ప్రధాని మోదీతో భేటీ అయిన వ్యోమగామి శుభాంశు శుక్లా
తొలి భారతీయ వ్యోమగామి, గ్రూపు కెప్టెన్ శుభాంశు శుక్లా సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. వ్యోమగాములు ధరించే ప్రత్యేక జాకెట్ తో లోక్ కల్యాణ్ మార్గ్ లోని ప్రధాని అధికారిక నివాసానికి శుక్లా రాగానే.. మోదీ ఆయనకు ఆప్యాయంగా స్వాగతం పలికి హత్తుకున్నారు. భుజంపై చేయి వేసి మరీ, నడుస్తూ ఆయనతో మాట్లాడారు.
మరోవైపు తనతో పాటు అంతరిక్షంలోకి తీసుకెళ్లిన త్రివర్ణ పతాకాన్ని, యాక్సియం -4 మిషన్ కి సంబంధించిన జ్ఞాపికను శుక్లా ప్రధానికి అందజేశారు. అలాగే అంతరిక్షం నుంచి తాను తీసిన కొన్ని చిత్రాలను ట్యాబ్లెట్ కంప్యూటర్ లో చూపించి, వాటి గురించి ప్రధానికి వివరించారు.
మరో వైపు ఈ భేటీపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ మాధ్యమంగా స్పందించారు. అంతరిక్ష అనుభవాలు శాస్త్ర సాంకేతికత పురోగతి, గగన్ యాన్ మిషన్ వంటి వాటిపై శుభాంశుతో చర్చించానని, ఆయన సాహసాన్ని చూసి దేశం గర్విస్తోందని మోదీ పోస్ట్ చేశారు.