సామూహిక, సేంద్రీయ వ్యవసాయంతో ఆర్థిక స్వావలంబన దిశగా ఒంటరి మహిళలు

అత్యంత కరువు ప్రాంతమైన అనంతపురంలో ఓ నిశ్శబ్ద విప్లవం నడుస్తోంది. REDS అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఒంటరి మహిళలు, వితంతువులు వ్యవసాయంలో కొత్త పుంతలు తొక్కుతూ.. ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు. సామూహికంగా మహిళలు ఒక్క చోట చేరి, సహజ వ్యవసాయాన్ని చేస్తున్నారు. దీంతో లాభాలు కూడా ఆర్జిస్తున్నారు.

భర్తలు వివిధ కారణాల రీత్యా ఆత్మహత్యలు చేసుకోవడమో, లేదా వివిధ కారణాల రీత్యా ఒంటరైన మహిళలు సమాజంలో తిరిగి బలాన్ని పుంజుకుంటున్నారు. ఈ బలం వ్యవసాయం చేయడం ద్వారా పుంజుకోవాలని భావించడం ముదావహం. వ్యవసాయం చేస్తూ ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. ఎలాంటి రసాయనాలు లేకుండా, కేవలం సేంద్రీయ, సహజ పద్ధతుల్లో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, చిరు ధాన్యాలను పండిస్తున్నారు. స్థానికంగా పంటను ఉత్పత్తి చేస్తూ.. జీవనోపాధిని సుస్థిరం చేసుకున్నారు.

నిజానికి అనంతపురంలోని కురుగుంట అనే గ్రామంలో REDS అనే స్వచ్ఛంద సంస్థ 8 ఎకరాల వ్యవసాయ భూమిని లీజుకు తీసుకుంది. ‘‘మన భూమి-ఉమెన్ కలెక్టివ్ నేచురల్ ఫార్మింగ్ అనే బ్యానర్ కింద మహిళలతో సామూహిక, సేంద్రీయ వ్యవసాయాన్ని చేయిస్తోంది. ఒంటరి మహిళల జీవితాల్లో ఆర్థిక స్వావలంబన, పరిపుష్టి తీసుకురావాలన్న లక్ష్యంతో వారినే ఎంపిక చేసింది సంస్థ. అయితే.. ఈ సంస్థే పెట్టుబడిని, విత్తనాలను కూడా అందిస్తుంది.అంతేకాకుండా పంట పండిన తర్వాత కూడా ఈ మహిళలే హక్కును కలిగి వుంటారు.

అందరూ ఒంటరి మహిళలే. అయినా కుంగిపోలేదు. ధైర్యాన్ని కూడగట్టుకున్నారు. అందరూ కలిసి ఓ సమూహంగా ఏర్పడ్డారు. వాట్సాప్ గ్రూపును కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ గ్రూపు అనంతపురంలో వుండే కొనుగోలుదారులతో అనుసంధానమై వుంటుంది. ఇందులో రోజువారీ పంట వివరాలను మహిళలు వుంచుతారు. సేంద్రీయ పద్ధతిలో పండించిన కూరగాయలు, పండ్లు కాబట్టి డిమాండ్ కూడా బాగానే వుంది.

అయితే.. మొదట ఈ మహిళలు తక్కువ ఖర్చుతో వుండే మిల్లెట్లను పండించడం ప్రారంభించారు. ఆ తర్వాత ఏడాది పొడవునా స్థిరమైన ఆదాయం కోసం కూరగాయలు, పండ్ల పంటలకు మారారు. ఈ మార్పే వారి జీవితంలో పెద్ద కీలక మలుపుగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *