శ్రీనగర్ లో చారిత్రాత్మక ఘట్టం… 35 ఏళ్ల తర్వాత శివలింగ పున: ప్రతిష్ఠ

శ్రీనగర్ లో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. 35 సంవత్సరాల తర్వాత గత నెల 28 వ తేదీన శ్రీనగర్ లోని రైనావరిలో చారిత్రాత్మక జోగేశ్వరీ ఆలయంలో శివలింగాన్ని కశ్మీరీ పండితులు తిరిగి ప్రతిష్ఠించారు. ఈ సమయంలో కశ్మీరీ పండితులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 1990 ప్రాంతంలో పాకిస్తాన్ ప్రాయోజిత ఇస్లామిక్ ఉగ్రవాదం విపరీతంగా వుండేది. ఈ సమయంలోనే జోగేశ్వరీ ఆలయంలో వుండే శివలింగాన్ని అపవిత్రం చేసి, రైనావారి కాలువలో విసిరేశారు. ఆ సమయంలో స్థానిక హిందువులు తీవ్ర మనోవేదనకు లోనయ్యారు. ఆ సమయంలోనే పోలీసులు శివలింగాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆలయంలో ప్రతిష్ఠించకుండా… పోలీస్ స్టేషన్ లోనే వుంచారు.

ఇన్నేళ్ల తర్వాత తిరిగి ‘‘జీలం మందిర్ ట్రస్ట్’’ సహకారంతో రైనావారీ కశ్మీరీ పండిట్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో శివలింగ పున: ప్రతిష్ఠ జరిగింది. ఇప్పుడు 35 సంవత్సరాల తర్వాత, శ్రీనగర్ స్పెషల్ మేజిస్ట్రేట్ ఆదేశాన్ని అనుసరించి, రైనావారీ కాశ్మీర్ పండిట్ కమిటీ రైనావారీ పోలీస్ స్టేషన్ నుండి శివలింగాన్ని తిరిగి తీసుకున్నారు. సంప్రదాయంగా జరగాల్సిన క్రతువులు, పూజలు, హోమాలు చేసి, శివలింగాన్ని తిరిగి ప్రతిష్ఠించారు.

ఇది విశ్వాసాల విజయమని జోగేశ్వరి ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు జలాలి అభివర్ణించారు. చాలా రోజుల తర్వాత కశ్మీరీ పండితుల నిశ్శబ్దమైన పోరాటం ఫలించిందన్నారు.ఇది కేవలం రాయి కాదని, తమ విశ్వాసానికి ప్రతిరూపం అంటూ భావోద్వేగంతో ప్రకటించారు.

రైనావారి నడిబొడ్డున జోగేశ్వరి ఆలయం వుంది. అత్యంత పవిత్రమైన ప్రదేశం. ఒకప్పుడు అమరనాథ్ యాత్రకు వెళ్లే సాధువులకు విశ్రాంతి స్థలంగా వుండేదని స్థానికులు పేర్కొన్నారు. ఇప్పటికీ సరిగ్గా లేని దేవాలయాల రక్షణ, పునరుద్ధరణ కోసం కూడా కదలాలని సూచించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *