రైతులకు సేవ చేయడం అంటే ఈశ్వరోపాసన చేసినట్లే : కేంద్ర వ్యవసాయ మంత్రి
వ్యవసాయ రంగానికి సేవ చేయడం, రైతులను ఆదుకుంటూ వారికి సేవ చేయడం అంటే ఈశ్వరోపాసన చేసినట్లేనని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అంటారు. మన దేశంలో వ్యవసాయానికి అంత పూజ్య భావన వుందన్నారు.భారత దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో వ్యవసాయ శాఖ కూడా కీలక పాత్ర పోషిస్తుందని, వ్యవసాయం కూడా అంతే ముఖ్యమన్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నముక లాంటిదని అభివర్ణించారు. ఇప్పటికీ వ్యవసాయ రంగం ద్వారా చాలా మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని, వ్యవసాయ రంగం అంత సమర్థవంతమైందన్నారు. మరోవైపు ఈ నెల 18న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పీఎం కిసాన్ 17 వ విడత నిధులు విడుదల కానున్నాయి. 2 వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.