హిందుత్వాన్ని ఆచరణలోకి తెచ్చే పనిని సమితి చేస్తోంది : శ్రీపాద రాధ
రాష్ట్ర సేవికాసమితి తెలంగాణ ప్రాంతం ఆధ్వర్యంలో 15 రోజులపాటు (May 2nd – May 16th) నిర్వహించబడిన శిక్షావర్గ సార్వజనికోత్సవం స్థానిక ఎస్పీఆర్(SPR, Kamareddy) పాఠశాలలో వైభవోపేతంగా జరిగినది. ఈ కార్యక్రమానికి సాంఘిక సంక్షేమ శాఖ ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ బంధువుల వనిత అధ్యక్షులుగా విచ్చేసి శిక్షార్ధులు 15 రోజులు పాటు నేర్చుకుని ప్రదర్శించిన శారీరక అంశాలను, ప్రదర్శనను ప్రశంసించారు. నేటి సమాజంలో ప్రతి మహిళకు ఈ ప్రశిక్షణ అవసరమని ప్రతి స్త్రీ తనను తాను రక్షించుకుంటూ సమాజ పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు.
ముఖ్య వక్త గా విచ్చేసిన మాననీయ శ్రీపాద రాధ ప్రసంగిస్తూ నేడు సమాజంలో భౌతిక హిందుత్వం వ్యాపించి యున్నది దీనిని ఆచరణలోనికి తీసుకుని వచ్చే పని సమితి చేస్తుందని పేర్కొన్నారు. కార్యకర్తలు స్థిరంగా నిత్య నిరంతర సాధన చేయాలి, సమస్యలకు బెదరక, వైఫల్యాలకు కృంగిపోక, ప్రశంసలకు పొంగకుండా ముందుకు సాగాలి. మాతృ శక్తిని జాగృతం చేసి వారిలో అష్టాబుజా దేవి తత్వాన్ని హృదయంలో అధిష్టింప చేసి ఆచరణలో అనుష్టింప చేయాలి. శుద్ధ సాత్విక ప్రేమ సమితి తత్వం ఈ ప్రేమ పరిధిని పెంచుకొని దురాచార దుర్వృత్తి విధ్వంసం చేసే శక్తిని పెంచుకోవాలి అన్నారు.

జైశ్రీరామ్, వందేమాతరం అను రెండు మంత్రాల ద్వారా ప్రతి వ్యక్తిలో చైతన్యమును నింపి తేజస్వి హిందూ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రాంత కార్యవాక పాలగుమ్మి భాస్కర లక్ష్మీ గారు, ప్రాంత సంపర్క ప్రముఖ సింధు దీదీతోపాటు పలువురు ప్రాంత అధికారులు, విభాగ, జిల్లా, నగర కార్యకర్తలు పలువురు సంఘ బంధువులు శిక్షార్దుల తల్లిదండ్రులతో పాటు 150 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.