సిరిసిల్లలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు
సామాజిక సమరసత వేదిక రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో వీర్నపల్లి మండలంలోని అన్ని గ్రామాల, తండాల ప్రజలచే జగదాంబ దేవాలయం (స్థూపం దగ్గర) రంగంపేట గ్రామంలో సంత్ సేవాలాల్ జయంతి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో కన్నుల పండువగా నిర్వహించారు. సంత్ సేవలాల్ శోభా యాత్ర గ్రామ వీధుల గుండా గిరిజన ప్రజల సంసృతి సంప్రదాయాలు, నృత్యాలతో శోబాయమానంగా జరిగింది. జగన్మాత ఆలయంలో గిరిజన పూజారులచే అత్యంత భక్తి శ్రద్ధలతో విశిష్టంగా నిర్వహించే భోగ్ భండార్ నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సామాజిక సమరసత వేదిక తెలంగాణ ప్రాంత కన్వీనర్ శ్రీ అప్పాల ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మహ్మద్ ఘోరీ మన దేశం పై దాడి చేసి, మన తల్లుల, చెల్లెల చెరపట్టి, దేవాలయాలు ధ్వంసం చేసినప్పుడు, గోవులను వధించి, బలవంతంగా మతమార్పిడి జరుపుతున్నప్పుడు, ఘోరీ ని ఎదిరించి17 సార్లు ఓడిరచిన సాహస వీరుడు పృథ్వీరాజ్ చౌహన్ వంశానికి చెందిన వారు బంజారాలు ( లంబాడి ) అని అన్నారు. మొఘలుల రాక్షసత్వానికి బలైన కొందరైతే, మరికొందరు చెట్టు గుట్టల్లో చెల్లా చెదురై, తమ సంస్కృతిని కాపాడుకున్న వారు బంజారాలు అని పేర్కొన్నారు. బంజారా వంశంలో మళ్ళీ ధైర్యం, సాహసం కలిగించి, ఆధ్యాత్మిక కిరణాలు ప్రసరింప చేయడానికి జన్మించిన మహనీయుడు సంత్ సేవాలాల్ అని అన్నారు. 1739లో రాయలు ఏలిన రాయల సీమలో గుత్తి లో అవతరించిన వర ప్రసాదం సేవాలాల్ అని కొనియాడారు. సప్త మాతృకలైన తుల్జా భవాని, మంత్రాల భవాని, సీతలా భవాని, హింగలా మాత, కంకాళి భవాని దోలాంగల్ భవాని, దండి భవాని, మేరా మా ఆశీస్సులతో దివ్య తేజమై వెలిగిన శక్తి పుంజం సంత్ సేవాలాల్ అని తెలిపారు. ఏక్ జాత్, ఏక్ వాత్, ఏక్ సాత్ అనే ఆలోచన తో ప్రజలను కలిపిన సంఘటనా శీలి సేవాలాల్ అని పేర్కొన్నారు. విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి సాధించాలని, పూర్వీజులు అందించిన విలువలు, సంప్రదాయం మరిచిపోవద్దని చాటిన మహాత్ముడు సేవాలాల్ అని తెలిపారు.
రాయచూరు మీదుగా హైదరాబాద్ చేరుకున్నప్పుడు,నిజాం నవాబు ఆహారం లో విషం పెట్టి, సేవాలాల్ చంపాలని ప్రయత్నం చేస్తే, తన మహిమ తో విషాన్ని పోగొట్టి, అమృత ఆహారంగా మార్చి, నిజాం నుండి గోవులను రక్షించిన మహిమాన్వితుడన్నారు. తిరుపతిలో హతీరామ్ బాబా భక్తిని కొనియాడి, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని,భక్తి మార్గంలో నడవాలని ప్రజలకు బోధించాడని తెలిపారు. ఆధ్యాత్మిక చైతన్యం, విద్యను ఆర్జించి, నాగరికతతో జీవించటం, ఇతర మతాల్లోకి చేరకుండా, తన ధర్మాన్ని కాపాడుకోవటం అనే సూత్రాలతో ఉద్యమించిన సంత్ సేవాలాల్ అందరికి మార్గ దర్శకుడని అప్పాల ప్రసాద్ అన్నారు.