దేశ ప్రయోజనాల దృష్ట్యా సేవా కార్యక్రమాలు చేయాలి.. దేశాన్ని అగ్రగామిగా నిలపాలి: మోహన్ భాగవత్

దేశ ప్రయోజనాల దృష్ట్యా సేవా కార్యక్రమాలు చేసి, భారత దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు సమిష్టి కృషి అవసరమని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్  సరసంఘ చాలక్‌ మోహన్‌ భాగవత్‌ అన్నారు. భారత్‌ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు దేశాన్ని, సమాజాన్ని విభజించే పనిలో నిమగ్నమై వున్నారని హెచ్చరించారు. హృషీకేష్‌లో మాధవ్‌ సేవా విశ్రమ్‌ సదన్‌ ని మోహన్‌ భాగవత్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భారత్‌లో నివసించే వారందరూ ఒకే ఆత్మ, ఒకే శరీరం గలవారని, కానీ.. మనస్సు పరంగా చూస్తే.. అందరూ ఒకటేనన్నారు. సరిహద్దుల్లో ఎప్పుడైనా ఇబ్బందులు తలెత్తితే.. మీరెక్కడి వారు? ఎక్కడి నుంచి వచ్చారు? అన్న ప్రశ్నలు వేయరని, అందరూ కలిసి సరిహద్దుల్ని కాపాడుకునే పనిలో నిమగ్నమైపోతారన్నారు.

ఛత్రపతి శివాజీ, స్వామి వివేకానందని ప్రతి ఒక్కరూ ఆదర్శవంతంగా తీసుకుంటారని, ఇలా చాలా మంది వున్నారన్నారు. మనందరిలోనూ హిందుత్వ భావన వుందని, దానిని అందరూ గుర్తించాలని ఉద్బోధించారు. సంస్కృతి, సంప్రదాయాలు, దుస్తులు, ఆచారాలు.. ఇలా ఏ రూపంలో అయినా ఆ భావన వుండొచ్చని.. ఆ భావనతో మనమందరమూ ఏకమైతే.. దేశ ప్రగతిని ఎవ్వరూ ఆపలేరని స్పష్టం చేశారు. నేడు ప్రపంచంలో భారత్‌ ప్రతిష్ఠ బాగా పెరిగిందని, ఎవ్వరైనా.. భారత్‌పై చెడు చేయడానికి ప్రయత్నిస్తే… వారింట్లోకి ప్రవేశించే చంపేసే శక్తి సామర్థ్యాలు వచ్చాయన్నారు.

సేవయే మనిషికి అత్యున్నత ధర్మమని, నేడు ప్రజా సేవలో మనుషులను కలిసే విషయంలో చాలా ప్రాముఖ్యత వుందన్నారు. ఇలా ఒక చోట కలిసే శక్తి లేకుండా ప్రజా సేవ లక్ష్యం ఎలా నెరవేరుతుందని ప్రశ్నించారు. సేవకు, అంకిత భావానికి ఈ సభే ప్రత్యక్ష ఉదాహరణ అని, మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే రోగులు, వారి కుటుంబీకులు, అలాగే మైదాన ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా ఈ విశ్రాంతి భవనం ఉపకరిస్తుందన్నారు. ఈ సేవ ద్వారా సామాజిక సేవలో ఓ ఆదర్శాన్ని చూపిస్తున్నామన్నారు.

120 గదులు …  30 కోట్లతో నిర్మాణం 

హృషీకేశ్‌లోని ఏయిమ్స్‌ సమీపంలో వీరభద్ర మార్గ్‌లో భావూరావ్‌ దేవరస్‌ సేవా ట్రస్ట్‌ ద్వారా ఈ మాధవ సేవా విశ్రామ్‌ సదన్‌ నిర్మించబడిరది. మొత్తం నాలుగు అంతస్తుల్లో ఈ భవనం వుంటుంది. ఈ విశ్రాంతి భవనాన్ని కేవలం రెండు సంవత్సరాల్లోనే నిర్మించారు. దీనికి 30 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. దాదాపు 150 మంది దాతలు ఈ భవన నిర్మాణానికి సహకరించారు. మొత్తం 120 గదులు, 430 పడకల సౌకర్యం ఇందులో వుంది. పక్కనే వుండే ఏయిమ్స్‌ ఆస్పత్రిలో చేరిన రోగి బంధువులకు ఓ ఫామ్‌ ఇస్తారు. ఈ ఫామ్‌ నింపిన తర్వాత రోగి సహాయకులకు ఇక్కడ వసతి సౌకర్యాలు కల్పిస్తారు. వుండడానికి 10 రూపాయలు, భోజనానికి 30 రూపాయలు వుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *