనే వివిధ కులాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో ఒకసారి సమీక్ష చేసుకోవాలని హితవు పలికారు.
చర్చా కార్యక్రమాన్ని నిర్వహించిన సామాజిక సమరసత వేదిక తెలంగాణ కన్వీనర్ శ్రీ అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ మన అందరి మధ్య మరింతగా సద్భావము, సోదర భావం పెరగడానికి మనం ఏమేమి చేయగలమో అభిప్రాయాలను తెలపాలని కోరారు. ఈ చర్చలో పలువురు ప్రముఖులు ప్రసంగించారు. సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ సత్యనారాయణ ప్రసంగిస్తూ అరుంధతీ మాత హిందువులందరికీ ఆదర్శ స్త్రీ అన్నారు. వివాహం అనంతరం అన్ని కులాల నవ దంపతులు అరుంధతి నక్షత్రాన్ని దర్శించే సాంప్రదాయాన్ని గుర్తుచేశారు.అంతేగాక 17వ శతాబ్దంలో తమిళనాడులోని శివగంగకోటపై ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని ఎదిరిస్తూ ఆత్మ బలిదానం చేసిన యువతి కుయిలి ఎస్సీ మహిళ అని తెలిపారు.
21 కులాలకు చెందిన 55 మంది ఈ సమావేశంలో పాల్గొనగా,ప్రతి కులం నుండి ఒకరికి సన్మానం జరిగింది. మనమందరం ఎస్సీలము – సోదరులము… ఎస్సీలం మాత్రమే కాదు హిందువులము కూడా… అను భావనతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో సుప్రసిద్ధ సంఘ సంస్కర్త స్వర్గీయ భాగ్యరెడ్డి వర్మ మనువడు శ్రీ అజయ్ గౌతమ్ దంపతులు పాల్గొని,భాగ్యరెడ్డి వర్మ గారి సేవా కార్య క్రమాలను గుర్తుచేశారు.