ఇంటిపై సంస్కృతంలోనే ‘‘నేమ్ ప్లేట్లు’’ : జమ్మూలో సంస్కృతానికి ఆదరణ
సంస్కృతం భాషకు జమ్మూలోని సుభాష్ నగర్ ఎక్స్ టెన్షన్ 1 కాలనీలో మహర్దశ పట్టుకుంది. ఇక్కడ ప్రతి ఇంటిపై సంస్కృత ఇంటి నేమ్‌ప్లేట్‌లను ఏర్పాటు చేశారు. ఇలా చేయడంతో భారతదేశంలోనే మొదటి కాలనీగా చరిత్రలో నిలిచింది.
కాలనీలోని ప్రతి ఇల్లు దేవనాగరి లిపిలో వ్రాయబడిన సంస్కృతంలో ‘శాంతి నివాస్’, ‘ఆనంద గృహం’, సత్య కుటీర్’ వంటి పేర్లతో హుందాగా ప్రతిబింబిస్తుంటాయి. దీనికి సంబందించిన ఆన్లైన్ వీడియో ఒకటి బాగా ప్రచారంలో ఉంది. ఆ వీడియోలో ఒక వ్యక్తి మాట్లాడుతూ, “హుమేన్ సంస్కృత భాషా కో బధవా దేనా చాహియే, ఇస్మేన్ హుమారి పరంపర ఔర్ పెహచాన్ హై” అని చెప్పారు. (మనం సంస్కృత భాషను ప్రోత్సహించాలి – అది మన సంప్రదాయం, గుర్తింపు.) ఇక మరొకరు మాట్లాడుతూ “యే సిర్ఫ్ నామ్ నహీ హై, యే హుమారే సంస్కార్ హై జో హమ్ దిఖానా చాహతే హై” అని జతచేస్తుంది. (ఇవి కేవలం పేర్లు మాత్రమే కాదు, మనం ప్రదర్శించాలనుకుంటున్న విలువలు సంస్కృతి) ఇలా అక్కడ ఉన్న ప్రతీ ఒక్కరు మన సాంస్కృతిక వైభవాన్ని గౌరవిస్తూ దానిని పునర్జీవింపచేయాలనుకుంటున్నారు.
మొదట్లో ఇక్కడ కట్టిన ఇళ్లకు పేరుపెట్టాలని.. కమ్యూనిటీ సమావేశాలలో చర్చించారు. ఆ తర్వాత అక్కడ నివసించే కుటుంబాలు అన్నీ శాంతి, శ్రేయస్సు, సామరస్యం, భారతీయ విలువలను ప్రతిబింబించే తగిన సంస్కృత పేర్ల కోసం పరిశోధన ప్రారంభించడంతో త్వరలోనే ఊపందుకుంది. స్థానిక పండితులు, భాష ఔత్సాహికులు నివాసితులకు ఈ విషయమై తమ మద్దతు ఇచ్చారు. ఇలా కాలనీలో ఉండే ప్రతి ఒక్కరు తమ ఇంటికి సంస్కృత భాషలోని పేరు పెట్టుకున్నారు. ఇలా వారు చేసిన ఈ చర్య అందరికీ మార్గదర్శకంగా నిలుస్తుందనడంలో ఎటువంటిసందేహమూ లేదు..