మహా శివరాత్రి
మహా శివరాత్రి మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్ధశి రోజున వస్తుంది. శివుడు ఈ రోజు లింగాకారంలో ఆవిర్భవించాడని ‘‘శివపురాణం’’ తెలియజేస్తోంది. ఈ పర్వదినం ప్రధానంగా శివుడికి ‘‘బిల్వ పత్రాలు’’ సమర్పించి, రాత్రి అంతా జాగరణ చేసి అభిషేకములు, అర్చనలూ జరుపుతారు. పూర్వం శ్రీశైల క్షేత్రములో జరిగే ఉత్సవమును పాల్కురికి సోమనాథుడు పండితారాద్య చరిత్రలో విపులంగా వర్ణించాడు. చతుర్దశి తిథి అర్థరాత్రి సమయములో లింగోద్భవం జరిగినట్లు స్కాందపురాణం తెలియజేస్తోంది. పన్నెండు జ్యోతిర్లింగాలలో ఈ రోజు శివుడికి ఆరాధన విశేషంగా జరుగుతుంది. నేపాల్లోని పశుపతినాథ్ ఆలయంవద్ద ప్రపంచంలోని భక్తి ప్రపత్తులతో హాజరవుతారు.
ఇతిహాసం ప్రకారం దేవతలు సముద్ర మథనం చేసినప్పుడు ముందుగా హాలాహాలం ఉద్భవిం చింది. లోకకళ్యాణం కోసం పరమ శివుడు ప్రాణులను రక్షించడానికి ఘోరమైన హాలాహలం స్వీకరించి తన కంఠములో నిలపటం జరిగింది. విషప్రభావం చేత శివుడి కంఠం నీలంగా మారటం వలన ఆయనకు గరళ కంఠుడు, నీల కంఠుడు అను పేర్లు వచ్చాయి. అందుచేత శివుడిని మంగళాకరుడుగా, లోకకల్యాణకారకుడుగా భావించి శివరాత్రి రోజు ఆరాధిస్తారు.