ఓ రాజ్య పరిపాలకురాలిగా ఆదర్శ మూర్తి రాణి అహల్యా బాయి : మోహన్ భాగవత్

హిందూ దేవాలయాలను జీర్ణోద్ధరణ చేయించిన రాజమాత దేవీ అహల్యబాయి హోల్కర్‌. అనేక సత్రాలు కట్టించారు. కాశీ ఆలయం, కేదారనాథ్‌, గయ, ప్రయాగ, శ్రీశైలం, రామేశ్వరం, పూరి జగన్నాథాలయం… ఇలా అనేక ధర్మ కార్యాలు చేశారు. ఆవిడ మంచి పరిపాలనాదక్షురాలు. ప్రతి రోజూ నర్మదా నదిలో స్నానం ఆచరించి, మట్టితో శివలింగాన్ని తయారు చేసి ఆ లింగం సాక్షిగా న్యాయనిర్ణయం చేసేవారు. నేటితో అహల్యాబాయి హోల్కర్‌ జయంతి. త్రిశతాబ్ది వేడుకలు దేశమంతటా జరుపుకుంటున్నాం. ఈ నేపథ్యంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు సరసంఘ చాలక్‌ ప.పూ. మోహన్‌ భాగవత్‌ జాతినుద్దేశించి అహల్యాబాయి గురించి మాట్లాడారు. ఆ ప్రసంగం యథాతథంగా…

ఈ సంవత్సరం పుణ్యశ్లోక్‌ దేవి అహల్యాబాయి హోల్కర్‌ 300 వ జయంతి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె వ్యక్తిత్వం మనకు ఆదర్శం. దురదృష్టవశాత్తు ఆమెకు చిన్న తనంలోనే వైధవ్యం వచ్చింది. ఒంటరి మహిళ అయినా, అంత పెద్ద రాజ్యాన్ని పరిపాలించడమే కాకుండా… విస్తరించడం కూడా చేసింది. కేవలం విస్తరించడమే కాకుండా.. సుపరిపాలన కూడా అందజేసింది. అసలు రాజ్య పరిపాలకురాలు ఎలా వుండాలో అహల్యాబాయి ఉదాహరణగా నిలిచింది. ఆమె పేరు ముందు ‘‘పుణ్యశ్లోక’’ అన్న పేరు కూడా చేర్చబడిరది. ప్రజలను దు:ఖం నుంచి, ఆపదల నుంచి విముక్తి చేసింది కాబట్టే ఆమె పేరు పక్కకు ఈ పదం చేర్చారు. అప్పట్లో రాజ్యాలను ఆదర్శంగా పాలించేవారేవరైతే వున్నారో.. ఆ జాబితాలో అహల్యాబాయి హోల్కర్‌ కూడా ఒకరు.

అనేక పరిశ్రమలను నెలకొల్పింది…

ప్రజలకు ఉపాధి కల్పించేందుకు దేవి అహల్యాబాయి పరిశ్రమలను కూడా ఏర్పాటు చేసింది. అత్యంత పకడ్బందీగా ఈ పరిశ్రమలను నెలకొల్పింది.. ఎంత పక్కాగా అంటే.. మహేశ్వర్‌ వస్త్ర పరిశ్రమ అనేది నేటికీ నిరాటంకంగా కొనసాగుతూనే వుంది. నేటికీ అనేక మందికి ఉపాధి కల్పిస్తోంది ఈ పరిశ్రమ. అహల్యా బాయి తన రాజ్యంలోని అన్ని వర్గాల ప్రజలపై దృష్టి సారించారు. ముఖ్యంగా బలహీన వర్గాలపై, వెనకబడ్డ వర్గాలపై ఎక్కువ శ్రద్ధ వహించింది. అలాగే తన రాజ్యంలో పన్నుల విధానాన్ని పూర్తిగా అదుపులో వుంచింది. రైతులపై ప్రత్యేక శ్రద్ధ వహించింది. దీంతో ఆమె రాజ్యం అన్ని రకాలుగా సుభిక్షంగా వుండేది. ప్రజలను తన సొంత పిల్లల్లాగే చూసుకుంది. అందుకే ఆమెకు ‘‘దేవి అహల్యా బాయి’’ అన్న బిరుదు వచ్చిందేమో.

నారీశక్తికి ప్రతీక అహల్యా బాయి

మాతృశక్తి ఎంత శక్తిమంతంగా వుంటుందో… ఎంతగా పనిచేస్తోందో… అదంతా అహల్యాబాయి చేసి చూపించింది. అహల్యాబాయి ఆదర్శప్రాయమైంది. తన జీవితం ద్వారా ఆ ఆదర్శతత్వాన్ని మనకి అందించింది. ఆమె చేసిన పనులన్నీ చాలా ప్రత్యేకమైనవి. ఆనాటి పాలకులందరూ ఆమెను దేవతా స్వరూపంగానే భావించేవారు. అందరితోనూ ఆమె స్నేహ పూర్వక సంబంధాలనే నెరిపింది. తన రాజ్యం మీద ఎలాంటి దాడులు జరగకుండా ఎన్నో ఏర్పాట్లు చేసుకుంది. యుద్ధ నీతిలో నిపుణురాలిగా పేరు గడిరచారు. మన దేశ సాంస్కృతిక పునాదిని మరింత బలోపేతం చేయడానికి దేశంలోని కొన్ని ప్రాంతాల్లో దేవాలయాలను నిర్మించింది. దేవి అహల్యా బాయి స్వయంగా పాలకురాలైనప్పటికీ ఎప్పుడూ పాలకురాలిగా భావించుకోలేదు. శివుడి ఆజ్ఞ మేరకే తాను పరిపాలన చేస్తున్నానని ఆమె నమ్మింది. ఇప్పటి పరిస్థితుల్లో కూడా ఆమె మనకు ఆదర్శప్రాయురాలు. ఆమెను ఆదర్శంగా తీసుకుంటూ.. యేడాది పొడువునా స్మరించుకొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది చాలా సంతోషించదగ్గ విషయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *