శ్రీ నృసింహ జయంతి

మే 22 న‌ృసింహ జయంతి

శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో నాలుగవ అవతారం నారసింహావతారం. కశ్యప ప్రజాపతికి దితి గర్భాన హిరణ్యాక్ష, హిరణ్య కశ్యపులనే మహా వీరులైన రాక్షసులు జన్మించారు. హిరణ్యాక్షుడిని వరాహరూపంలో ఉన్న మహా విష్ణువు వధించాడు.

సోదరుని మరణానికి చింతిస్తూ హిరణ్య కశ్యపుడు మందరగిరికి పోయి బ్రహ్మ గురించి ఘోర తపస్సు ఆచరించాడు. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకొమ్మనగా, సోదరుని మరణానికి ప్రతీకారం తీర్చుకోదలచిన హిరణ్యకశ్యపుడు తనకు గాలిలో కానీ, ఆకాశంలో కానీ, భూమిపై కానీ, నీటిలోకానీ, రాత్రికానీ, పగలుకానీ దేవ, దానవ, మనుష్యుల వలన కానీ, జంతువులచేత కానీ, ఆయుధముచేత కానీ, ఇంట కానీ, బయట కానీ మరణం ఉండకూడదని కోరుకున్నాడు.

వరగర్వంతో హిరణ్యకశ్యపుడు విజృంభిం చాడు. దేవతలను జయించి ఇంద్ర సింహాసనం ఆక్రమించాడు. కానీ హిరణ్యకశ్యపుని కుమారుడు ప్రహ్లాదుడు పరమ భాగవతుడు. సృష్టి సర్వం విష్ణుమయం అంటూ తన కొడుకైన ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు కావడం రాక్షస రాజుకు కోపం తెప్పించింది. ప్రహ్లాదుడిని అనేక రకాలుగా హింసింపచేసాడు. స్తంభంలో విష్ణువును చూపగలవా అని గద్దించి చేతితో స్తంభంపై చరిచాడు. బ్రహ్మండం బ్రద్దలయ్యే శబ్దంతో పది దిక్కుల నిప్పురవ్వలు ఎగిసాయి. కరుణ వీర రస సంయుతుడైన శ్రీ నృసింహదేవుడు ఆ స్తంభం నుండి ఆవిర్భవించాడు. నృసింహదేవుడు భీకరంగా హిరణ్యకశ్యపుని ఒడిసిపట్టి తన ఒడిలో వేసుకొని వజ్రం వంటి తన గోళ్ళతో, పగలూ, రాత్రి కాని సంధ్యా కాలంలో, ఇంటా, బయట కాక గుమ్మంలో, భూమిపైన, ఆకాశంలో కాకుండా తన తొడపైన హిరణ్య కశ్యపుని సంహరించాడు.

శ్రీ నృసింహా అవతారం ఆవిర్భవించిన ప్రదేశము ‘‘మూలస్థానం’’గా ప్రసిద్ధిపొందింది. ఈ స్థలం ఇపుడు పాకిస్తాన్‌లోని పంజాబు రాష్ట్రంలో ‘‘ముల్తాన్‌’’గా పిలువబడుతోంది. శ్రీ నరసింహ స్వామి ఆవిర్భవించిన వైశాఖ శుద్ధ చతుర్ధశి నాడు నృసింహ జయంతిగా జరుపుకొంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *