‘మానవ కల్యాణానికి సేవ ఉత్తమ మార్గం’ – డాక్టర్ మోహన్ భాగవత్
రాష్ట్రీయ సేవాసంగమ్ – 2023
రాష్ట్రీయ సేవా సంగమ్ జాతీయ సదస్సు రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని కేశవ విద్యాపీఠ్ ప్రాంగణంలో ఏప్రిల్ 7,8,9 తేదీలలో ఘనంగా జరిగింది. ఆర్‌ఎస్‌ఎస్ పూజనీయ సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ ముఖ్య అతిథిగా హజరై సదస్సును ప్రారంభించారు.
‘సేవ’ మాధ్యమం ద్వారా ‘వసుధైవ కుటుంబకం’ అనే కలను సాకారం చేసుకోవచ్చునని, అయితే దీనికోసం కార్యకర్తలు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు సమాజ వ్యాప్తి కావాలని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ పూజనీయ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు. జంతువు లకు, మానవులకూ కూడా ‘సంవేదన’ ఉంటుందని, ఆ ‘సంవేదన’.. కృత్.. కారుణ్యం.. సేవ.. సమరసతగా మారినప్పుడే సమాజానికి ఉపయు క్తంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో హిందూ ఆధ్యాత్మిక సంస్థలు, క్రైస్తవ మిషనరీల కన్నా ఎన్నో రెట్లు ముందుంటున్నాయని ఆయన స్పష్టం చేశారు. ‘మిషనరీ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఆసుపత్రులు, విద్యాసంస్థలు నిర్వహిస్తున్నాయి. అయితే హిందూ ధార్మిక సంస్థలు నిస్వార్థంగా, ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా నిర్వహించటం అభినందనీ యం. సేవ ద్వారా ఆరోగ్య కరమైన మనుషులను, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చు’ అని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలను పరిష్కరించి ప్రపంచాన్ని భావాత్మకంగా ఏకం చేయడానికి సేవామార్గం అత్యుత్తమమైనదని అన్నారు. సజ్జనశక్తిని జాగృతం చేయడం ద్వారా సమాజ కల్యాణానికి కృషి చేయాలని ఆయన సూచించారు. ‘‘నా దగ్గర ఏది ఉందో అది అందరిది.. అందరూ నా వారే’’ అనే భావన ఉన్నప్పుడు ఇతరులను ఆదుకోవడం సులభ సాధ్యమవు తుందని ఆయన అన్నారు. ఆర్.ఎస్.ఎస్ ప్రారంభం నుంచి సంఘ స్వయంసేవకులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, సంఘ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ ఆర్.ఎస్.ఎస్. ప్రారంభానికి ముందు నుంచే సమాజంలో జరిగే అనేక సేవా కార్యక్రమాలలో భాగస్వాము లయ్యేవారని గుర్తు చేశారు.
ఈ సారి సంగమ్ సదస్సుకు 2700 మంది స్వచ్ఛంద సేవకులు హాజరయ్యారు. వారంతా చేపట్టి నిర్వహిస్తున్న 43,000 సేవా కార్యక్రమాల గురించి అక్కడ సమీక్ష జరిగింది. మరిన్ని సేవా పథకాలు చేపట్టే అవకాశాల గురించి చర్చించారు.
అటు అరుణాచల్‌ప్రదేశ్ నుంచి ఇటు గుజరాత్ వరకు, జమ్ము-కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రతినిధులు సేవా సంగమ్‌లో పాల్గొనడం విశేషం. సేవాభారతి ఆధ్వర్యంలో నడుస్తున్న 698 సంస్థల నుంచి మొత్తం 460 మంది మహిళలతో సహా 2408 మంది ప్రతి నిధులు ప్రాతినిధ్యం వహించారు. ఆరోగ్య భారతి, రాష్ట్ర సేవికాసమితి, సక్షమ్, విద్యాభారతి, విశ్వ హిందూపరిషత్, సేవా ఇంటర్నేషనల్, వనవాసి కల్యాణ్ పరిషత్, భారత్ వికాసపరిషత్ వంటి పది హేను సంస్థల ప్రతినిధులు కూడా సేవా సంగమ్‌లో భాగ స్వాము లయ్యారు. కేరళ ప్రాంతం నుంచి అత్యధికంగా 198 మంది ప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి 96 మంది, ఆంధప్రదేశ్ నుంచి 57మంది కార్యకర్తలు ఈ భవ్యమైన శిబరంలో పాల్గొన్నారు. దేశంలోని విభిన్న ప్రాంతాల సంస్కృతులు, భాషలు కలగలిపిన ‘సేవాసంగమ్’ అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించింది.
రాష్ట్రీయ సేవాభారతి కార్యకర్తలు దేశ వ్యాప్తంగా 16,184 విద్యా కేంద్రాలు, 10,513 ఆరోగ్యపరీక్ష, చికిత్సా కేంద్రాలు, 9,543 సామాజిక కేంద్రాలు, 6,805 ఉపాధి కేంద్రాలు నిర్వహిస్తున్నారు.
పసిపిల్లలకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో కొంకణ్ ప్రాంతంలో మాత శిశుసంరక్షణ కేంద్రాలు నడుపుతున్నారు. హైదరాబాద్‌లోని వైదేహీ ఆశ్రమంలో అనాథ బాలికలకు విద్య, ఉపాధి కల్పనతోపాటు వివాహాలు కూడా చేయడం విశేషం. కిశోరీ వికాస్ కేంద్రం కార్యకర్తలు ప్రతివారం సేవాబస్తీలలో బాలసంస్కార కేంద్రాలు నడుపు తున్నారు. ప్రతి ఏటా ‘రన్ ఫర్ ఛైల్డ్’ నిర్వహించడం ద్వారా సమాజంలో చైతన్యం తీసుకువస్తున్నారు.
మాల్వా ప్రాంతంలో గిరిజనులకు ఉపాధి కల్పించడానికి వివిధ వృత్తులలో నైపుణ్య శిక్షణ ఇచ్చి వారు ఉపాధి పొందే విధంగా కృషిచేస్తు న్నారు. జమ్ముకశ్మీర్ ప్రాంతంలో సేవాభారతి కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి పిల్లలకు అవసరమైన ఆరోగ్య టీకాలు వేయిస్తున్నారు. ఈ సంవత్సరం రెండు విడతలుగా చేపట్టిన టీకా కార్యక్రమంలో సుమారు లక్షా 50 వేల మందికి టీకాలు వేశారు. అహ్మదాబాద్‌లోని స్టూడెంట్స్ ఫర్ సేవ సంస్థ యువతరంలో చైతన్యం కలిగించి, వారిని వివిధ సేవా కార్యక్ర మాల్లో భాగస్వాములను చేస్తోంది. ముంబయిలోని సమతోల్ ఫౌండేషన్ అనాథ, వీధి బాలలను గుర్తించి వారికి విద్య, వైద్య సేవలు అందిస్తోంది. బాల సంస్కార కేంద్రాల ద్వారా సంస్కారాలు అందించే కార్యక్రమం చేపట్టింది.
మంగుళూర్‌లో చేతనా చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్- బాలల మానసిక, విద్య వికాసం కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేరళలో కొవిడ్ మహమ్మారితో మృతి చెందినవారి దహన సంస్కారాల కోసం మొబైల్ దహన వాటిక ఏర్పాటు చేశారు.
ఇలా దేశంలోని అన్ని ప్రాంతాలలో స్థానిక అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాలకు అవసరమైన నిధులను సమాజంలోని దాతల నుంచే విరాళాలుగా సేకరించడం విశేషం.