హిందూ పదపాద్‌షాహీ (జూన్ 20)
1674వ సంవత్సరం జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు ‘హిందూ రాజ్యం ఏర్పడదు’ అనే భావన పటాపంచలైంది. ‘డిల్లీశ్వరోవా జగదీశ్వరోవా’ అనే ఆలోచన ముగిసింది. పరిమిత సాధనాలతోనే హిందువు శ్రేష్ఠ, స్వతంత్ర పాలకుడయ్యాడు. హిందువుల పౌరుష పరాక్రమాలు లోకానికి తేటతెల్లమైన ఛత్రపతి శివాజీ పట్టాభిషేకమైన రోజు. అదే హిందూ సామ్రాజ్య దినోత్సవం.
శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో శంబాజీ జిజాబాయి పుర్వా దంపతులకు జన్మించాడు. తల్లి బాల్యంలో శివాజీకి మాతృభూమిపై, ప్రజలపైన ప్రేమ కలిగేట్లు విద్యా బుద్ధులు నేర్పింది. భారత, రామాయణ గాధలు చెప్పి వీరత్వం మొలకింపచేసింది. తన తండ్రి పొందిన పరాజయాలను అధ్యయనం చేసి అనతి కాలంలోనే శివాజీ యుద్ధ తంత్రాలలో నిష్ణాతుడ య్యాడు. హిందూ సామ్రాజ్య స్థాపన యుద్ధం చేసి బీజాపూర్‌కు చెందిన ‘తోరణ’ దుర్గాన్ని స్వాధీనం చేసుకొని పూణే ప్రాంతాన్నంతా తన అధీనంలో ఉంచుకున్నాడు. శివాజీ మెరుపుదాడులు, గెరిల్లా యుద్ధ పద్దతులు తెలుసు కొన్న అఫ్జల్‌ఖాన్ శివాజీ ని అంతమొం దించటానికి ప్రయ త్నించి నపుడు వ్యూహా త్మకంగా తను ధరించిన పులి గోర్లతో అఫ్జల్ ఖాన్ పొట్ట చీల్చి సంహరించాడు. శివాజీ విజయాలతో మొఘల్ పాలకుడు ఔరంగ జేబుకు సైతం శివాజీ అంటే భయం పుట్టింది. ఔరంగజేబు తన మేన మామ ‘షాయిస్తాఖాన్’ ను శివాజీపై దాడికి పంపినా పరాజయంతో వెనుతిరగ వలసి వచ్చింది. 1666లో ఔరంగజేబు కుట్రచేసి శివాజీని ఆగ్రాలో బంధించి నపుడు చాకచక్యంగా తప్పించుకొన్నాడు. 1674 నాటికి శివాజీ లక్ష సైన్యాన్ని, అయుధాలు, అశ్వాలు నావికాదళాన్ని ఏర్పాటు చేశాడు. వ్యక్తి నిర్మాణం ద్వారా సామాన్య వ్యక్తులలో అసాధారణ ప్రతిభను జాగృతం చేసి వారిని కుశలురైన నాయకులుగా తీర్చిదిద్దటం ఎలాగో చత్రపతి శివాజీ చూపిం చాడు. విజయమే మన ఆదర్శం కావాలని శివాజీ జీవితం తెలియ జేస్తుంది.