మాజీ ప్రధాని షేక్ హసీనా వీసా పొడిగింపు
గత ఏడాది ఆగస్టు నుండి భారతదేశంలో నివసిస్తున్న బాంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వీసాను భారత్ పొడిగించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంచే హసీనాను అప్పగించాలని పెరుగుతున్న డిమాండ్ల మధ్య ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే, భారతదేశానికి నిర్దిష్ట చట్టం లేకపోవడం వల్ల ఆమె వీసా పొడిగింపును ఆశ్రయమిచ్చిన చర్యగా పరిగణించరాదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
“ఆమె బసను సులభతరం చేయడానికి ఇది పూర్తిగా సాంకేతికంగా వీసా పొడిగింపుననే అంశం” అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. హసీనా ఢిల్లీలోని ఒక సురక్షిత గృహంలో గట్టి భద్రతలో నివసిస్తున్నట్లు వర్గాలు ధృవీకరించాయి. హసీనా మరికొంతకాలం భారత్‌లో ఉండేందుకు వీలుగా ఆమె వీసా గడువును కేంద్రం పొడిగించినట్టు సదరు వర్గాలు పేర్కొన్నాయి.
స్థానిక ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ద్వారా వచ్చిన అభ్యర్థనను కేంద్రం పరిశీలించిన తరువాత పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. డిసెంబర్ 23న, నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనుస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం, హసీనాను అప్పగించాలని అధికారికంగా కోరింది. 2024 నిరసనల సమయంలో 500 మందికి పైగా మరణించిన సంఘటనలలో హసీనా ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.