కలుపు మొక్కలతో “సస్య గవ్య” పద్దతి… రాళ్ళు, బంజరు భూముల్లోనూ పంటలు

రాళ్లూ, రప్పలతో వుండిపోయిన బంజరు, నిస్సారమైన భూములను కూడా సస్యగవ్యంతో తిరిగి పునరుజ్జీవింపచేస్తున్నారు. శ్రీకొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ ఉద్యానవన యూనివర్శిటీ దీనిని ప్రయోగాత్మకంగా రుజువు కూడా చేసేసింది. సంప్రదాయ పద్ధతి అయిన ‘‘కృషిపరాశర’’ గ్రంథం నుంచి తీసుకున్న సాగు పద్ధతిలో బంజరు భూములను, నిస్సారవంతమైన భూములకు తిరిగి ప్రాణం పోస్తున్నారు. అనేక రకాల పండ్ల మొక్కలను ‘‘సస్యగవ్య’’ పద్ధతిలో తిరిగి ప్రాణం పోస్తున్నారు. యూనివర్శిటీకి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా. శంకర స్వామి ఈ పద్ధతి ద్వారా వనపర్తి జిల్లా మదనాపురంలో 11 ఎకరాల రాళ్లతో వున్న బంజరు భూమిలో ఈ ప్రయోగం చేస్తున్నారు.

పొలంలో మొలిచే కలుపు మొక్కలను పీకి ఆ పొలంలోనే ఆచ్ఛాదనగా వాడటతో పాటు…ఆ మొక్కలను మురగబెట్టి సస్యగవ్య అనే ద్రవరూప ఎరువును తయారు చేస్తున్నారు. దీన్ని అదే పొలంలో గడ్డీ గాదాన్ని కుళ్లించడానికి వాడటం ద్వారా భూమిని సారవంతం చేసుకోవచ్చు. బంజరు భూముల్ని, సారం కోల్పోయిన భూముల్ని సాగులోకి తేవడానికి బయటి నుంచి ఎలాంటి ఉత్పాదకాలను ఖర్చుపెట్టి, కొనాల్సిన అవసరమే లేదు. కలుపు మొక్కలుగా మనం భావించే వాటిలో చాలా మటుకు నిజానికి ఔషధ మొక్కలేనని డా. శంకర స్వామి అంటున్నారు. వాటిని పీకేయకుండా అదే నేలలో కలిపేయాలని సూచిస్తున్నారు. ఏ రసాయనిక ఎరువులు గానీ, పురుగు మందులు గానీ చల్లకుండా వుంటే, ఆ భూమిలోనే వుండే సూక్ష్మజీవ రాశి సంరక్షించబడి, భూమిని క్రమంగా సారవంతం చేస్తుందని పేర్కొన్నారు.

సస్యగవ్య తయారీ ఎలా చేయాలంటే…

పొలంలో మొలిచిన కలుపు మొక్కలను యేడాదికి మూడు దఫాలు పీకి, వాటితో సస్యగవ్యను తయారు చేస్తున్నారు. ఆ పొలంలోని తాజా కలుపు మొక్కలు కిలో, తాజా ఆవుపేడ కిలో, ఆవు మూత్రం లీటర్‌, రెండు లీటర్ల నీతితో కలిపి పొలంలోనే నీడన ఫైబర్‌ పీపాల్లో మురగబెడుతున్నారు. రోజూ ఉదయం, సాయంత్రం కలపాలి. ఇలా 10 నుంచి 12 రోజుల పాటు చేయాలి. ఇలా చేస్తే సస్యగవ్య ద్రవరూప ఎరువు తయారైపోతుంది.

పొలంలోని సాళ్ల మధ్యలో ఆచ్ఛాదనగా వేసిన గడ్డి, ఆకులు అలుములు, కొమ్మలు రెమ్మలపై సస్యగవ్యను 1:1 పాళ్లలో నీరు కలిపి పిచికారీ చేయాలి. వారం తర్వాత ఆ గడ్డిని రొటోవేటర్‌ తో మట్టిలో కలిపేసి, ఆ మట్టిపై మరోసారి సస్యగవ్యను పిచికారీ చేయాలి. దీంతో ఈ సేంద్రీయ పదార్థం కుళ్లి, మట్టిలో కలిసిపోయి, భూమి సారవంతం అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *