కరోనా బాధితులకు అండగా నిలచిన మహిళలు
పని చేస్తే గాని పొట్ట గడవని చాలా మంది కార్మికుల ఇండ్లల్లో కరోనా వల్ల అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఆ ఇళ్లల్లోని మహిళలకు నెలసరి అదనపు సమస్యగా మారింది. బయటికి చెప్పుకోలేని ఈ సమస్యలతో చాలామంది మహిళలు కుంగిపోయారు. ఈ సమస్యను గుర్తించిన ఆగ్రా సేవా భారతి సభ్యురాలైన డాక్టర్ రేణుక ఉత్సవ్ మహిళలకు సాయం చేయడానికి సిద్ధమయ్యారు. సానిటరీ నాప్‌కిన్ లు అందజేశారు. సుమారు 127 మారుమూల గ్రామాల్లోని దాదాపు 20,000 పైగా మహిళలకి సానిటరీ నాప్‌కిన్లు అందజేసి వారికి ఆరోగ్యపరమైన అవగాహన కల్పించారు.
సోలాపూర్‌లో ఒక సంస్థ పేదలకోసం ఏర్పాటు చేసిన అన్న వితరణ కేంద్రం నుంచి మంగీలాల్ అనే ఒక యాచకుడు కూడా భోజనాన్ని రోజూ తీసుకునే వాడు. లాక్‌డౌన్ సమయంలో అతను ఒక ప్లేట్‌కు బదులుగా రెండు ప్లేట్ల భోజనాన్ని తీసుకుంటున్నట్టు చంద్రిక తారు గమనించారు. మంగీలాల్ తన ఆహారాన్ని వీధిలో ఉన్న మరికొందరికీ పంచడానికి చూసి ఆమె ఆశ్చర్య పోయారు. రాష్ట్రీయ సేవా భారతి బోర్డు సంయుక్త కార్యదర్శి కూడా అయిన ఆమె అప్పటి నుంచి ఎంతోమంది నిస్సహాయులకు, వృద్ధులకు సేవాభారతి ఆధ్వర్యంలో భోజనాన్ని అందించే పని చేపట్టారు.
యువతులే కాదు… 82 ఏళ్ల హరిదిని జోషి, 80 ఏళ్ల ప్రకాష్ ఖానుజా కూడా తమ వంతు సాయంగా మాస్కులు కుట్టి భోపాల్‌లోని వివిధ సేవా బస్తీల్లో పంపిణీ చేస్తున్నట్టు సేవా భారతి జాతీయ ఉపాధ్యక్షురాలు అమితా జైన్ తెలిపారు.
లాక్‌డౌన్ నిజంగా కష్టకాలం.. కరోనా పాజిటివ్ వచ్చిన వారు ఒంటరిగా ఉంటూ మానసికంగా దిగులు చెందారు. అలాంటి వారి కోసం “సేవాభారతి దూరబాషా అభియాన్’’ పేరుతో హెల్ప్ లైన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. భూపాల్ నగరానికి చెందిన సేవాభారతీ సభ్యురాలు సన్యోజిక, అభా పాండేతో పాటు మరికొంత మంది మహిళలు కలిసి ఈ హెల్ప్ డెస్క్ ను నడిపించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు ఫోన్‌చేసి ఆప్యాయంగా మాట్లాడుతూ వారికి మానసికంగా మనోధైర్యాన్ని కల్పించారు. వారి ఫోన్లకు రీఛార్జ్ చేయడం, అవసరమైన మందులు పంపిణీ చేయడంతో పాటు వారికి సలహాలు సూచనలు ఇచ్చారు.
హైదరాబాద్ సేవా భారతి సంయుక్త కార్యదర్శి జయప్రద కూడా 50 మంది బాలికలు, మహిళలతో కలిసి ఒక హెల్ప్ డెస్క్ నిర్వహించారు. ఈ హెల్ప్ డెస్క్ ద్వారా కొవిద్ లక్షణాలున్న వారికి వైద్యుల సహకారంతో సలహా సూచనలు ఇచ్చారు. గర్భిణులను క్షేమంగా ఆస్పత్రికి తీసుకెళ్లడంలో వీరు సహాయ పడ్డారు. కరోనా పాజిటివ్ ఉన్న వారికి మెడికల్ కిట్లను కూడా పంపుతున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని నాగ్రౌటాలో లాక్‌డౌన్ సమయంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న కాశ్మీరీ మహిళలకు సేవాభారతి సభ్యురాలు అంజలి మాస్కులు, పిపిఈ కిట్లు, ఇతర దుస్తులు తయారుచేసేపని అప్పగించి ఉపాధి కల్పించారు.
సేవాభారతి మాతృమండలి, కన్వీనర్, సునీతా తారు ఆధ్వర్యంలో ‘అన్నపూర్ణ స్వయం సహాయత’ అనే సమూహాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో మహిళలు ఆహారాన్ని నిత్యావసర వస్తువులు, పోషక పదార్థాలను ప్యాకింగ్‌లు చేసి విక్రయించారు. దీనివల్ల వారికి ఉపాధి చూపడంతోపాటు అనేకమందికి ఆహారం అందించగలిగారు.
ఇలా సేవాభారతి ఆధ్వర్యంలో మహిళలు చేసిన ఈ సేవాకార్యక్రమాలు అనేకమందిలో స్ఫూర్తిని నింపాయి. మహిళలు ఎంతటి మహమ్మారినైనా తమ శక్తితో, ధైర్యంతో, ప్రేమతో ఎదుర్కొనగలరని నిరూపించారు.