దేశవాళీ విత్తనాలకు భరోసానిస్తున్న ‘‘రాహీబాయ్ సోమ్ పోపెరే‘‘
మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలోని అకోల అనే గిరిజన గ్రామానికి చెందిన రాహీబాయ్ సోమ్ పోపెరే దేశీవాళీ విత్తనాల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుంది. సీడ్ మదర్‌గా ఈమె ప్రసిద్ధి చెందారు. చదువు లేదు.. అయినా నేడు ఎంతో మంది రైతులకు వ్యవసాయంపై శిక్షణ ఇస్తున్నారు. అంతరించిపోతున్న విత్తనాలను కాపాడుతున్నారు. ఈమె సేవలకు గుర్తుగా 2020లో కేంద్రం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
వ్యవసాయ కుటుంబానికి చెందిన రాహీబాయ్..పెళ్లయ్యాక కూడా వ్యవసాయాన్ని వదల్లేదు. భర్త కుటుంబానికీ వ్యవసాయమే ఆధారం. వ్యవసాయంలో లోటు పాట్లను దగ్గర నుంచి చూసిన ఆమె..పొలాన్ని ప్రయోగశాలగా మార్చి కొత్త కొత్త పద్ధతుల్లో సేద్యం చేసేది. సేంద్రియ సాగు చేయడమే కాకుండా ఇతరులకు మెళుకువలు నేర్పించడం, దేశవాళీ విత్తనాలను భద్రపరచడం మొదలుపెట్టారు. ఓ ఎన్జీవో సహకారంతో తన ఇంటి పరిసరాలలో దాదాపు 200 రకాల దేశవాళీ విత్తనాలతో కూడిన విత్తన భాండాగారాన్ని ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల రైతులకూ, స్వయం సహాయక బృందాలకు వీటిని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
ఆమె దగ్గర ప్రస్తుతం 32 రకాల పంటలకు సరిపడే 122 రకాలు విత్తనాలు ఉన్నాయి. ఇందులో 15 రకాల బియ్యం, 60 రకాల కూరగాయలు, తొమ్మిది రకాల బఠానీలు, అనేక నూనె గింజలు ఉన్నాయి. తను స్థాపించిన కల్సుబాయి పరిసార్ బియానీ సంవర్ధన్ సమితి అనే స్వయం సహాయక బృందంతో మహిళా రైతులను విత్తన పరిరక్షణలో పాల్గొనెలా ప్రోత్సహిస్తుంది. రైతులకూ, వ్యవసాయ విద్యార్థులకూ పాఠాలు చెబుతున్నారు. ఇలా ఇప్పటి వరకూ కనీసం 3500 మందికిపైగా రైతులు శిక్షణ పొందారు. 60 ఏళ్ల వయసులో కూడా రహీబాయ్ వ్యవసాయంపై మక్కువతో చేస్తున్న కృషి నేడు ఎంతో మంది యువ రైతులకు ఆదర్శం.