HCU లో విద్యార్థులపై దాడికి దిగిన SFI

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సాధారణ విద్యార్థులపై సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘం SFI దాడికి దిగింది. భారతీయ సంస్కృతిని, గోమాతను అవమానించేలా SFI ఓ నాటక ప్రదర్శనను నిర్వహించింది. దీంతో కొంత మంది విద్యార్థులు తమ మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొంటూ, శాంతియుతంగానే అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా సరే SFI నేతలు విద్యార్థులపై దాడికి దిగారు. ఈ దాడిలో వారికి చాలా దెబ్బలు తాకాయి. వారు శాంతియుతంగా నిరసనకు దిగిన సమయంలో, చర్చలు చేయకుండా, ఏకంగా తమ సహజ లక్షణమైన ధోరణిలో దాడికి దిగారు. శారీరిక దాడులకు దిగడమే కాకుండా, బెదిరింపులకు కూడా దిగినట్లు విద్యార్థులు పేర్కొంటున్నారు.

మరో వైపు విద్యార్థులపై జరిగిన దాడిని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండించింది. ఇది ప్రజాస్వామ్యంపై దాడే అని అభివర్ణించింది. దాడి చేసిన వారిపై అడ్మినిస్ట్రేషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు చేపట్టాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. బాధిత విద్యార్థులకు ఏబీవీపీ పూర్తిగా అండగా వుంటుందని భరోసానిచ్చింది.

వారు ప్రదర్శించిన నాటకం హిందూ సమాజాన్ని అవమానించేలా వుందని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయం తప్పు అని తెలిసినా.. కొందరు అధ్యాపకుల మద్దతుతో ఎస్ఎఫ్ఐ నాటకాన్ని కొనసాగించిందని ఏబీవీపీ మండిపడింది.తాము అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, ఎలాంటి చర్యలు తీసుకోలేదని, సమాజంలో విభజన భావాలను వ్యాప్తి చేసేందుకు నాటక బృందం మరోసారి దీనిని ప్రదర్శించిందని పేర్కొంది.
నాటకంలో అవమానకరమైన భాషను వాడారని, హిందూ సంస్కృతిని, నాగరికతను అవమానించారని ఏబీవీపీ పేర్కొంది. నాటకంలోని అంశాలను వ్యతిరేకిస్తూ, ABVP కార్యకర్తలు శాంతియుతంగా మరియు ప్రజాస్వామ్యబద్ధంగా సమావేశమయ్యారు. ఈ శాంతియుత నిరసన సమయంలో, SFI మరియు ఇతర వామపక్ష సంఘాలకు చెందిన సభ్యులు ABVP కార్యకర్తలపై దాడి చేసి, వారిని గాయపరిచారని పేర్కొన్నారు.
ఏబీవీపీ యూనిట్ అధ్యక్షుడు ఆయూష్ సింగ్ స్పందిస్తూ.. భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కును ఏబీవీపీ గట్టిగా విశ్వసిస్తుందని, అయితే అటువంటి వ్యక్తీకరణ ఏ సమాజ మనోభావాలను దెబ్బతీయకూడదని లేదా సాంస్కృతిక విలువలను అగౌరవపరచకూడదని అన్నారు. ఇక్కడ విద్యార్థి సమాజం మనోవేదనకు గురైందని, దీనిని తాము ఖండిస్తున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *