గిరిజనులను, ఆటవికులను హిందూ ధర్మం నుంచి ఎవ్వరూ వేరుచేయలేరు : బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ

ప్రజ్ఞా భారతి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ లో ‘లోక్ మంథన్ భాగ్యనగర్ 2024 జరిగింది. ఈ కార్యక్రమానికి వక్తగా ఋషిపీఠం మాసపత్రిక సంపాదకులు, సమన్వయ సరస్వతీ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
’’వందే భారత మాతరమ్.. లోకమంథన్ పేరు మనదైన ఒకానొక సంస్కృతి ప్రవాహాన్ని మధ్యప్రదేశ్ లో ప్రారంభించి, ఇప్పుడు హైదరాబాద్ నగరంవైపు ప్రయాణింపజేస్తున్న ఈ శుభవేళ ఇది విజయవంతం కావాలని కోరుకుంటూ… మన సంస్కృతిలో ఇందాక ఫోక్ కాదు లోక్ అని ఎలాగూ నినాదం చేశారు. దాడులు చేసినటువంటి వారు క్రమంగా విభాగాలు, విభజనలు చేస్తూ వైవిధ్యాలను వైరుధ్యాలుగా చిత్రీకరించారు. దానివల్ల వచ్చిన ప్రమాదాలతో మన సంస్కృతిని మనం విస్మరిస్తున్నాం. ఎవరైతే ఇక్కడ దాడి చేసి, వలసవాదులు మొదలైన వారు దాడి చేసి, ఇక్కడ విభాగాలు ఏర్పాటు చేయాలని ప్రయత్నించారో, మరి ఇతర దేశాల మీద దాడి చేసినప్పుడు ఎలా చేశారో పరిశీలిస్తే.. వారు ఎక్కడ దాడి చేసినా.. అక్కడ సంస్కృతి పనికిరాదని, అనాగరికమైనదన్న ముద్ర వేయడమే కాకుండా, వారిని తమలోకి మార్చే ప్రయత్నం చేయడమో, లేక.. వారిదే నాగరికత అని అనుకుంటున్న దానిని వారికి రుద్దడమో ప్రయత్నించి, ఎందర్నో నశింపజేశారు కూడా.
అలాగే అమెరికా, ఆస్ట్రేలియా వైపు దండయాత్రలకు వెళ్లినపుడు, దాడి చేసినపుడు అక్కడున్న నాగరికతలను కూడా అనాగరికమని, ఆటవికమన్న ముద్ర వేసి, క్రమంగా మిగలకుండా ధ్వంసం చేశారు. వారికి తమ నాగరికత నేర్పుతామన్న పేరుతో కొత్త అంటురోగాలు అంటించారు. వారి వల్ల వచ్చిన అంటు రోగాల గురించి ఆలోచిస్తే.. మన దేశంలో కూడా మలేరియా, కలరా లాంటివి ఈ దేశపు జబ్బులు కావు. ఇతరులు వచ్చి, మనకు అంటించిన జబ్బులు అని మనం అనుకోవాలి. అనేక రకాలైన వాటిని వారు ఎక్కడ దండయాత్రలు వెళ్లినా, నాగరికతను అంగీకరించరు. పనికిమాలినదని అంటారు. దీనికి మానసిక రోగమని పేరు పెట్టాలి. అదో సిండ్రమ్. అంటే వారు తప్ప ఇతరులు పనికిరారన్న భావంతో వారు అన్ని దేశాలకు వెళ్లి, అక్కడున్న నాగరికతలను కాలరాశారు.
ఇలాగే భారత్ లో కూడా చేయాలని ప్రయత్నాలు చేశారు. కానీ అలా చేయలేకపోయారంటే ఈ దేశంలో ఎన్నో రకాల సంస్కృతులు వున్నప్పటికీ అన్నింటికీ ఏకసూత్రంగా ఒక సనాతన ధర్మం వుంది కాబట్టే వారి ఆటలు సాగలేదు. ఇప్పుడు మనం కొన్ని ఆటవికమైన, మనదైన ప్రాచీన జానపద సంస్కృతులు… అంటే ఫోక్, లోక్ అనే దానికంటే మనం జానపదం అని పేరు పెట్టుకున్నాం. ఈ సంస్కృతులు ఏవైతే వున్నాయో… అవి మచ్చుకైనా మిగిలి వున్నాయి. మిగిలిన దేశాలలో నశించిపోయాయి. అంటే అర్థమేమిటంటే.. వీటన్నింటికీ ఏక సూత్రం ఏమిటంటే సనాతన ధర్మం. దీనిని మనం గ్రహించాలి.
ఇక ఇప్పుడు మరో కుట్రకు తెర లేపారు. అదేమిటంటే.. మన దేశంలో వున్న అనేక ఆటవిక, గిరిజన ఇత్యాది జాతుల వారిని మన సంస్కృతికి, ధర్మానికి వీరు వేరని చెప్పి, ప్రయత్నాలు చేస్తూ.. వారిని మతాలు మార్చాలని, ఇత్యాది ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి నాగరికతను, వైద్యాన్ని నేర్పి, వారిని అభివృద్ధి లోకి తేవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి వీరు తెలుసుకోవాల్సింది… ఈ గిరిజనులకు వున్న అభివృద్ధి నాగరికులకు లేదని చెప్పడానికి వెనకాడటం లేదు. లోక్ మంథన్ అన్నప్పుడు ఈ లౌకికమైన కల్చర్ గురించి మాట్లాడేటప్పుడు కేవలం నాట్యం, సంగీతం, కళలు వీటి గురించే మాట్లాడుతున్నాం. కానీ.. ఇంకోటి కూడా భాగ్యనగర్ లోకమంథన్ గురించి తీసుకురావల్సింది.. కేవలం కళలు, సంస్కృతి మాత్రమే కాకుండా.. జానపద గిరిజన విద్యలు, వారి జ్ఞానాన్ని తీసుకురావాలి. అది తెలుసుకోవాలి. ఆ జ్ఞానాన్ని పరిశీలిస్తే ఆశ్చర్యపోతాం.
అనేక చికిత్స లేని రోగాలకు భయంకర రోగాలకు వారిని అడవిలో ఏ ఆకు పసరుతో, ఏ దుంపతో పోగొట్టుకోవచ్చో తెలుసు. ఇంకా అధునాతన వైద్య విజ్ఞానం కూడా అందుకోలేని శిఖరాలను అందుకుంది ఆ గిరిజన ప్రాంతాల్లో వున్న వారి చికిత్స విధానాలు. వాటిని మనం మోటు, నాటు చికిత్సలు అంటున్నాం. అయితే.. నాటు అన్న పదం సరిపోతుంది. అంటే దేశీయమైన అని అర్థం. అలా చూస్తే సరిపోతుంది. వైద్య విజ్ఞానం వుంది. అలాగే వారి దగ్గర వున్న భాష అనాగరికత అనుకుంటాం కానీ.. అందులో చాలా అందాలున్నాయి. అదేవిధంగా వారికున్న ఆచారాలు, వ్యవహారాలు, వివాహారాలు వున్నాయి. వీటిని మనం గ్రహిస్తే.. శరీరాన్ని పుష్టినిచ్చి, ధాతు పుష్టినిచ్చే ఆహార నియామాలు వారి దగ్గర వున్నాయి. అవి అర్థం చేసుకోలేక.. అవి అనారోగ్యకరమన్న భ్రాంతిలో వాటిని తొలగించి, ఈ జబ్బులు కలిగించే రకరకాల ఆహారాలు అలవాటు చేస్తున్నారు నాగరికులు. వారికేదో నాగరికత నేర్పుతామని బయల్దేరుతున్నారు.
కానీ వారు ఏది పుచ్చుకుంటే ఆరోగ్యంగా వుండగలమో, అభివృద్ధి చెందగలదో వారికి తెలుసు. అలాగే వారి దగ్గరున్న జ్యోతిర్విజ్ఞానం దీనిని మనం మరిచిపోవద్దు. అంతరిక్షంలో కనిపించే నక్షత్ర గమనాన్ని ఆధారం చేసుకొని జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకుంటారు. కొన్ని గిరిజన జాతులైతే.. ఆకాశంలో ఫలానా చోట, ఫలానా సమయంలో నక్షత్ర గుంపు వుంటుందని చెప్పి, రాట నాటే ముహూర్తాలు పెడతారు. పంచాంగాలు చూసి కాదు.. ఆకాశంలో ఫలానా నక్షత్రాల గుంపు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ సమయంలో రాట నాటితే మంచిదంటారు. ఎంత గొప్పగా ముహూర్తం పనిచేస్తుందంటే… ఆ సమయంలో రాటను రాతిమీద పెట్టినా నాటుకుంటుంది. అంటే..కేవలం సంగీతం, పాటలు, నాట్యం మాత్రమే కాకుండా వైద్య జ్ఞానం, అంతరిక్ష విజ్ఞానం కూడా వుంది. అయితే.. ఇదంతా సనాతన ధర్మానికి సంబంధించినది కాకుండా… వారంతట వారు ప్రత్యేకంగా వున్నారని భావించడానికి వీల్లేదు. దీని వెనుక ఓ సనాతన ధర్మ సూత్రం వుంది. అందుకే మా గురువు గారు సద్గురు శివానంద మూర్తి గారు ఓ మాట అనేవారు.
అశ్వమేధ యాగం మొదలుకొని, అంకాలమ్మ జాతర వరకు భారత్ మొత్తం ఒకే సూత్రంతో ముడిపెట్టబడి వుంది అని అన్నారు. వారి వాజ్ఞయాన్ని మనం పరిశీలించినా మనకు వైదిక మూలాలు గోచరిస్తాయి. వేద సంస్కృతి ఈ సమాజాన్ని ఎలా భావించిందంటే.. ఒకే భగవంతుడి స్వరూపంగా భావించింది. ‘‘నమ: పుంజిష్టేభ్యో.. నిశాదేభ్యశ్చమోనమోనమ: అంటూ ఉపవీతాయ కృత్స్నవీతాయ.. ఇలాంటి శబ్దాలతో.. ఉపవీతుడై.. అంటే యజ్ఒోపవీతం ధరించే బ్రాహ్మణుడు, వ్యాపారం చేసే వాణిజ్యవేత్త మొదలుకొని, పాలించే క్షేత్ర పాలకుడు మొదలుకొని, వేటగాడు, వ్యవసాయదారుడు, కుమ్మరి, కొమ్మరి అందరూ కలిపి ఒకే భగవత్ స్వరూపం అన్న భావన వేదాల్లోనే మనకు కనిపిస్తుంది. నమ: కులాలేభ్య: కర్మారేభ్యశ్చవోనమ: అన్నపుడు. అంటే వివిధ జీవన విధానాలే చెప్పారు కానీ… ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అని లేదు. అందరికీ ఒక్కో విధానం ఇచ్చారు. అంతస్సూత్రం మాత్రం సనాతన ధర్మమే. అందుకే జానపద కళారీతులను పరిశీలిస్తే.. వారు పాడే పాట, ఆడే ఆట, పలికే మాట… అన్నిట్లోనూ సనాతన ధర్మ పరంపరే గోచరిస్తుంది.
ఒక మణిపురిలో నృత్యాన్ని పరిశీలిస్తే.. వీరు చేసినంత నృత్య మిగితా వారు చేయలేరు. అంత బాగా చేస్తారు. వారు పెద్ద పెద్ద డప్పులు తీసుకొని, ఆడుకుంటుంటే.. అన్నీ మనవే కనిపిస్తాయి. ఉపాసన పద్ధతిలో కూడా అంటే. భగవంతుడ్ని ఓ ఆటవికునిగా ఉపాసించిన సంస్కృతి మనది. ప్రారంభంలో మనం ఓ శ్లోకం చదువుకున్నాం… ‘‘విహరిత పుళిందయోషా..గుంజాభూషా.. ఫణీంద్ర కృతవేషా’’ అని. ఇందులో పుళిందయోషా అంటే.. ఓ ఆటవిక స్త్రీ. ఈ రూపంలో వున్న అమ్మవారికి నమస్కారం చేస్తున్నా అని మూకకవి అంటారు. అంటే.. ఆటవికంగా కూడా అమ్మవారిని దర్శించామంటే.. తక్కువ కాదు. భగవంతునితో సమానంగానే భావించారు. అందుకే భారతీయ సంస్కృతిలో కేవలం నగరవాసులే కాకుండా అడవుల్లో సంచరించే వారు కూడా ఒక ధర్మం, ఒక పరంపర, ఒక విద్య, సంస్కృతి కలిగినవారని దీనిని బట్టి తెలుస్తుంది. వేదికపై వున్న అందరిలోనూ భగవంతుడే కనిపించాడు.
‘‘పరమేశ్వరుని వేషం ఎలా వుందంటే..తలపై జాబిలి నెమ్మిపింఛయము.. వేదశ్వానముల్ ముందు… అమ్ములున్ ముమ్మొనరింటివద్దయు.. కరాంభోజాతయుగ్మమ్మునన్…మలరాకూతురు బోయసాని’’
కొండల రాజ కూతురు అంట పార్వతి. కొండల రాజ కూతురు శబరీ వేషం ధరించింది. దానికి తగ్గట్టుగా ఆది శబర వేషం పరమేశ్వరుడు ధరించాడు. దీనికి సంబంధించిన కొన్ని శ్లోకాలు, మంత్రాలున్నాయి. కేవలం శైవం వైపు మాత్రమే కాదు.. వైష్ణవం వైపు కూడా. చెంచు లక్ష్మి ఎక్కడి నుంచి వచ్చింది? వారెవ్వరు? నరసింహ స్వామి చెంచులక్ష్మితో వచ్చింది. చెంచతా నరహరి.. అన్న పదాలు జానపదాల నుంచే పుట్టాయి. అలాగే జానపదుల భాషల్లో… ‘‘వెట్టి వలపు చల్లకూ విష్ణుమూరితీ…నాను వెట్టతీర మాటాడూ విష్ణుమూరితీ….’’ ఈ విష్ణుమూరితీ అన్న దానిని జానపదుల నుంచి తీసుకొని, అన్నమయ్య అదే ప్రభావంతో తన సంకీర్తనల్లో చూపించారు. అలాగే ‘‘సంధ్యకాడపుట్టినట్టి ఛాయలపంట… ఎంత చందమాయెచూడరా చందమామ పంట… ఇలా జానపదుల నుంచే తీసుకున్నాడు. వీటిలో మనకి సామాన్యుల జీవన విధానం కనిపిస్తుంది. సున్నిత సంస్కారాలు కనిపిస్తాయి. సున్నితమైన తాత్వికత, భక్తి అన్నీ కనిపిస్తాయి. ఇవేవీ వేదజనిత సనాతన ధర్మానికి విరుద్ధం కాదు. ఎందుకంటే వేద మంత్రాలు కూడా అడవిలో తపస్సులు చేసిన మహర్షులు తపో దృష్టికి గోచరించాయి కనుక.. అరణ్యాలలో జీవించే గిరిజనులకీ, అరణ్యాలలో తపస్సులు చేసిన మహర్షులకి కనిపించే సత్యం ఒక్కటే అదే సనాతన ధర్మ సంస్కృతి. దీనిని ఆధారంగా చేసుకొనే విస్తరించాయి.
ఇక్కడ సంస్కృత భాష అయినా, జానపద భాష అయినా… భారతీయ హృదయ ఘోష ఒక్కటే. భావం ఒక్కటే. ఈ విధమైన పరిశీలన, పరిశోధన చేయడానికి లోకమంథన్ కార్యక్రమాలు సహకరించాలి. ఇవి నగరాల్లో జరుగుతున్నప్పటికీ, మనమందరమూ కూడా గిరిజన సంస్కృతిని కాపాడి, అధ్యయనం చేయాలి. రీసెర్చ్ సెంటర్లు ఏర్పడాలి. వాటి ద్వారా ప్రకృతి విలువ తెలుసుకోవచ్చు. ప్రకృతితో కలిసి జీవించే వారు ఆటవికులు.అందుకే ప్రకృతితో కలిసి జీవించేవారి వల్లే ఔషధాలు, పరిష్కారాలు పొందవచ్చు. అనేక జీవన విలువలతో వుంటారు. కట్టు వుంటుంది. దాని ద్వారానే జీవిస్తారు. దానికే కట్టుబడతారు. వారికీ కుటుంబ విలువలు, సంస్కారాలున్నాయి. భారతీయ సంస్కృతి ఏమిటంటే.. మేము గొప్పవారం కనుక.. మాలాగా మారండని చెప్పదు. వారిలాగే వారిని బతకమంటోంది. అదే గొప్పదనం. అదే వైవిధ్యం. భాషలు, రాష్ట్రాలు ఎన్ని వున్నా… అందరూ ‘‘భరత వర్షే.. భరత ఖండే’’ అని చెప్పుకున్నాయి. భాషలెన్ని వున్నా.. వ్యవహారం, వివహారం వున్నా.. వైవిధ్యాలున్నా.. ఇన్ని రాజ్యాలు కలిసి ఒకే భారతదేశం అని అంటున్నాం. అఖండ భారత వర్షంలో హిమాలయం మొదలుకొని, సేతువు వరకు.. అరణ్యం, నదీ తీరాల్లో జీవిస్తున్న వారు, సహజ జీవనం సాగిస్తున్న వారే శబరులు. వారే ఆటవికులు. ఆరణ్యకులు. వారి సంస్కృతిని గౌరవించాలి. ఇవన్నీ కలిసే వుంటాయి. వేర్వేరుగా వుండదు.
మనం ఆరాధించే అమ్మవారు, కృష్ణుడే వివిధ పేర్లతో అక్కడా వుంటారు. కాట్రేడు అన్న పేరుంది. చిత్తూరు ప్రాంతంలో వుంది. కాట్రేడు జాతర అన్న దానిని ధూర్జటి అద్భుతంగా వివరిస్తాడు. అక్కడున్న ఆటవికులు పట్టుబట్టలు కట్టరు. అక్కడున్న నారవస్త్రాలే ధరిస్తారు. ఎంత సంపన్నులైనా కిరీటాలు పెట్టుకోరు. కేవలం నెమలి పింఛాలే ధరిస్తారు. డబ్బులన్నా… బంగారు కిరీటాలు పెట్టుకోరు. తమ పద్ధతే అందమయ్య అని చెప్పడం. ప్రతిదానికీ అందం వుందని చెప్పవచ్చు. కాట్రేడు అంటాం మనం. కాటిరేవు అంటే అడవికి రాజు. కాట్రేడు అన్నది పల్లె భాష. ఈ మధ్య హిమాచల్ ప్రదేశ్ లో ఓ సన్యాసే చెప్పారు. మనం వేదాల్లో, పురాణాల్లో వినని దేవతలెందరో హిమాచల్ ప్రదేశ్, హిమాలయాల్లో పూజింపబడతారు. అందుకే ఈ సంస్కృతి వేరు, వేద సంస్కృతి వేరు అని చెప్పారు.అదే అజ్ఞానం. వేదాల్లో, పురాణాల్లో ఎంత మంది దేవతల పేర్లు చెప్పారో ఎవరికి తెలుసు? యక్షులు, గంధర్వులు ఇలా… అన్నీ ఆటవికుల్లో కనిపిస్తాయి. వాటన్నింటినీ అధ్యయనం చేయాలి. వాటిలో వున్న గొప్పతనాన్ని తెలుసుకుంటూ వుండాలి. అయితే వారికి మనం కొత్త నాగరికత చెప్పాల్సిన అవసరం లేదు. వారిని ఆదరిస్తే చాలు. వారిని గౌరవిస్తే చాలు.వారిని ప్రోత్సహిస్తే చాలు. ఈ భావాలన్నీ సుమారుగా పదేళ్లుగా ఉద్భవిస్తోంది.
స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాల తర్వాత ఈ వాసన వస్తోంది.అందుకే పద్మశ్రీ బిరుదు వచ్చినా..దాసరి కొండప్ప గారు తన వేషధారణలోనే వచ్చారు. ఏమాత్రం మార్చుకోకుండా తంబురా పట్టుకొని కూర్చున్నారు. తలపాగా కట్టుకొని వచ్చారు. ఆయనలో తలపాగా కట్టుకున్న శివుడు కనిపించాడు. ఇది మన జానపద సాహిత్యం. ఈ జానపదం అన్న పదాన్ని ఎప్పుడో సృష్టించుకున్నాం. లోక్ మంథన్ అనే దానిలో ఈ జానపద వాజ్ఞయంపై జరిగిన పరిశోధనలు తెలియబడాలి. మధ్యప్రదేశ్ నుంచి ఇక్కడి వరకు వచ్చాం. ఇక్కడి నుంచి ఇది విస్తరిస్తూ.. భారత్ లో ఎన్ని సంస్కృతులు వున్నా, ఎన్ని భాషలున్నా… వాళ్లు ఆటవికులైనా, నాగరికులైనా.. పల్లియులైనా.. ఒకే సంస్కృతి వారసులు అని తెలుసుకొని, ఈ ధర్మంతో, ఈ సంస్కృతితో వారిని ఎవ్వరూ వేరుచేయలేరు అన్న భావన దృఢపడి, భారతీయుల ఐక్యత వర్ధిల్లాలి. కేవలం ఓట్లు దండుకోవడం కోసం కుల గణన, ప్రాంత విభాగాలు చేయడం కాదు. ఒక్కొక్క దానిని పరిశోధించడం కోసం, దాని ప్రత్యేకతను తెలుసుకొని, భారత జాతి అంతా ఒకే జాతి అని తెలుసుకునే స్థితి వైపు వెళ్లడానికే ఈ లోకమంథన్ కార్యక్రమాలు ఉద్యమించాలని, సఫలీకృతం కావాలని కోరుకుంటూ… స్వస్తి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *