వ్యవసాయంలో స్థిరత్వం రావాలంటే సేంద్రీయ వ్యవసాయమే మార్గం : పీవీ రావు
వ్యవసాయ ఉత్పాదకత పెరగడానికి, సుస్థిరత కోసం సేంద్రీయ వ్యవసాయం విషయంలో రైతులు, ప్రజలు పునరాలోచించుకోవాల్సిన సందర్భం వచ్చిందని ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ చైర్మన్ పీవీ రావు అభిప్రాయపడ్డారు. వ్యవసాయ ఉత్పాదకత పెరగడానికి, వ్యవసాయంలో స్థిరత్వం రావడానికి, రైతులు సేంద్రయ వ్యవసాయ పద్ధతులను అవలంబించాల్సిన అవశ్యకత ఏర్పడిందన్నారు. ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేంద్రీయ వ్యవసాయం ప్రాముఖ్యతపై హైదరాబాద్ కేశవ మెమోరియల్ లో సెమినార్ జరిగింది. ఈ సందర్భంగా ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ చైర్మన్ పీవీ రావు మాట్లాడుతూ… సేంద్రీయ వ్యవసాయ ద్వారా స్థానిక వనరులు పెరగడం, ఆరోగ్యకరమైన నేలలు, జీవవైవిధ్యం, మెరుగైన జీవనోపాధి రైతులకు వస్తుందన్నారు. ఇవన్నీ రావడానికి సేంద్రీయ వ్యవసాయమే పరిష్కారమని స్పష్టం చేశారు.
వ్యవసాయ రంగంలో నాణ్యత, స్థిరత్వంపైనే దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. దశాబ్దాలుగా రసాయనాల ద్వారా వ్యవసాయం చాలా నష్టపోయిందని, కానీ… ఇప్పుడు దేశంలో తిరిగి సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులు మళ్లుతున్నారని, కీలకమైన పునరుజ్జీవాన్ని భారత్ లో చూస్తున్నామని తెలిపారు. 1960 హరిత విప్లవం త్వరాత అధిక దిగుబడినిచ్చే పంటలు, సింథటిక్ ఎరువులు, పురుగు మందులను ఉపయోగించి,అధిక ఉత్పత్తిని సాధించామని, అయితే… ఈ లాభాలు అనేవి అధిక వ్యయాన్ని ఖర్చు చేయడం ద్వారా వచ్చాయన్నారు. ప్రస్తుత నేల క్షీణత, జీవవైవిధ్యంతో ఆరోగ్య సమస్యలు కూడా బాగా పెరుగుతున్నాయన్నారు.
ప్రస్తుతం రైతులు వ్యవసాయ రంగంలో స్థిరత్వం అన్న దానిని పక్కనపెట్టి, దిగుబడికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన అన్నారు. అలాగే రసాయనాల మీద బాగా ఆధారపడుతున్నారన్నారు. దీంతో నేలలోని పోషకాలు క్షీణించిపోయి, ఇబ్బందులు వస్తున్నాయన్నారు. భూమిలో పోషకాలు రానూ రానూ తగ్గుతున్నాయని, కానీ ఉత్పాదకత మాత్రం పెరుగుతోందన్నారు. రసాయనాలు బాగా వాడటం వల్లనే ఈ ఉత్పాదకత పెరుగుతోందన్నారు. 20 వ శతాబ్దం వరకూ భూమిపై వుండే పోషకాలు తగ్గిపోతున్నాయని, దీనిని ఎవ్వరూ నిరాకరించలేరన్నారు.
కొన్ని దశాబ్దాలుగా వ్యవసాయ భూములు రసాయనాలకు బాగా అలవాటుపడ్డాయని, దీంతో నేలలో పోషకాల క్షీణత వచ్చేసిందని ఆయన విశ్లేషించారు. అంతేకాకుండా వ్యవసాయ రంగంలో పోషకాల క్షీణత, జీవవైవిధ్యం కోల్పోవడం, తెగుళ్లకు ఎక్కువ ఆస్కారం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. ఈ పరిణామం నేలపై మాత్రమే ప్రభావం చూపలేదని, నీటి కాలుష్యం కూడా జరిగిందన్నారు. అలాగే ఆహార సరఫరా గొలుసులో రసాయన అవశేషాలకు కూడా దారి తీసిందన్నారు. వీటన్నింటినీ నిర్మూలించాలంటే అంతర్జాతీయ సేంద్రీయ వ్యవసాయ ఉద్యమాల సమాఖ్య చూపించిన సేంద్రీయ వ్యవసాయం చేయాల్సిన అవసరముందని నొక్కిచెప్పారు.
సేంద్రీయ వ్యవసాయం ద్వారా లాభాలున్నా…. ప్రస్తుతం అది అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని తెలిపారు. మామూలు వ్యవసాయం నుంచి సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లేందుకు అయ్యే ఖర్చు, సంక్లిష్టమైన ధ్రువీకరణ ప్రక్రియలు, పరిమిత మౌలిక సదుపాయాలు వుండటం లాంటివి ఆయన ప్రస్తావించారు. వీటన్నింటినీ దాటాలంటే ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల నుంచి చాలా మద్దతు కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. సేంద్రీయ వ్యవసాయాన్ని రైతులు ఓ ఖర్చులా చూడొద్దని, దీర్ఘకాలిక భూసారం, పర్యావరణ సమతౌల్య, ఆహార నాణ్యత కోణంలో చూడాలన్నారు. సేంద్రీయ వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహించాలని, సంప్రదాయిక వ్యవసాయ పద్ధతులతో రైతులను అనుసంధాలించాలని తెలిపారు. మనదైన వ్యవసాయ మూలాలతో రైతులు తిరిగి అనుసంధానించబడాలని, ఆ మూలాలను తిరిగి పునర్నిర్మించుకోవాలని తెలిపారు. ఇవన్నీ కావడానికి ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ మెదక్ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని, సేంద్రీయ వ్యవసాయం, సాంకేతికతలను వ్యాప్తి చేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. వ్యవసాయ క్షేత్రంలో స్థిరమైన సాంకేతికతను పరీక్షించడానికి చురుగ్గా ప్రోత్సహిస్తోందని, రైతులకు సాంకేతిక మార్గనిర్దేశనం చేస్తోందని పేర్కొన్నారు.
దేశంలో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, స్థిరమైన పద్ధతులను పెంపొందించడానికి, సింథటిక్ ఇన్ పుట్స్ పై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో భారత ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. 2015 లో ప్రవేశపెట్టిన సాయిల్ హెల్త్ కార్డ్ పథకం నేల నాణ్యతను అంచనా వేస్తుందని, అలాగే సమతౌల్య ఎరువుల వాడకాన్ని కూడా ప్రోత్సహిస్తుందని వివరించారు. నేల ఆరోగ్యాన్ని, పోషకాలను తిరిగి ప్రోత్సహించడం ద్వారా సేంద్రీయ వ్యవసాయానికి పరోక్షంగా అందరూ మద్దతిచ్చినట్లేనని అన్నారు.