సమరసతే సందేశం
‘‘సృష్టిలోని సమస్త జీవరాశుల్లోకి మానవుడు శ్రేష్ఠమైన ప్రాణి. అందరి హృదయాల్లో భగవత్ స్వరూపం ఉంది. ‘నేనెవరిని?’ అని ప్రశ్న వేసుకుంటే ఇది కనిపిస్తుంది. అది శరీరంకన్నా భిన్నమైంది. దాన్ని దర్శించగలిగితే ప్రతి మనిషీ సాటి మనిషిని ఎలాంటి వివక్ష లేకుండా ప్రేమించగలుగుతాడు. సద్గరు మలయాళ స్వామి తమ జీవితాన్ని, తపస్సుని ఈ లక్ష్యం కోసమే వెచ్చించారు’’అని శ్రీపరిపూర్ణా నందగిరిస్వామి అన్నారు.
మలయాళస్వామి సాక్షాత్తు వ్యాస భగవానుడి అవతారమేనని, అన్ని కులాల వారిని వారు శ్రేష్ఠ మానవులుగానే భావించి, ఆశీర్వదించేవారని, అలాగే వారు అన్ని వర్ణాల వారికి వేదవిద్య అభ్యసించే అవకాశం కల్పించిన సమతామూర్తి అని కూడా శ్రీపరిపూర్ణానంద గిరి స్వామి పేర్కొన్నారు.
సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో ‘ఎమెస్కో’ ముద్రించిన మలయాళ స్వామి వారి ‘శుష్కవేదాంత తమో భాస్కరం’ కీలకాంశాల సంక్షిప్త సరళ తెలుగు రచన (మోక్షానికి అర్హత: కులమా? గుణమా?) ను శ్రీ పరిపూర్ణానంద గిరిస్వామి యేర్పేడు ఆశ్రమంలో జరిగిన మహాసభలో జూలై 17న ఆవిష్కరించారు. మలయాళ స్వామి వారి ఆశయాలను, వారి కృషి ఫలితాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళటంలో సామాజిక సమరసతా వేదిక కృషిని ఆయన అభినందించారు.
ఆంధ్రప్రదేశ్ సామాజిక సమరసతా వేదిక కన్వీనరు నరసింగనాయుడు స్వామీజీని దుశ్శాలువతో గౌరవించారు. మలయాళస్వామి జీవన సందేశంపై ‘నమో నమామి ‘అనే సమరసతా సందేశ గీతం ఆయన ఆలపించారు.
‘మోక్షానికి అర్హత: కులమా? గుణమా?’ రచించిన పాత్రికేయులు వల్లీశ్వర్‌ని స్వామీజీ శాలువతో, పూలమాలతో అభినందించి, ఆశీర్వదించారు.