పర్యావరణ హితం కోసం ‘‘విత్తన రాఖీలు’’

రక్షా బంధన్. అందరికీ అత్యంత ఇష్టమైన పండగల్లో ఇదీ ఒకటి. అన్నా దమ్ములు, అక్కా చెళ్లెల్ల బంధాన్ని మరింత దృఢంగా చేసే పండగ. రక్షా బంధన్ సందర్భంగా మార్కెట్ లోకి రకరకాల రాఖీలు అందుబాటులోకి వస్తున్నాయి. వేటికవే ప్రత్యేకత. అయితే.. పర్యావరణ అనుకూల రాఖీలు కూడా మార్కెట్లలోకి వస్తున్నాయి.

ఈ యేడాది పర్యావరణ హితమైన విత్తన రాఖీలు అందుబాటులోకి వచ్చాయి. విజయవాడ వాసి నాగలక్ష్మి వీటిని తయారు చేశారు.పర్యావరణ హితంతోపాటు, మొక్కలు పెంచేందుకు ఇదో మార్గం అని ఆమె చెబుతున్నారు.కేవలం విత్తనాలు, అట్టపెట్టెతో రాఖీలు తయారుచేస్తూ పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించారు.

నాగలక్ష్మికి పర్యావరణంపై మక్కువ ఎక్కువ. తాను పని చేసే అంగన్వాడీ కేంద్రంలో చుట్టూ ఉన్నంత స్థలంలోనే మొక్కలు పెంచారు. భవిష్యత్తు తరాలకు మనం ఇచ్చే విలువైన కానుక ప్రకృతి, స్వచ్ఛమైన పర్యావరణం అని పదే పదే పిల్లలకు చెబుతుంటారు. ఆస్తులు అంటే పర్యావరణం, మొక్కలేనని ఆమె అంటున్నారు. ఈ కాలం పిల్లలకు మొక్కల విలువ, పర్యావరణం పట్ల శ్రద్ధ తగ్గుతోందని అందుకే తాను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని చెబుతున్నారు. ప్లాస్టిక్ వల్ల పర్యావరణం చెడిపోతోందని, ఇలాంటి రాఖీలతో మొక్కలను పెంచే అవకాశం దక్కుతుందని నాగలక్ష్మి చెబుతున్నారు.

ఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ వద్దే వద్దు, పర్యావరణ పరిరక్షణ కోసం మనం నిరంతరంగా కృషి చేయాలి అన్న స్పృహ పెరిగింది. ప్లాస్టిక్, ప్లాస్టిక్ ఆధారిత సామగ్రితో తయారుచేసిన రాఖీలు వాడటం అనారోగ్యకరం అని అవగాహన వచ్చింది. దేశీయ విత్తనాలతో రాఖీలు తయారు చేయడం ద్వారా అంతరించిపోతున్న మొక్కలను కాపాడుకోవచ్చని ఈ ప్రక్రియ ప్రారంభమైంది.

527 రకాల విత్తనాలతో ఈ రాఖీలు తయారు చేస్తున్నామని నిర్వాహకులు తెలుపుతున్నారు. వివిధ ఔషధ గుణాలు ఉన్న విత్తనాలతో కూడా ఈ రాఖీలు తయారు చేస్తున్నామని అంటున్నారు. 25 సంవత్సరాలుగా ఈ విత్తనాలతో తయారుచేసిన రాఖీలపై అవగాహన కల్పిస్తున్నామని తెలుపుతున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వివిధ రకాల వినూత్న పద్ధతిలో అవగాహన కార్యక్రమాలు చేస్తున్నామని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *