సంరక్షణతో స్వావలంబన

మన దేశపు నిజమైన ఆస్తి యువత. ఆ యువత తనకాళ్ల మీద తాను నిలబడగలిగే దారిలేనపుడు ఆ ఆస్తి బరువు అవుతుంది. యువతకు ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెంపొందించుకునే మార్గాలను కల్పించడంలో ప్రభుత్వాలు, సామాజిక సంస్థల బాధ్యత ఎంతో ఉంటుంది.  మన దేశంలో ఈ మధ్య కాలంలో నైపుణ్యాభివృద్ధి పైన శ్రద్ద పెరిగిందని గణాంకాలు చెపుతున్నాయి. కానీ ఇంకోవైపు ప్రపంచంలో కోవిడ్‌ కాలం తరువాత మనిషి జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయి. ఆరోగ్యంపై శ్రద్ద పెరిగింది, వైద్య రంగంలో చాలా మార్పులు వచ్చాయి, ప్రత్యేకించి మన దేశంలో వైద్యరంగంలో మౌలిక సదుపాయాలు విస్తరించాయి. యువత, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఆర్థికంగా వెనుకబడిన వారిలో ఈ నైపుణ్యాలను పెంచినట్లయితే వారు ఈ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకుంటారనే ఉద్దేశ్యంతో రాష్ట్రీయ సేవాభారతికి అనుబంధ సంస్థ అయిన సేవాభారతి తెలంగాణ, భారత ప్రభుత్వ గుర్తింపుతో, ఇతర కంపెనీల సహకారంతో 2022 జనవరి2న, RSS అఖిల భారతీయ సర్‌ కార్యవాహ  మాననీయ దత్తాత్రేయ హోసబలే జీ, యశోద గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌,  శ్రీ రవీంద్రరావు, ఇతర ప్రముఖల సమక్షంలో GDA (గ్రాడ్యుయేట్‌ డ్యూటీ అసిస్టెంట్‌) ప్రోగ్రామ్‌ ప్రారంభమయింది.

హైదరాబాద్‌ బోయినపల్లిలో ట్రైనింగ్‌, నివాసానికి అనుగుణంగా అన్ని వసతులతో కూడిన భవనంలో ప్రారంభమైన ఈ GDA ప్రోగ్రామ్‌ ద్వారా విద్యార్థులు నర్సింగ్‌ అసిస్టెంట్స్‌గా అనేక కార్పొరేట్‌ ఆసుపత్రులలో విలువలతో కూడిన వైద్య సేవలు అందించటంలో ప్రత్యేక శిక్షణ పొందు తారు. వ్యక్తిగత పరిశుభ్రతను కాపాడుకోవడం, ఇన్‌ఫెక్షన్‌ నియంత్రణ చర్యలు, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో అవసరమైన క్లినికల్‌ నైపుణ్యాలను పాటించడం, నిర్దేశించిన విధంగా క్లిష్టమైన కీలకాంశాలను (critical parameters) పర్యవేక్షించడం, డాక్యుమెంట్‌ చేయడం వంటి పద్ధతులను ఈ కోర్సు ద్వారా విద్యార్థులు నేర్చుకుంటారు. శిక్షణలో భాగంగా సంస్కృతీ, సంస్కారం ద్వారా విద్యార్థులలో విలువలను పెంపొందించడం ఇందులో ప్రధానమైన అంశం. ముఖ్యంగా వృద్ధులు, మానసిక రోగులతో వ్యవహరించడంలో ఇది చాలా ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది.

3 నెలల కోర్స్‌, 1 నెల ఆన్‌ జాబ్‌ ట్రైనింగ్‌ కలిపి ఈ కోర్స్‌ 4 నెలలు ఉంటుంది. 10వ తరగతి లేదా ఆ పైన అర్హత కలిగి, 18 – 35 సంవత్సరాల మధ్య ఉన్న యువతులు ఈ కోర్స్‌లో చేరవచ్చు. శిక్షణ, ఆన్‌ జాబ్‌ ట్రైనింగ్‌లో వసతి (boarding and lodging) సేవాభారతి కల్పిస్తుంది. విలువలతో కూడిన వైద్య సేవలు అందించటంలో ప్రత్యేక శిక్షణ పొందుతారు కాబట్టి శిక్షణ అనంతరం విద్యార్థినులు వెంటనే ఉపాధి పొందడానికి ఉపయోగపడుతుందని, అనేక కార్పొరేట్‌ హాస్పిటల్స్‌, హోంకేర్‌ సర్వీసెస్‌ కంపెనీలు సంస్థను సంప్రదిస్తున్నాయని, ఇప్పటికే సుమారు 600 మంది మహిళలు ఉపాధి పొందారని సేవాభారతి ప్రతినిధి తెలిపారు.

శిక్షణలో భాగంగా విద్యార్థినులు వివిధ బస్తీలలో సేవాభారతి నిర్వహించే హెల్త్‌ క్యాంపు లలో పాల్గొంటారు, తద్వారా వారిలో సేవాభావం పెరుగుతుంది. సంవత్సరానికి 3 బ్యాచ్‌లు వుంటాయని, సాధారణంగా బ్యాచ్‌ అయిన తరువాత ప్రత్యేక కార్యక్రమం ద్వారా విద్యార్థినులకు సర్టిఫికెట్స్‌ అందచేస్తామని అన్నారు. ఈ కోర్స్‌ ద్వారా వ్యక్తిగత ఆరోగ్యంపట్ల శ్రద్ద వహిస్తూ, ఉపాధి పొంది ఉద్యోగం చేస్తూ, వారి కుటుంబానికి ఆర్థిక, ఆరోగ్య సహకారాలు అందించవచ్చు. ఇది రోగుల సంరక్షణ అవసరాన్ని పూరించడమే కాకుండా యువతులలో స్వావలంబన పెంపొందిస్తుంది.

ఈ కోర్స్‌ గురించి అడిగినప్పుడు స్వప్న అనే విద్యార్థిని మాట్లాడుతూ, తాను డాక్టర్‌ అవుదామని అనుకున్నానని.. కానీ పేదరికం కారణంగా ఆ కల నెలవేరలేదని, ఇప్పుడు ఈ కోర్స్‌ ద్వారా వైద్య రంగంలో ప్రవేశించే అవకాశం వచ్చిందని,  డాక్టర్ల మధ్యలోనే ఉంటూ పని చేస్తున్నానని చెప్పింది. ఇందులో ఇంకా అడ్వాన్స్డ్‌ కోర్స్‌ చెయ్యడానికి వీలవుతుందని అన్నారు. దీపిక అనే మరో విద్యార్థిని మాట్లాడుతూ, 10వ తరగతి చదువుకున్నానని, తరువాత పొలం పనులు చేసుకోవాలేమో అనుకునేదాన్నని, కానీ  స్నేహితులు చెప్పడంవలన ఈ GDA కోర్స్‌లో చేరానని చెప్పింది. ఇప్పుడు  ఒక హాస్పిటల్‌లో OP స్టాఫ్‌గా పనిచేస్తున్నానని   తెలిపింది. నిర్మల్‌ జిల్లా నుండి సంధ్యారాణి మాట్లాడుతూ తమది చాలా పేదకుటుంబమని, ఇంటర్మీడియట్‌ తరువాత ఇక చదువుకొనే అవకాశంలేదనుకున్నానని, కానీ ఈ కోర్స్‌ ద్వారా నా కాళ్ళ మీద నేను నిలబడగలుగుతున్నాను అని అన్నారు. ఇండో బ్రిటిష్‌ హాస్పిటల్‌కి చెందిన ఒక డాక్టర్‌ మాట్లాడుతూ సేవాభారతి GDAలో శిక్షణ తీసుకున్న ఒక విద్యార్థిని ఇప్పుడు మొత్తం ఆపరేషన్‌ థియేటర్‌ స్టెరిలైజషన్‌ చెయ్యడంలో చాలా ప్రావీణ్యం సంపాదించిందని, అది చూసి తానే ఆశ్చర్యపోయానని అన్నారు. స్పర్శ్‌ సంస్థ  ప్రతినిధి మాట్లాడుతూ నర్సింగ్‌ అసిస్టెంట్‌ రంగంలో విలువలతో కూడిన శిక్షణ ఇస్తూ ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న సేవాభారతికి ప్రత్యేక కృతజ్ఞతలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *