జగన్నాథుడి రత్న భాండాగారంలో మరో రహస్య గది?
ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఆలయ రత్న భాండాగారం తాళం చెవిల అదృశ్యం వ్యవహారం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నది. తాళాల అదృశ్యం వెనుక ఏదో జరిగిందంటూ ఆలయ ప్రధాన పూజారి జగన్నాథ్ మహాపాత్ర అనుమానాలు వ్యక్తం చేశారు. తాళాల అదృశ్యం తర్వాత డూప్లికేట్ తాళాలను గుర్తించినట్టు చెప్పడంపై ఇప్పటికే గందరగోళం నెలకొన్న నేపథ్యంతో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకొన్నది.
రత్న భాండాగారం తాళాలు కనిపించకుండా పోవడం, డూప్లికేట్ తాళాలు తెరపైకి రావడం సిగ్గుచేటని మహాపాత్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ డూప్లికేట్ తాళాల చెవులు రత్న భాండాగారం ఇన్నర్ చాంబర్‌లోని తాళాలకు సరిపోలేదని పేర్కొన్నారు. ‘దీన్నిబట్టి చూస్తే ఏదో జరిగినట్టు అనిపిస్తుంది. నిజం బయటకు రావాలంటే దర్యాప్తు జరగాలి’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
విలువైన వస్తువులు ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని భాండాగారం పెట్టెలు తెరిచాకే నిర్ధారించగలమని తెలిపారు. డూప్లికేట్ తాళం చెవులు ఇన్నర్ చాంబర్ తాళాలను తెరువలేకపోవడంపై దర్యాప్తు చేస్తామని ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. రత్న భాండాగారం కింద రహస్య గది ఉన్నదని, సొరంగ మార్గం ద్వారా వెళ్లగలిగే ఆ గదిలో విలువైన సంపద దాచారని కొందరు చరిత్రకారులు చెప్పారు. 1902లో ఆంగ్లేయుల పాలనలో ఈ సొరంగ మార్గం అన్వేషణకు విఫల ప్రయత్నాలు జరిగాయని చెబుతున్నారు.
ప్రముఖ చరిత్రకారుడు నరేంద్ర కుమార్ మిశ్రా మాట్లాడుతూ పూరీ రాజు కపిలేంద్ర దేవ్, తర్వాత పురుషోత్తం దేవ్ హయాంలలో పెద్దయెత్తున సంపద సమకూరిందని, దాన్ని భద్రపరిచేందుకు సొరంగ మార్గం నిర్మించారని తెలిపారు. ఇందులో 34 కిరీటాలు, రత్న ఖచిత స్వర్ణ సింహాసనాలు, దేవతల బంగారు విగ్రహాలు ఉన్నాయని వివరించారు.