హిందూ ఆధ్యాత్మిక – సేవా సంస్థ ఆధ్వర్యంలో ”సేవామేళా 2024”

హిందూ ఆధ్యాత్మిక మరియు సేవా సంస్థ (H.S.S.F) ఆధ్వర్యంలో సేవా మేళా 2024ను నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. నవంబర్ 7 నుంచి 10 తేదీ వరకూ హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ మేళా జరగనుంది.
ఈ వేడుకల్లో భాగంగా నవంబర్ 7వ తేదీ సాయంత్రం మేళా ఉద్ఘాటన వుంటుందని సంస్థ పేర్కొంది. ఇక.. మరుసటి రోజు (నవంబర్ 8వ తేదీ) ఉదయం కన్యావందన్, మధ్యాహ్నం ప్రకృతి వందన్, సాయంత్రం మహిళా సమ్మాన్ నిర్వహించనున్నారు. నవంబర్ 9వ తేదీన ఉదయం ఆచార్య వందన్, మధ్యాహ్నం విద్యాలయ అధిపతుల సమావేశం, సాయంత్రం గురు సమ్మాన్ వుంటుంది. ఇక… చివరి రోజు (నవంబర్ 10వ తేదీ)న ఉదయం మాతాపితృ వందన్, మధ్యాహ్నం మానవీయం, సాయంత్రం పరమ్ వీరచక్ర వందన్ నిర్వహించనున్నారు. అలాగే ఈ మూడు రోజులూ సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని సంస్థ ప్రకటించింది.
ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ..హిందూ జీవన పద్ధతి ద్వారా మాత్రమే వర్తమాన భౌతిక సమస్యలకు పరిష్కారం దొరకుతుందన్నారు. ఇప్పుడు తిరిగి హిందూ మూలాలలోకి వెళ్లాలని, అప్పుడే సభ్యత సమాజాన్ని, కుటుంబ వ్యవస్థల నిర్మాణం జరుగుతుందన్నారు. అందుకే ఈ మేళా లాంటి కార్యక్రమాలను తమ సంస్థ తరపున నిర్వహిస్తున్నామని ప్రకటించారు. ఉద్యమాలు, గోష్టులు, మేళాలు లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజాన్ని జాగృతం చేస్తున్నామని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం 9849315238 నెంబరులో సంప్రదించవచ్చని చంద్రశేఖర్ తెలిపారు.
H.S.S.F స్థాపన చెన్నై కేంద్రంగా 2009లో జరిగింది. హిందూ సమాజం మరియు మఠ, మందిరాల ద్వారా జరుగుతున్న సేవాకార్యాల ద్వారా సమాజాన్ని కలపడం ఈ సంస్థ చేస్తుంది. అలాగే హిందూ జీవన పద్ధతి అయిన ప్రకృతి, కుటుంబం, దేశం పట్ల భక్తి , గౌరవాలు పెంచే కార్యక్రమాలు చేస్తుంది. వీటి ద్వారా సమాజంలో కర్తృత్వ భావనను పెంపొందిస్తుంది. కర్తవ్య భావాన్ని పటిష్టం చేయడం ద్వారా నిత్య జీవితంలో సంస్కారయుత జీవనం కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం సంస్థ ఆరు లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంది.
అడవులు వన్యప్రాణుల రక్షణ,పర్యావరణ సంరక్షణ, కుటుంబ, మానవ విలువల సంవర్ధనం, నారీ సమ్మాన్, దేశభక్తి బీజాలను నాటడం, వాతావరణ సంతులనం అన్న వాటి ద్వారా సమాజంలో ప్రయత్నాలు చేస్తోంది.అలాగే అలాగే ఈశావాస్యమిదం సర్వం (కణకణంలో ఈశ్వరుడున్నాడు) అని, అలాగే ఆత్మ మోక్షార్థం జగత్ హితాయచ (మానవ సేవ ద్వారా మోక్ష ప్రాప్తి) అన్న వేదాంత వాక్యాల ఆధారంగా సమాజంలో పనిచేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *