రైతు విత్తనాలకి భరోసా ”సతీ పోర్టల్”.. నకిలీ విత్తనాలతో మోసపోకుండా కేంద్రం నిర్ణయం
రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. విత్తనాల అమ్మకంలో జరిగే అవకతవకలకు చెక్ పెట్టేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ ఓ పోర్టల్‌ను ప్రారంభించింది. ఆ పోర్టల్ పేరు ‘‘సతీ పోర్టల్’’. పంట విత్తనాలను అమ్మేందుకు దుకాణుదారులకు కచ్చితంగా లైసెన్స్ అవసరమని పేర్కొంది. రైతులు విత్తనాల కొనుగోలులో ఇబ్బందులు పడకుండా సతీపోర్టల్‌ను లాంఛ్ చేశారు. ఇప్పటి వరకైతే వ్యవసాయ శాఖకు దరఖాస్తు చేసుకుంటే, అధికారులు వాటిని పరిశీలించి, విత్తనాలు అమ్మేందుకు లైసెన్స్‌లు ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం లైసెన్స్‌ను మంజూరు చేసేందుకు ఆన్‌లైన్ సిస్టమ్ తీసుకొచ్చారు. రైతులకు పంట విత్తనాలు అమ్మేందుకు ఇక నుంచి లైసెన్స్‌దారులు ఈ సతీ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలి. లైసెన్స్ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు వివరాలను సతీపోర్టల్ లో నమోదు చేయాలి. విత్తనాల పేరుతో, నకిలీ విత్తనాలతో మోస పోతున్న రైతులను కాపాడేందుకు ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. విత్తనాల కొనుగోలును కూడా ఈ పోర్టల్ ద్వారానే లావాదేవీలు జరగాలని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
దీనిలో మరో పకడ్బందీ వ్యవహారం కూడా కేంద్రం తీసుకొచ్చింది. సతీపోర్టల్‌లో ధృవీకరించిన తరువాతే విత్తనాలను అమ్మకాలు జరపాలని కూడా కేంద్రం ప్రకటించింది. అయితే ఈ లైసెన్స్‌ను మంజూరు చేసేటప్పుడు ఏడు శాఖల అధికారులు పరిశీలిస్తారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన డీలర్లు మాత్రమే సతీపోర్టల్‌లో దరఖాస్తు చేసేందుకు అర్హత కలిగి వుంటారు.
సతీపోర్టల్ ద్వారా ఈ విధంగా లైసెన్స్ పొందాలి….
1. పోర్టల్‌లో నమోదు చేసుకునేందుకు ముందుగా విత్తనాలను ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తారో కచ్చితంగా చెప్పాలి.
2. విత్తనాలను ఏ ప్రాంతంలో అమ్ముతారో… వాటిని ఎక్కడ నిల్వ చేస్తారో కూడా నమోదు చేయాలి.
3. పోర్టల్‌లో పేర్కొన్న వివరాలు, పేరు, తండ్రిపేరు, చిరునామా, ఈ మెయిల్ ఐడీ, ఆధార్, మొబైల్ నెంబర్లు నమోదు చేయాలి.
4. లైసెన్స్ ఫీజు ఆన్‌లైన్ లోనే చెల్లించాలి.
5. లైసెన్స్ ఫీజు చెల్లించిన 45 రోజుల లోపు లైసెన్స్ కూడా ఈ పోర్టల్ ద్వారానే డౌన్‌లోడ్ చేసుకోవాలి.
దీనికి కావల్సిన డాక్యుమెంట్లు ఇవి…
1. డీలర్‌గా దరఖాస్తు చేసే వ్యక్తి పాస్‌పోర్ట్ సైజు ఫోటో
2. గుర్తింపు కార్డ్
3. ల్యాండ్ రికార్డు అగ్రిమెంట్
4. సోర్స్ ధృవీకరణ పత్రం
5. నాణ్యత పనితీరుకి సంబంధించిన ధృవీకరణ
6. స్టేట్ డీలర్ ఇచ్చే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్