నిస్వార్ధ సేవలోనే భగవంతుడున్నాడు
ఒకసారి స్వామి వివేకానంద దగ్గరకు ఒక భక్తుడు వచ్చి ‘స్వామీజీ, భగవంతుని దర్శనం కోసం నేను నిత్యం ధ్యానం చేస్తున్నాను. నా గది కిటికీలు, తలుపులు వేసుకుని ఏకాగ్రంగా ధ్యానం చేస్తున్నాను. నాకు ఎప్పటికీ దైవదర్శనం అవుతుంది’ అని అడిగాడు. అందుకు స్వామి వివేకానంద ‘దేవుడిని చూడాలనుకుంటే కేవలం ధ్యానం మాత్రమే సరిపోదు. బయటకు వచ్చి మొక్కలను, పూసిన పూలను, కాచిన పండ్లను చూడు. వాటిలో దేవుడు కనిపిస్తాడు. పక్షుల పాటలు విను. అక్కడా దేవుడున్నాడు.
దేవుడిని ఇంకా బాగా చూడాలనుకుంటే పేదలు, అసహాయులకు సేవ చెయ్యి, సహాయం అందించు. వాళ్ళు చూపే కృతజ్ఞతలో దేవుడు కనిపిస్తాడు. చదువులేనివాళ్ళకు చదువు చెప్పు. ఇవన్నీ నిస్వార్ధంగా, ఏది ఆశించకుండా చెయ్యి. అప్పుడు నీకు కలిగే ఆత్మ సంతృప్తిలో, ఆనందంలో దేవుడు తప్పక కనిపిస్తాడు’ అని బోధించారు.