విజయవాడ మహా నగరంలో సహాయ కార్యక్రమాలు చేపట్టిన సేవా భారతి, ఆరెస్సెస్ కార్యకర్తలు
వర్షాల వల్ల పోటెత్తిన వరదలో విలవిలలాడుతున్న విజయవాడ వాసుల ఆకలి తీర్చుతూ ఆర్ఎస్ఎస్ సేవాభారతి స్వయంసేవకులు పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపట్టారు. విస్తారంగా పడిన వర్షాల వలన బుడమేరు వాగు తెగి విజయవాడ మహానగరంలోని అయోధ్య నగర్, సింగ్ నగర్, భవానిపురం, కృష్ణలంక, మహానాడుకట్ట పరిసర ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో ఉండిపోయాయి. అక్కడి ప్రజల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తక్షణ సహాయార్థం ఎన్‌డిఆర్ఎఫ్ టీంతో కలసి సేవాభారతి కార్యకర్తలు వరద బాధితులకు భోజన పొట్లాలు, మంచినీటి సీసాలను వితరణ చేశారు. సుమారు 100 మంది మహిళలు, 40 మంది విద్యార్థులు, 75 మంది పురుషులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విజయవాడలోని సింగ్ నగర్‌లో 4,500 ప్యాకెట్లు, 3,500 తాగునీటి సీసాలు, అయోధ్య నగర్‌లో 2200 భోజన పొట్లాలు, 1,800 తాగునీటి సీసాలు, మహానాడు కట్టలో 800 భోజన ప్యాకెట్లు, వన్ టౌన్ ఏరియాలో 1200 భోజన పొట్లాలు, 700 తాగునీటి సీసాలు, తాగునీటి ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. వరదల్లో చిక్కుకుని ఉన్నవారిని బయటకు తీసుకొచ్చే పనులు కూడా నిర్వహించారు.
సేవాభారతి కార్యకర్తలు ఇటీవల కేరళలోని వయనాడ్ వద్ద కొండచరియలు కూలినప్పుడు కూడా అక్కడి బాధితులకు పెద్ద ఎత్తున సేవలందించి ప్రశంసలు అందుకున్నారు. ఆ సమయంలో ఇద్దరూ కార్యకర్తలు ప్రాణాలకు తెగించి మరీ సేవలందించి అమరులయ్యారు. మొన్నటికి మొన్న కేరళ వయనాడ్ కొండ చరియలు విరిగి, బీభత్సమైన సమయంలోనూ సేవా భారతి, ఆరెస్సెస్ కార్యకర్తలు అక్కడి బాధితుల పక్షాన నిలుచున్నారు. వారి అవసరాలను తీర్చారు. సేవా భారతి, ఆరెస్సెస్ కార్యకర్తలు నిష్ఠతో చేస్తున్నపనులను చూసి, అక్కడి చర్చి పాస్టర్లు కూడా మెచ్చుకున్న విషయం తెలిసిందే.