సెక్యులర్, సోషలిస్టు పదాలపై చర్చ జరగాలి : హోసబళే
దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించిన వారే ఇప్పుడు రాజ్యాంగ ప్రతులతో తిరుగుతున్నారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే ఎద్దేవా చేశారు. అంతేకాకుండా దేశంలో ఎమర్జెన్సీని విధించిన వారు క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. ఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో అత్యవసర పరిస్థితిపై ప్రముఖ జర్నలిస్ట్ రామబహదూర్ రాయ్ రచించిన గ్రంధాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా హోసబళే మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితి సమయంలోనే రాజ్యాంగంలో సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలను చొప్పించారన్నారు. ఎమర్జెన్సీసమయంలో అసలు పార్లమెంట్ పనిచేయలేదని,న్యాయవ్యవస్థ కూడా క్రియాశీలకంగా లేదని, హక్కులు కూడా లేవని, అయినా.. ఈ రెండు పదాలను రాజ్యాంగంలో చేర్చారన్నారు. అందుకే సెక్యులర్, సోషలిస్ట్ అన్న పదాలపై చర్చ జరగాలని ఆయన పట్టుబట్టారు. అసలు వీటిపై చర్చే జరగలేదన్నారు. అసలు ఈ రెండు పదాలూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో లేనే లేవని, అందుకే ఈ రెండు పదాలపై చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఎమర్జెన్సీ విధంచిన సమయంలో తన పరిస్థితిని దత్తాత్రేయ గుర్తు చేస్తూ.. ‘‘అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో నేను బెంగళూరులోని ఓ శాఖలో వున్నాను. మొబైల్ లేదు. టీవీ లేదు. వాజ్ పేయి, అద్వానీ కూడా బెంగళూరులోనే వున్నారు. దేశంలో అత్యయిక పరిస్థితి విధించారని వాజ్ పేయికి చెప్పడానికి మేము వెళ్లాము. అయితే.. కొన్ని నిమిషాల ముందే ఆయనకూ సమాచారం అందింది. మరోవైపు ప్రభుత్వ అతిథి గృహల్లోని ఫోన్లు కూడా పనిచేయలేదు. మా ముందే వాజ్ పేయి, అద్వానీ అరెస్టయ్యారు. దీనిని కళ్లారా చూశాను.అది భారత ప్రజల గొంతును అణచివేసిన సమయం’’ అని గుర్తు చేసుకున్నారు.