ప్లాస్టిక్ వ్యతిరేక చైతన్య కార్యక్రమంతో ప్రజల్లో మార్పును తెస్తున్న ’’సంఘమిత్ర సేవా సమితి‘‘
నంద్యాల జిల్లా, సంఘమిత్ర సేవా సమితి ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు ప్లాస్టిక్ భూతం పై యుద్దానికి నాంది పలికి, ప్రస్థావన కార్యక్రమాలతో వస్తున్న సకారాత్మక పరిణామాలే ఊతంగా ప్లాస్టిక్ భూతం పై యుద్దాన్ని ముందుకు తీసుకెళ్తోంది.ఇందులో భాగంగా నంద్యాలలోని స్థానిక బాలాజీ కాంప్లెక్స్ బాలాజీ హైట్స్ లో ప్లాస్టిక్ వ్యతిరేక చైతన్య కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో భాగంగా అపార్ట్ మెంటు లోని మాతృమూర్తులు భరతమాతకు మాలార్పణ గావించగా, ఓంకారంతో సంఘమిత్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు అధ్యక్షతన కార్యక్రమం ప్రారంభమైంది. డాక్టర్ ఉదయ శంకర్, వెంకటయ్య ప్లాస్టిక్ మన జీవితాల్లోకి ఎలా ప్రవేశించింది, ఎలా అంతటా వ్యాపించింది, ఇది ఇలాగే కొనసాగితే మానవ జీవితం, భవిష్యత్తు తరాల జీవితాలను ఎంత దుర్భరం చేస్తుందో వివరించారు.అలాగే ఆధ్యాత్మికతకు కర్తవ్య నిష్ఠ తోడై నప్పుడే పరిపూర్ణత చేకూరుతుందని దృష్టాంతాలతో ఉదహరించారు.
అనంతరం వెంకటేశ్వరి, జయశ్రీలు గత రెండు కార్యక్రమాల ద్వారా తమ తమ అపార్ట్మెంట్ లలో వస్తున్న సకారాత్మక మార్పులను గురించి వివరించారు. అపార్ట్ మెంట్ల లో జరిగిన కార్యక్రమాల్లో ప్లాస్టిక్ వస్తువులు వినియోగించక పోవడం, ప్రత్యామ్నాయంగా అవసరమైన స్టీలు గ్లాసులు, ప్లేట్లను ఉమ్మడిగా సమకూర్చుకుని వినియోగిస్తున్నట్టు చెప్పారు.
సభకు హాజరైన మాతృ మూర్తులు నూలు లేదా జూట్ సంచులను డోర్ ప్రక్కన తగిలించడం, బైక్ లో సైడ్ బ్యాగ్ లో పెట్టి ఉంచడం లాంటి జాగ్రత్త వల్ల ప్లాస్టిక్ వాడకం తగ్గించ వచ్చని సూచించారు. చివరిగా కార్యక్రమం నిర్వహించి వై యన్ సంధ్య ధన్యవాదాలు తెలిపారు. శాంతి పాఠంతో కార్యక్రమం సంపన్నమైంది.
మరోవైపు చెట్లను నాటడంలోనూ ఈ సేవా సంస్థ విపరీతమైన కృషి చేస్తోంది. “కంకర్ కంకర్ మే శివ శంకర్ హై” ప్రతి రాయిలో శంకరుడున్నాడు అంటూ పసి ప్రాయం నుండే ప్రకృతితో మమేకం చేస్తూ, నంద్యాల జిల్లా, సంఘమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో సంఘమిత్ర ఆవాసం చిన్నారులు స్వచ్చ భారత్ కార్యక్రమాలలో భాగంగా ప్రతి యేటా వర్షాకాలంలో చెట్లు నాటడం ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది గురుపౌర్ణమిని పురస్కరించుకొని నంద్యాల పట్టణంలో స్థానిక పద్మావతీ నగర్ లోని శ్రీ కృష్ణ మందిరంలో చెట్లను నాటి సంఘమిత్ర చిన్నారులు ప్రకృతిని పూజించారు.
సంఘ మిత్ర అధ్యక్షులు నాగ సుబ్బారెడ్డి, అతిథుల పూజతో ప్రారంభమైన కార్యక్రమం, శాంతి పాఠంతో సంపన్నమైంది.కార్యక్రమం అనంతరం ఆలయ ఆవరణలో జరుగుతున్న కూచిపూడి నృత్య, భగవద్గీత అభ్యసన కార్యక్రమాలను సందర్శించి, డాక్టర్ ఉదయ శంకర్ విద్యార్థులతో నిస్వార్థ సేవ యొక్క గొప్పతనాన్ని తెలిపే చక్కని కథను చిన్నారులకు వివరించారు.