వ్యవసాయానికి అధిష్టాత్రి…త్యాగమయి సీతామాత
సాక్షాత్ మహాశక్తి స్వరూపిణి అయిన సీతామాత జన్మించిన రోజే సీతానవమి. బీహార్ రాష్ట్రం – మిథిలాంచల్ అంటే గంగ నదికి ఉత్తరాన ఆవలి ఒడ్డునఉన్న 19 జిల్లాలతో పాటుగా నేపాల్ భూభాగాన్నంతా కలిపి మిథిలాంచల్ గా పిలుస్తారు. ఆ ప్రాంతంలో వైశాఖ శుద్ధ నవమి రోజున సీతమ్మ తల్లి జన్మించింది. ఉత్తర భారత దేశంలోని చాలా రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా నేపాల్ మొత్తంలో సీతానవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. సీతాదేవి అయోనిజ, అసామాన్యురాలు, మూలప్రకృతి స్వరూపిణి…సీతమ్మ తల్లి మొదటి రూపం మహామాయ! దీనినే శబ్దబ్రహ్మమయి రూపం అని కూడా అంటారు! జ్ఞాన స్వరూపిణిగా వేదాధ్యయనం చేసే చోట ఈ తల్లి ప్రసన్న రూపంలో ఉండి అత్యున్నతమైన అలౌకికమైన భావాలను కలుగజేస్తుంది!! రెండోరూపం జనకుడు భూమిని దున్ను తున్నప్పుడు బయటపడిన రూపం! జనకుని కోట్లజన్మల పుణ్యవశంచేత తనకుతానుగా బిడ్డగా లభించిన క్రియాశక్తి రూపం సీతమ్మ!! ఇక మూడోరూపం అవ్యక్త ఇచ్ఛాశక్తి స్వరూపిణిగా జీవులందరిలో ఉంటుంది!జగత్తంతటిలో నిండి ఉండే జగదానంద కారిణిగా లక్ష్మీ స్వరూపంగా విరాజిల్లే తల్లి!! ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి మూడు శక్తుల రూపంగా, ముగ్గురమ్మల మూలపుటమ్మగా సాధకులు, ఉపాసకులు దర్శించవచ్చని బ్రహ్మదేవుడు దేవతలకు బోధించాడు!!
సీతమ్మతల్లి బలహీనురాలు కాదు, నిజానికి, ఆమె శక్తి అవతారం, చాలా తెలివైనది, పారదర్శకమైన స్వభావం కలిగినది, దృఢమైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం గలది. కేవలం రామాయణం మాత్రమే కాదు ఆమె పేరుతో ఒక ఉపనిషత్తే ఉంది! అందులో ఆమె అసలు సిసలైన స్వరూప స్వభావాలు మనకు గోచరిస్తాయి!! దానిపేరే సీతోపనిషత్తు. ఇది అధర్వణ వేదంలో ఉంది! బ్రహ్మదేవుడు తన దగ్గరకు వచ్చిన దేవతలకు సీతమ్మ మహాత్యాన్ని గురించి వివరించిన విషయాలు ఉపనిషత్తుగా మారింది!! సీతారాములు అభిన్న తత్వాలని, వారిద్దరూ ఒకే దివ్యజ్యోతికున్న వేర్వేరు అభివ్యక్తులని తులసీ రామాయణం చెబుతుంది. సీత ప్రధాన స్వరూపమని, అక్షర బ్రహ్మమని, ఇచ్ఛా, క్రియా, జ్ఞాన శక్తుల సమైక్య రూపమని నిర్ణయ సింధు వ్యక్తపరచింది. సీత ఆదిశక్తి, సృష్టి స్థితి లయకారిణి అని చాటింది రామతాపనీయోపనిషత్తు. సీత ముక్తిదాయని అని ఆధ్యాత్మిక రామాయణం అభివర్ణించింది. సీతమ్మ తల్లి ఆదిశక్తి అని శౌననీయ తంత్రం ప్రస్తుతించింది. వ్యవసాయానికి అధిష్టాత్రి అని రుగ్వేదం కీర్తించింది. అధర్వ వేదానికి చెందిన సీతోపనిషత్తు సీతను శాశ్వత శక్తికి మూలబిందువుగా అభివర్ణించింది. ‘యోగమాయ’ అని శ్లాఘించింది. సీత జగన్మాత అని ప్రశంసించింది పద్మపురాణం. సాధక సాధ్యమైన దేవిగా రుషులు తాపసులు కీర్తించారు.
మనందరికీ సీతమ్మ తల్లి అంటే…. దశరథుడి పెద్దకోడలు, శ్రీరామచంద్రుడి భార్య, మహాసాధ్వీమణి సీతమ్మ తల్లి ఇంతమాత్రమే మనకు తెలుసు!! కానీ మిథిలాంచల్ ప్రజలకు, ఆమె వారి కుమార్తె, సోదరి, వారి ఆడపడుచు. మిథిలా ప్రాంతపు రాజ్యాన్ని పాలించిన చక్రవర్తి కుమార్తె కనుక ఆమెను మైథిలి అంటారు. మిథిలా ప్రజలు సీతమ్మను ‘కిషోరి’ అని పిలుస్తారు, , నాగటి చాలులో దొరికినందున సీతా అనీ, జనకుని కుమార్తె అయినందున జానకి అని పిలుస్తారు, వైదేహి అంటూ పిలిచి ఆనందభరితులౌతారు,. “స్వామి వివేకానందుల వారన్నట్లుగా శ్రీరామచంద్రుని వంటి పురుషులు రాబోయే కాలంలో జన్మించ వచ్చునేమో కానీ, సీతమ్మ తల్లి వంటి త్యాగమయి, మహిళాశిరోమణి జన్మించడం అసంభవం”. ధైర్యం. సాహసం, అణకువ, సహనం ఇలా అనేకలక్షణాలు కలబోసుకున్న, శక్తికి నిర్వచనమైన సీతమ్మ తల్లి నేటి ఆధునిక కాలపు యువతులకు ఒక గొప్ప రోల్ మోడల్”.
(సీతా జయంతి సందర్భంగా )