షోడశ (పదహారు) సంస్కారాలు
భారతీయ కుటుంబ వ్యవస్థలో సంపదలకంటె సంస్కారాలకు ప్రాముఖ్యతనిచ్చారు. పిల్లలకు సంపదలివ్వకపోయినా ఫరవాలేదు, కాని సంస్కారాలు ఇవ్వకపోతే చాల లోపం చేసినట్లే. అందుకే మన కుటుంబ జీవనంలో 16 సంస్కారాల గురించి చెప్పారు. ఇందులో కొన్ని పుట్టుటకు ముందు, కొన్ని పుట్టిన తరువాత ఉంటాయి. మొదటి మూడు పుట్టుకకు ముందు సంస్కారాలు.
- గర్భదానం: భార్య భర్తల ప్రథమ సమాగమ సమయంలో చేసే సంకల్పం, ఇది గర్భ శుద్ధి సంస్కారం. జీవుడు తల్లి గర్భం నుంచే బయటకు రావాలి. అందుకు మంత్రచ్ఛరణ ద్వారా ఈ శుద్ధి జరుగుతుంది. చక్కటి సంతానం కోసం దంపతులు ఆలోచించేలా చేసే ప్రక్రియ, దంపతుల మనసులు కలిపే సంస్కారం ఇది.
- మనలోని చెడును దూరం చేసేది సంస్కారం. ప్రంసవనం అనేది రెండోది. మర్రిచెట్టు కాయలరసం ముక్కులోవేస్తే ఆ తల్లిలో పెరుగుతున్న శిశు బీజం గట్టిపడుతుంది. ఆధునిక కాలంలో దీన్ని టశీశ్రీఱష aషఱస అంటున్నారు.
- సీమంతం: గర్భం దాల్చిన స్త్రీ నాడీ వ్యవస్థను గట్టిపరచే ప్రక్రియ. ఆ స్త్రీ పాపిడిని సరిచేసే నాడీవ్యవస్థ బలోపేతమవుతుంది. ఆ స్త్రీకి ఇష్టమైన భగవంతుడి నామాన్ని ఉపదేశించడం జరుగు తుంది. గర్భంలో ఉండగానే భగవంతుడిపై శిశువుకు భక్తిని కల్గించే పద్ధతి ఇది. ఇందుకు ప్రహ్లాదుడే ఉదాహరణ.
- జాతకర్మ: శిశువు జన్మించే సమయంలో ముందు తల బయటకు వస్తుంది. తరువాత ముక్కు బయటకు వచ్చిన సమయం జనన సమయంగా నిర్ణయించి పుట్టిన తేది, సమయం, తిథి, వార, నక్షత్రాలననుసరించి జాతకచక్రం వేస్తారు. శిశు జననం సులభం జరిగేందుకు జరిగే ప్రయత్నమూ ఇందులో భాగమే.
- నిష్క్రమణం: మొదటిసారిగా శిశువును ఎండలో సూర్యరశ్మికి తగిలించడం, సూర్యరశ్మిలోని విటమిన్ల ద్వారా శిశువులోని ఆరోగ్యదోషం పరిహారం కావాలన్నది ఆకాంక్ష.
- నామకరణం: సమాజంలో ఒక గుర్తింపు నిచ్చేది నామకరణం. బారసాల అంటారు. కొందరు 21 రోజున, కొందరు 3 నెలల తరువాత శిశువు నామకరణం చేస్తారు. తల్లిదండ్రులు తమ ఆశల ప్రతిరూపంగా భావించే తమ శిశువుకు వారి ఆకాంక్షల మేరకు పేరు పెట్టుకుంటారు. పేరుకు తగ్గ ప్రేరణలో ప్రాపకం కూడా ఉండాలి.
- అన్నప్రాసన: శిశువు శారీరక వికాసం కోసం ఇది అవసరం. శిశువుకు ఏళ్లు వచ్చిన తరువాత ఇది చేస్తారు. తల్లి పాలతరువాత శిశువు అన్నం తినడం ప్రారంభిస్తాడు.
- చూడాకరణం: మొదటి సంవత్సరంలో గాని, 3వ సంవత్సరంలో గాని పుట్టు వెంట్రుకలు తీయించడం. దీనివల్ల దీర్ఘాయుష్షు, అందం శిశువుకు లభిస్తుంది.
- కర్ణవేధ: చెవులు కుట్టించడం, ఇది ఎక్కువగా ఆడపిల్లలకు చేస్తూంటారు. ఏడేళ్లలో చేస్తారు. దీనివల్ల అందంతో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది.
- అక్షరాభ్యాసం: శిశువు మనకు తగినంతగా పరిపక్వత చెందిన తరువాత విషయ పరిజ్ఞానం కోసం ముందు అక్షరాలు నేర్చుకోవాలి. అక్షరం శివుడి ఢమరుక శబ్దం నుంచి ఉత్పన్నమయింది. అందుకే అక్షరాభ్యాస సమయంలో ఓం నమఃశివాయ అని దిద్దిస్తారు.
- ఉపనయనం: మగ పిల్లలను గురువు దగ్గరకు పంపేముందు జరిగే సంస్కారం. దీనివల్ల పిల్లల్లో క్రమ శిక్షణ వస్తుంది. సూర్యుణ్ణి ఉపాసిం చడం ద్వారా పిల్లల్లో చక్కని ప్రకాశం కల్గుతుంది.
- వేదారంభం: దీనే విద్యాభ్యాసం, విద్యార్జన అనవచ్చు.
- కేశాంత: 16 ఏళ్ళు వచ్చిన బాలుడు మొదటిసారి గడ్డం తీసుకోవడానికి సంబంధించింది. బ్రహ్మచర్య ప్రాధాన్యతను తెలియజేస్తుంది.
- సమావర్తన: చదువు ముగించుకొని ఇంటికి రావడం. దీన్నే స్నాతకం అని కూడా అంటారు. గృహస్థ జీవనానికి సిద్ధపడడం
- వివాహం: ఒకరు ఇద్దరవుతారు. భారతీయ జీవనంలో కుటుంబ జీవనం, సంసార జీవనం ప్రారంభమవుతుంది. భార్య భర్తలు ఒకరికొకరు తోడుగా దశాబ్దాల పాటు కుటుంబ జీవనం సాగిస్తారు.
- అంత్యేష్ఠి: హిందువు తన జీవితాన్ని వివిధ దశల్లో వివిధ సంస్కారాల ద్వారా పవిత్రం చేసుకున్న తరువాత మరణానంతరం అతడు లేదా ఆమె వారసులు వారికి సద్గతులు కలగాలని చేసే దహన సంస్కారం, ఉదక కర్మ, దానాలు, పిండప్రదానం ఇందులోకి వస్తాయి.
– హనుమత్ ప్రసాద్