సంప్రదాయ చదువుకు పెన్నిధి.. సరస్వతి శిశు విద్యా మందిర్
– డాక్టర్ ఆశిష్ కుమార్ ద్వివేది
సరిగ్గా ఏడు దశాబ్దాల క్రితం అంటే 1952లో ‘భారత రత్న’ నానాజీ దేశ్‌ముఖ్ 1952లో గోరఖ్‌పూర్‌లో సరస్వతి శిశు మందిర్ పాఠశాలల రూపేణా ఒక విత్తనాన్ని నాటినప్పుడు అది ఒక వటవృక్షమై దాని శాఖోపశాఖలు దేశమంతటా విస్తరిస్తాయని నాడు వారు భావించి ఉండకపోవచ్చు. కానీ అలనాటి గురుకుల విద్యా విధానాన్ని నేటి తరాలకు అందించడంలో సరస్వతి శిశు విద్యా మందిర్ పాఠశాలలు పోషిస్తున్న పాత్ర అనన్య సామాన్యమైనది.
రోషన్ కుమార్ పురోహిత్ ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో నీలాద్రి విహార్‌లో సరస్వతి శిశు విద్యా మందిర్ (SSVM)లో 10వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలలో శైలేంద్ర గురూజీ ఉపదేశించినట్టుగా ఉదయాన్నే నిద్ర లేవగానే ‘‘కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవిందా ప్రభాతే కరదర్శనమ్’’ అని అరచేతులను చూసుకొని ప్రార్థిస్తాడు. ఆ తర్వాతనే దినచర్యకు ఉపక్రమిస్తాడు. గణేశ స్తుతి, సరస్వతి వందనం చేయకుండా ఏ రోజునూ రోషన్ కుమార్ పూర్తి చెయ్యడు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను సజీవంగా ఉంచడంలో SSVM కొనసాగిస్తున్న కృషికి రోషన్ కుమార్ ఒక నిదర్శనం. వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన రోషన్ సైన్సులో ప్లస్ టూను సరస్వతి జ్ఞాన్ మందిర్‌లో పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. తద్వారా ఇంజినీర్ కావడం అతడి లక్ష్యం. రోషన్‌కు SSVMలో చదువు చెప్పించే దిశగా తాము తీసుకున్న నిర్ణయం పట్ల అతడి తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. పాఠశాలలో వాలీబాల్, ఖోఖో లాంటి క్రీడలకు తోడు మండల్ కబడ్డీ, ట్రాఫిక్, హీరా చోరి, బహు చోరి లాంటి మానసిక ఉల్లాసం కలిగించే కార్యకలాపాల్లోనూ రోషన్ పాలుపంచుకుంటున్నాడు.
గడచిన 10 సంవత్సరాలుగా నీలాద్రి విహార్ లోని SSVMలో చదువుకుంటున్నాడు రాజేష్. భువనేశ్వర్ గురించి అతడికి తెలిసింది చాలా తక్కువ. నగరానికి చెందిన విపరీత పోకడలు ప్రభావం నుంచి ఈ అమాయకమైన బాలలను పరిరక్షించే ప్రక్రియలో భాగంగా SSVM క్యాంపస్‌ను వీడి వెలుపలకు వెళ్ళడానికి విద్యార్థులను అనుమతించరు. సరస్వతి శిశు విద్యా మందిర్ పాఠశాలలు క్రమశిక్షణకు పెట్టిందిపేరు. రాజేష్ హాస్టల్‌లో స్వచ్ఛమైన, పరిశుభ్రమైన శాకాహారాన్ని తీసుకుంటాడు. సాయంత్రపు శాఖలో యోగ సాధనలో రాజేష్ శిక్షణ పొందు తున్నాడు. తాను సాగిస్తున్న విద్యాభ్యాసంలో ఉత్తమమైంది విద్యా మందిర్‌లో చవిచూస్తున్నానని రాజేష్ తెలిపాడు.
ఒడిశాలోని భుబన్‌లో SSVMలో స్మృతి నారాయణ్, దివ్యేష్ చదువుకుంటున్నారు. మరే ఇతర పాఠశాలలో లేని విధంగా తమకు వేద గణితం బోధిస్తున్న తమ పాఠశాలను చూసి వారు గర్విస్తున్నారు. ఊర్ధ్వ తిర్యగ్‌భ్యం సూత్రం ఆధారంగా క్లిష్టమైన గుణకార సమస్యలను అత్యంత సులభంగా పరిష్కరిస్తున్నానని స్మృతి నారాయణ్ చెప్పాడు. వేదాల్లో నిష్ణాతులైన తన పూర్వీకులు నేటి గణిత శాస్త్రవేత్తలకన్నా మిన్నగా గణిత శాస్త్రం పట్ల చక్కని అవగాహన కలిగిన వారుగా అతడు భావిస్తున్నాడు. గణిత శాస్త్ర మూలాలు భారత్‌లో ఉన్నాయి. నగరాల నుంచి పట్టణాలకు, పట్టణాల నుంచి గ్రామాలకు విస్తరిస్తున్న SSVMల గురించి ఏ ఒక్కరూ ప్రస్తావించడంలేదు. మరీ ముఖ్యంగా ఈ పాఠశాలు సాధించిన, సాధిస్తున్న విజయాల పట్ల మీడియా మౌనం వహించడం అత్యంత ఆశ్చర్యకరం.
చదువుల ప్రపంచంలో ఘనత వహించిన కొన్ని పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్న ఫీజులతో పోలిస్తే విద్యా మందిర్‌లో ఫీజులు చాలా తక్కువ. ప్రతి నెలా ట్యూషన్ ఫీజు రూపేణా రూ.1,000 చెల్లించడం ద్వారా అత్యుత్తమైన విద్యా బోధనను ఒక 10వ తరగతి విద్యార్థి విద్యా మందిర్‌లో పొందవచ్చు. అలాగని పట్టణంలో నెంబర్ వన్ పాఠశాల విద్యా మందిర్ అని ఎలుగెత్తి చాటి చెప్పే ఎలాంటి భారీ ప్రకటనలతో కూడిన హోర్డింగులు మచ్చుకైనా కనిపించవు. ఈ పాఠశాలల్లో పాఠాలు బోధించే గురువులు ఎలాంటి వేతనాన్ని పుచ్చుకోరు. గురుకుల విద్యా బోధనకు తగ్గట్టుగా తాము అందించిన సేవలకు వారు కేవలం గురు దక్షిణ మాత్రమే స్వీకరిస్తారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు (RSS) విద్యా విభాగమైన విద్యా భారతి సరస్వతి శిశు విద్యా మందిర్ పేరిట అతి పెద్ద ప్రైవేట్ పాఠశాలల నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నది. దేశవ్యాప్తంగా దాదాపు 30,000 పాఠశాలలు నడుస్తున్నాయి.
‘సా విద్యా విముక్తయే’ (విముక్తిని ప్రసాదించే విద్య) నినాదంగా ‘‘విద్యను భారతీయకరణ, జాతీయీకరణ మరియు ఆధ్మాత్మికీకరణ’’ గావించే ప్రక్రియకు విద్యా భారతి పూనుకుంది. పెద్ద పెద్ద వాణిజ్య సముదాయాల్లో విద్యను ఒక ఖరీదైన వస్తువుగా మార్చి పిల్లలకు ఖరీదైన విద్యను అందించే దిశగా వారి తల్లిదండ్రులే లక్ష్యంగా వెదజల్లే వ్యాపార ప్రకటనలకు వార్షిక బడ్జెట్‌ను రూపొందించుకుంటున్న వర్తమాన కాలానికి విద్యా భారతి సత్ సంకల్పం విస్మయం కలిగించవచ్చు. ‘విద్యను భారతీయకరణ, జాతీయీకరణ మరియు ఆధ్మాత్మికీకరణ’ చేసే దిశగా సరస్వతి శిశు విద్యా మందిర్ పాఠశాలలు సాగిస్తున్న కవాతు మీడియాకు కనిపించకపోవడం విడ్డూరం.